9, నవంబర్ 2014, ఆదివారం

అపాత్ర దానం !


అవంతీ పురాన్ని పాలించే రాజు గుణ శేఖరుడు గొప్ప దాన గుణం కలవాడు. అతని చేతికి ఎముక లేదని అందరూ చెప్పుకునే వారు. యాచకుల పాలిట కల్ప వృక్షంలా ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా కాదనే వాడు కాదు. దాంతో ఆ రాజ్యంలో యాచకుల సంఖ్య తామర తంపరగా పెరిగి పోయింది. రాజ్యంలో ప్రజలందరూ ఒట్టి సోమరులయ్యేరు. రాజు గారిచ్చే దానాలతో వారికి సుఖంగా గడిచి పోతూ ఉండేది. ఊర్లో ఎక్కడ చూసినా, రాజు గారు స్థాపించిన చిత అన్న దాన సత్రవులే !  అక్కడ ముప్పూటలా అన్న దానం జరుగుతూ ఉండేది. ఇలా రాజు గారు క్రిందా మీదా చూడకుండా దానాలు చేస్తూ ధనం ధారాళంగా వ్యయం  చేయడంతో కోశాగారం ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది. ప్రధాన మంత్రి వివేక వర్ధనుడు ఇదంతా గమనించి ఆందోళన చెందాడు. ఎలాగయినా పరిస్థితి చక్క దిద్దా లనుకున్నాడు. మహా రాజుని కలుసుకుని,  దాన గుణం  ప్రభువులకు ఉచితమే కానీ,  అనుచిత దానాలూ, అపాత్ర దానాలూ చేటు తెస్తాయని ఎంతగానో నచ్చ చెప్పి చూసాడు. భాండాగారంలో ధనం నిల్వలు తగ్గి పోతాయనీ, అదే అదనుగా శత్రువులు రాజ్యం మీదకి దండెత్తి వచ్చే ప్రమాదం ఉందనీ ఎంతగానో వివరించి చెప్పాడు. అయితే,  రాజు మంత్రి మాటలు విన లేదు.  సరికదా, అతని మీద ఆగ్రహించి,  మంత్రి పదవి నుండి తొలగించి, రాజ్య బహిష్కారం శిక్ష విధించాడు !
మహా మంత్రి బాధ పడుతూ రాజాఙ్ఞ తల దాల్చి రాజ్యం విడిచి వెళ్ళి పోయాడు.
    అయితే, వివేక వర్ధనుడు రాజ్యం విడిచి దూరంగా ఏమీ వెళ్ళి పో లేదు. కొంత మంది నమ్మకస్థులయిన పరివారంతో రాజధానికి సమీపంలోనే అడవిలో రహస్యంగా ఉంటూ వచ్చేడు.  తగిన సమయం చూసి రాజుకి కళ్ళు తెరిపించాలని పొంచి ఉన్నాడు.  కొంత కాలం గడిచాక, వివేక వర్ధనుడు గుణ నిధి రాజ్యమంతటా వ్యాపించేలా ఒక పుకారు లేవదీసాడు. శత్రురాజులంతా ఏకమై ఒక్క సారిగా గుణ నిధి రాజ్యం మీదకి దండెత్తి రాబోతున్నారని పుకారు పుట్టించాడు. రాజు తన వేగులను సమావేశ పరచి ఆ వార్త గురించి అడిగాడు.  రాజు చాలా కాలంగా దాన ధర్మాంటూ రాజ్య పాలనను నిర్లక్ష్యం చేడంతో వేగులు కూడా తమ విదుల పట్ల అంతే అలసత్వంతో ఉంటున్నారు. అంచేత వాళ్ళు అందు లోని నిజానిజాలు పరిశీలించ కుండానే అది నిజమేనని రాజుకి చెప్పారు ! దానితో రాజులో ఆందోళన ఎక్కువయింది.  కోశాగారం పూర్తిగా ఖాళీ అయింది. జీత భత్యాలు  అందక సైనికులు నిస్తేజంగా ఉన్నారు.  వాళ్ళు తన కోసం నిండు మనసుతో పోరాడుతారో, లేదో తెలియదు !  ప్రజలంతా కూడా ఒట్టి పోమరులుగా తయారయ్యేరు. రాజుకి ఏమీ తోచ లేదు.
      ఈ పరిస్థితిలో మంత్రి వివేక వర్ధనుడు మారు వేషంలో రాజు వద్దకు వచ్చేడు.  రాజుతో ఇలా అన్నాడు :  ‘‘ మహా రాజా ! నేను లోగడ తమ నుండి అపార ధనరాశులను కానుకగా పొంది ఉన్నాను. ఇప్పుడు రాజ్యం తీవ్రమయిన సంక్షోభంలో పడి ఉందని తెలుస్తోంది.  అందు చేత తమరు నాకు లోగడ ఇచ్చిన ధనం యావత్తూ తమకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే, ప్రభువులు మన్నించాలి. యుద్ధం ముగిసేక,  నేనిచ్చిన ధనానికి రెట్టింపు ధనం తమరు నాకు ఇప్పించ వలసినదిగా కోరు తున్నాను.  మన రాజ్యంలో తమ నుండి కానుకలు పొందిన వారంతా ఇలాగే చేస్తే తమ కోశాగారం నిండటమే కాక, శత్రువులతో యుద్ధం చేయడం తేలికవుతుంది.  యుద్ధం ముగిసాక ఎలాగూ వారిచ్చిన ధనానికి తమరు రెట్టింపు ధనం ఇవ్వనున్నారు కనుక ఎవరూ సంశయించ కుండా ఆ ఆశతోనయినా తాము లోగడ మీనుండి పొందిన ధనం తెచ్చి తమకు సమర్పిస్తారనే నా నమ్మకం ! ’’ అని చెప్పాడు.  రాజు కోశాగారం నిండడానికి మరో మార్గం లేదు కనుక, అందుకు సరేనని రాజ్యమంతాటా ఆ మేరకు చాటింపు వేయించాడు.
    చిత్రం ! రోజులు గడుస్తున్నాయి కానీ, ఏ ఒక్కరూ రాజ్యానికి నిధులు సమకూర్చడం లేదు ! కారణం ఏమై ఉంటుందా ! అని రాజు ఆరాతీసాడు. యుద్ధంలో రాజు గెలుస్తాడని  నమ్మకం ఏమిటి ?           గెలిచినా, మనకి తిరిగి రెట్టింపు ధనం ఇస్తాడని ఏమిటి నమ్మకం ! అని ప్రజలంతా భావిస్తున్నట్టుగా గ్రహించాడు !
    దానితో రాజుకి మనసంతా వికలమై పోయింది.  రాజ్యం విడిచి పెట్టి అడవులకు వెళ్ళి పోవాలని నిశ్చయించు కున్నాడు. సరిగ్గా ఆ దశలో  మంత్రి వివేక వర్ధనుడు రాజు ఎదుట పడి ఇలా అన్నాడు : ‘‘ రాజా ! తమ అనుమతి లేకుండా తమ ఎదుటికి వచ్చినందుకు మన్నించాలి ! ఇప్పుడు మన రాజ్యానికి వచ్చిన ఆపద ఏమీ లేదు ! ఇదంతా నేను కల్పించిన పుకారు !  మన శత్రు రాజ్యాలలో కూడా మన రాజ్యంలో మీవలన లబ్ధి పొందిన ప్రజలంతా తమకు అపారమయిన ధనరాశులు  సమకూరుస్తున్నారనీ,  మన రాజ్యం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రాణ త్యాగం చెయ్యడానికి కూడా తమ వెంట ఉన్నారని పుకారు లేవ దీసాను ! దానితో  ఇక ముందు కూడా మన దేశం మీదకి దండెత్తి రావడానికి ఎవరూ  సాహసించ లేరు ! ఇప్పటికయినా ప్రభువులు వాస్తవాన్ని గమనిస్తారని
 ఆశిస్తాను ! ’’ అని ముగించాడు.
   గుణ వర్ధనుడు మహా మంత్రి మాటలతో పరివర్తన చెందాడు. రాజ ధర్మంగా దానాలు చేయడం మాన లేదు కానీ,  అపాత్ర దానాలు చేయడం  మాత్రం మాను కున్నాడు. వివేక వర్ధనుని తిరిగి తన కొలువులో  మహా మంత్రిగా నియమించాడు.
       అవంతీ రాజ్యం త్వరలోనే సుభిక్ష మయింది !

2 వ్యాఖ్యలు:

Padmarpita చెప్పారు...

భలే బాగుందండి చిట్టికధ

పంతుల జోగారావ్ చెప్పారు...

ధన్యవాదాలండీ పద్మార్పిత గారూ !