3, సెప్టెంబర్ 2014, బుధవారం

తిక్కలోడి కథ !వాడి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు, అందరూ వాడిని తిక్కలోడనే పిలుస్తారు.వాడికి ఇరవై యేళ్ళొచ్చినా, వాడికింకా స్థిరత్వం ఏర్పడ లేదు. జులాయిగా తిరగడం. ఎవరేం చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఇదీ వాడి వరస !ఎడ్డెమంటే, తెడ్డెమనే రకం అన్నమాట.అవునంటే కాదనీ, కాదంటే అవుననీ వాదించడం వాడి అలవాటు. వాడి మంకుతనం చూసి, అందరూ విసిగి పోయారు.ఎవరేం చెప్పినా వినిపించుకునే వాడు కాదు.  తనకు తెలిసినా, పంతం కోసం తిక్కగా వాదించే వాడు.అదంటే ఇదనీ, ఇదంటే అదనీ తెగ విసిగించే వాడు.
తల్లీ తండ్రీ చిన్నప్పుడే పోవడం చేత , అవ్వ దగ్గర పెరిగాడు. ముసిలావిడ కూడా వాడికి చాకిరీ చేయ లేక విసిగి పోతూ ఉండేది. వాడి వితండ వాదనతో ఆవిడకి నీరసం వొచ్చేది.
       అది వండితే, ఇది వండమని పేచీ పెట్టే వాడు.
        వాడు వండమన్నదే వండి పెడితే , మరోటి ఎందుకు వండ లేదని కంచం      విసిరి కొట్టే వాడు.
          అన్నం తిందువుగాని రారా అంటే, ఊళ్ళో తిరిగొస్తానని ఎక్కడికో వెళ్ళి పోయే వాడు.
           వంటింకా కాలేదు, అలా తిరిగిరా ,నాయనా ! అంటే, అన్నం వడ్డించమని పీకల మీద కూర్చునే వాడు !
             తిక్కలోడితో  వేగ లేక ఓ రోజు అవ్వ వాడితో ఇలా అంది : ‘‘ఒరే, తిక్కలోడా ! నీతో నేను మరింక వేగ లేను.కాశీకి పోతాను. మనింట్లో రెండు సీనా రేకు పెట్టెలు ఉన్నాయి కదా !ఒకటి ఎరుపు రంగుది. రెండోది. నలుపు రంగుది. వాటిలో ఒక దానిలో నాకున్న డబ్బూ దస్కం, నగా నట్రా దాచి ఉంచుతాను. వాటితో పాటు,  నాకున్న అరెకరం భూమి కాగితాలు కూడా దాచి ఉంచుతాను.  రెండింటికీ తాళాలు వేసి ఉంచుతాను. రేపు తెల్లారేక నువ్వు వాటిలో ఒక పెట్టెను ఎంచుకుని తెరువు. నువ్వు నగలూ, డబ్బూ, దస్తావేజులూ ఉన్న పెట్టెను ఎంచు కున్నావనుకో , ... ఆ మొత్తం ఆస్తిని నీకే వదిలి పెట్టి నేను కాశీ పోతాను. మరింక తిరిగి రాను. ఒక వేళ నువ్వు ఖాళీ పెట్టెను ఎంచు కున్నావనుకో !
నీ ఖర్మ ! నీకొక్క ఎర్ర ఏగాణీ దక్కకుండా అంతా నేను పట్టుకు పోతాను. అంతే ... నీ తిక్కలతో నేను   పడలేను మరి ! ’’ అంది.
     ఆ రాత్రి  - మరి తిక్కలోడికి నిద్ర పట్ట లేదు. తెల్లారేక పెట్టె తెరవమని చెప్పింది అవ్వ. కానీ ,తిక్కలోడు అంత దాకా ఆగ లేక సోయేడు. అర్ధ రాత్రి వేళ అవ్వ పడుకున్నాదని నిర్ణయించుకుని, వెళ్ళి, ఆ రెండు పెట్టెలూ తెరిచి చూసాడు. నగా నట్రా ఎరుపు రంగు పెట్టెలో ఉండడాన్ని గమనించాడు, తిరిగి  పెట్టెలకు తాళాలు వేసి, ఏమీ ఎరుగనట్టుగా వెళ్ళి పడుకున్నాడు.
      మర్నాడు ఉదయం అవ్వ తిక్కలోడిని రెండు పెట్టెలలోనూ ఒక దానిని ఎంచుకో మంది.
తిక్కలోడు బాగా ఆలోచించాడు. కాసేపు ఏం చేదామా అని గుంజాటన పడ్డాడు. ఆలోచనతో తల బ్రద్దలవుతోందే కానీ , ఒక నిర్ణయానికి రాలేక పోయేడు.
      అవ్వ దాచిన నగలూ, డబ్బూ అవీ ఎరుపు రంగు పెట్టెలో ఉన్నాయని తెలుసు ... కానీ సహజంగా వాడికుండే తిక్క గుణం వల్ల, నలుపు రంగు పెట్టెను ఎంచుకున్నాడు !
    కానీ, చిత్రం ! వాడు ఎంచుకున్న నలుపు రంగు పెట్టెలోనే అన్నీ ఉన్నాయి !
     అవ్వ నవ్వుతూ ‘‘ ఇవన్నీ ఇక నీవే! తీసుకో ! ’’ అంటూ పెట్టెను వాడి చేతిలో పెట్టింది.
తిక్కలోడు ఎప్పటిలాగే. నాకొద్దు పొమ్మన్నాడు!
    కానీ ,ఒక క్షణం పోయేక, అదంతా అవ్వ కావాలనే చేసిందని వాడికి తోచింది. తను ఆ రాత్రి పెట్టెలు రెండూ తెరవడం అవ్వ గమనించిందనీ, తనెలాగూ తలతిక్కగా నగలు ఉంచిన ఎరుపు రంగు పెట్టెను కాకుండా నలుపు రంగు పెట్టెనే తెరుస్తాడని ఊహించి, నగలూ. డబ్బూ దస్కం అందు లోకి మార్చివేసింది ! ఎలాగయినా తనకు అవి దక్కాలనే అవ్వ కోరిక అని వాడికి అర్ధమయిపోయింది.
    ‘‘ ఈ తిక్కలోడంటే, నీకెంత ఇష్టమే అవ్వా ! ’’ అనుకున్నాడు మురిపెంగా. ఆతరువాత వాడిలో మంచి మార్పు వచ్చింది. నాలుగు రోజులుండి తిరిగి వచ్చే ఒప్పందంతో అవ్వని తీర్ధయాత్రలకి స్వయంగా పంపించాడు. మరెప్పుడూ అవ్వ మనసు కష్ట పెట్టనని అవ్వకి ప్రమాణం చేసాడు.
  ఆ తర్వాతి రోజులలో ఊరివాళ్ళంతా వాడిని తిక్కలోడని కాకుండా, వాడి అసలు పేరుతోనే పిలవడం మొదలెట్టారు !
         ఇంతకీ వాడి అసలు పేరేమిటో చెప్పనే లేదు కదూ ?!
          తిక్కలోడు మాత్రం కాదు !