2, నవంబర్ 2014, ఆదివారం

జగడాల పల్లె !జగడాల పల్లె అసలు పేరు పద్మా పురం.  ఒకప్పుడు ఆగ్రామంలో పట్టుమని పది గడపలు కూడా ఉండేవి కావు. కానీ ఆఇళ్ళ వారికి ఎప్పుడూ ఒకరంటే ఒకరికి పడేది కాదు !  ఎప్పుడూ ఎందుకో ఒకందుకు గొడవలు పడుతూనే ఉండే వారు. ప్రతి చిన్న విషయానికీ ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దువ్వుతూ ఉండే వారు.  అందుచేత ,చుట్టు ప్రక్కల గ్రామాల వారికి ఆఊరంటే చులకన భావం ఏర్పడి పోయింది.  ధర్మా పురాన్ని అందరూ జగడాల పల్లె అని వేళాకోళం చేస్తూ ఉండే వారు.
        పద్మా పురానికి చెందిన వర్ధన రావు అనే యువకుడికి మాత్రం తమ గామ ప్రజల ప్రవర్తన తల కొట్టేసినట్టుగా ఉండేది. చాలా సంవత్సరాలు పెద్ద చదువుల కోసం పెద్ద పట్టణాలలో గడిపాడేమో, , వాడిలో  లోకానుభవం వల్ల చక్కని సంస్కారం ఏర్పడింది. గ్రామస్థుల కజ్జాకోరు తనం వల్ల ఊరికి చెడ్డ పేరు వస్తోందని వాడు దిగులు చెందుతూ ఉండే వాడు. మంచిగా చెప్తే వాళ్ళు వినరని అతడికి తెలుసు. ఏదో విధంగా ఊరి ప్రజలలో మార్పు తీసుకుని రావాలని అతడు నిర్ణయించు కున్నాడు.
     ఇలా ఆలోచించి, ఒక రోజు రాత్రి ఎవరూ చూడకుండా ఒక తోడేలు బొమ్మ ఉండే పతాకాన్ని ఒక యింటి కప్పు మీద ఉంచేడు.  దానితో ఆ ఇంటి యజమాని భయపడి పోయి మర్నాడు ఉదయాన్నే  వర్ధన రావు దగ్గరకి వచ్చి ఆ విషయం చెప్పాడు. గోవర్ధన రావు అతని భయం మరింత రెట్టింపు అయ్యేలా మాట్లాడేడు.  అదేదో అరిష్ట పతాకంలా ఉందని అన్నాడు. దాని విషయమై తాను పట్నం వెళ్ళి ప్రముఖ సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుని వస్తానని అభయమిచ్చాడు. హమ్మయ్య ! ఆ పని త్వరగా చేద్దూ, నీకు పుణ్యం ఉంటుంది ! ’’అని  బ్రతిమాలి అతడు వెళ్ళి పోయేడు.
     ఆ తరువాత అలాగే వరుసగా ప్రతి రాత్రీ అందరి ళ్ళ మీదా అలాంటి పతాకాలే ఉంచడం మొదలు పెట్టాడు వర్ధన రావు. భయంతో తన దగ్గరకి పరుగెతు కొచ్చిన అందరికీ  అవి అరిష్ట పతాకాలే ! అని నమ్మబలికే వాడు. దానితో ఊరంతా గగ్గోలెత్తి పోయింది ! వాటి విషయమై వెంటనే పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కు రమ్మని అతని మీద  ఒకరోకరే ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు.  ఇదిగో, అదిగో ! అంటూ వర్ధన రావు వారిని ప్రతి రోజూ త్రిప్పి పంపించేస్తున్నాడు. దానితో ఊరి వాళ్ళు విసిగి పోయేరు.  ఇక లాభం లేదని, వొక రోజు ఆ ఇళ్ళ జమానులందరూ కలసి కట్టుగా వర్ధన రావు దగ్గరకి వచ్చి దీనంగా ఇలా వేడు కున్నారు : ‘‘ అరిష్ట పతాకాల గురించి పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కు రమ్మని  అడిగితే ఇన్ని రోజులూ వెళ్తానంటూనే జాప్యం చేస్తున్నావు !  మన గ్రామంలో చదువు కున్న వాడివి నువ్వొక్కడివే. మేం ఎవరం ఎప్పుడూ పట్నం మొహం చూసి రుగని
వాళ్ళం ! పట్నం భోగట్టాలు తెలిసిన వాడివని నీ సాయం కోరితే, నువ్వేమో రోజుల తరబడి దాట వేస్తున్నావు. అరిష్ట పతాకాల వల్ల మా ఎవరికీ రాత్రిళ్ళు కంటికి నిద్ర పట్టడం లేదు ! భయతోం వణికి పోతున్నాం ! పట్నం బయలుదేరకుండా ఆలస్యం చేస్తున్నావు. నీకిది ధర్మంగా లేదు సేమా ! ’’ అని నిష్ఠూర మాడేరు.
     వారి మాటలు విని వర్ధన రావు కోపం నటిస్తూ  వారితో ఇలా అన్నాడు :
‘‘ మీలో మీకు ఎప్పుడూ సఖ్యత లేదు ! ఎప్పుడూ దేనికో ఒక దానికి కీచులాడుకుంటూ ఉంటారు. మన గ్రామం పరువు మంట కలుపు తున్నారు. మీకు కష్టం వచ్చింది కనుక, ఇప్పుడు మాత్రం అంతా ఒకటిగా  నా దగ్గరకి వచ్చేరు. ఈ కష్టం ఒడ్డెక్కాక మళ్ళీ మామూలుగా మీలో మీరు దెబ్బలాడుకుంటూ ఉంటారు.  అంచేత,  ఇప్పుడు మీకు నేను మాత్రం మీకు ఎందుకు సాయం చేయాలి. వెళ్ళి రండి ! ’’ అని కసిరి చెప్పాడు.
    దానితో కంగు తిన్న గ్రామస్థులు ముక్త కంఠంతో ఇక మీదట అలా ప్రవర్తించమనీ,  అంతా కలసి మెలసి ఉంటామనీ ప్రమాణం చేసారు. తమ తప్పులు మన్నించి, వెంటనే పట్నం వెళ్ళి అరిష్ట పతాకాల గురించి తెలుసుకుని రమ్మని వేడు కున్నారు.
    అప్పుడు వర్ధన రావు నవ్వి ఇలా చెప్పాడు : ‘‘అరిష్ఠ పతాకాలు అనేవి ఒక మూఢ విశ్వాసం ! అవి నేను పెట్టిన పతాకాలు ! మీలో భయం కలిగించి, మీ మధ్య సఖ్యత కలిగించడం కోసమే నేను వాటిని మీ ఇళ్ళ మీద ఉంచేను ! మూఢ నమ్మకం విషయంలోనే భయంతో ఒకటైన మీరు మన ఊరికి చెడ్డ పేరు రాకుండా కలసి మెలసి ఉండ లేరూ ! ’’ అన్నాడు.
      వర్ధన రావు మాటలతో ఊరి ప్రజలలో మంచి మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇదివరకటిలా తగవు లాడు కోవడం లేదు. చక్కగా కలసి మెలసి ఉంటున్నారు.
        జగడాల పల్లెను వోసారి  చూసొద్దామని అనుకుంటున్నారేమో  ! అదిప్పుడు కుదిరే పని కాదు ! . ఎందుకంటే పద్మా పురానికి జగడాల పల్లె అని వచ్చిన చెడ్డ పేరు ఇప్పుడు  పూర్తిగా తొలగి పోయింది !
 అంత సఖ్యంగా  జనాలుండే గ్రామం ఇప్పుడు ఆఫిర్కా లోనే లేదంటే నమ్మండి !