16, నవంబర్ 2014, ఆదివారం

అడగ వలసిన అసలు ప్రశ్న !


చామలా పల్లి అగ్రహారంలో మార్కండేయ శాస్త్రి అనే ఒక మహా పండితుడు ఉండే వాడు. అతడు చిన్నప్పుడే అన్ని శాస్త్రాలూ ఔపోసన పట్టాడు. పురాణేతిహాసాలు క్షుణ్ణంగా చదువు కున్నాడు. చుట్టు ప్రక్కలే కాక, సుదూర ప్రాంతాలలో ఉండే జమీందారీలలో కూడా అతనికి సాటి వచ్చే పండితుడు లేడని ప్రతీతి ! చాలా మంది అతని దగ్గర విద్యలు అభ్యసించి , మహా పండితులయ్యేరు. అతనికి లెక్క లేనన్ని బిరుదులు వచ్చేయి. సువర్ణఘంటా కంకణ ధారణ, గజారోహణాలూ లాంటి గొప్ప సత్కారాలు అనేకం జరిగాయి.  దానితో అతనికి అహంకారం ఎక్కువయింది. తన మాటే వేద వాక్కు అని తలచే వాడు. అతని పాండిత్యం  ముందు నిలువ లేక, ఎవరూ అతని ఎదుట నోరు మెదప లేక పోయే వారు.
    మార్కండేయ శాస్త్రికి ఒక్కతే కూతురు.  పేరు కమలిని. మగ సంతానం లేదు.  కమలిని అపురూప సౌందర్యవతి.  వినయ సంపన్నురాలు.  మెకు యుక్త వయసు వచ్చేక, మార్కండేయ శాస్త్రి ఆమెకు వివాహం చేయాలని తల పెట్టాడు. ఎంద రెందరో ఎన్నో మంచి సంబంధాలు తీసుకు వచ్చారు.  కాని, తన బిడ్డకు తగిన జోడును తాను మాత్రమే ఎన్నిక  చేయ గలనని  అతని ఆలోచన.  అందు వలన ఎవరెంత గొప్ప సంబంధం తెచ్చినా ,ఏదో వంకతో తిరస్కరించే వాడు. తనతో వియ్యమందడానికి వచ్చిన వారిని, పెండ్లి కుమారులనూ అతను చాలా జటిల మయిన ,శాస్త్ర సంబంధమయిన ప్రశ్నలు అడిగే వాడు. వారితో శాస్త్ర చర్చలకు దిగే వాడు.  వారి మేధస్సుకు పరీక్ష పెట్టే వాడు. తర్క మీమీంసాది శాస్త్రాల లోనే కాక, పురాణాల నుండి, ప్రబంధాల నుండీ  చాలా క్లిష్ట మయిన ప్రశ్నలు అడిగే వాడు.
వాటికి సమాధానాలు చెప్ప లేక ,వచ్చిన వాళ్ళు బిక్క ముఖాల పెట్టే వారు.  దాంతో, వచ్చిన మంచి సంబంధా లెన్నో తిరిగి పోయేవి. అతను వేసే ప్రశ్నలకు అంతూ పొంతూ ఉండేది కాదు ! అతి కష్టం మీద ఎన్నింటికి జవాబులు చెప్పినా, అతనికి తృప్తి ఉండేది కాదు ! మరిన్ని అడిగి, వారి నోళ్ళు మూయించే వాడు.
అతని ధోరణి చూసి ,అతని భార్య ఇందు మతికి చాలా దిగులుగా ఉండేది. ఇలా అయితే పిల్లకి జన్మలో పెళ్ళి కాదని తెగ బాధ పడుతూ ఉండేది.
    ఇలా ఉండగా, ఆ గ్రామానికి కాశీ నుండి ఒక మహా పండితుడు వచ్చి దేవాలయంలో విడిది చేసాడని ఇందు మతి విన్నది. వినయ రాహులుడు అనే అతని కొడుకు కూడా అతని వెంట ఉన్నానీ, అవివాహితుడనీ, మంచి రూపసి అనీ కూడా వింది. అంతే కాదు బాదా చదువు కున్న వాడని , మంచి జమీందారీ నౌకరీ కూడా చేస్తున్నానీ కూడా తెలిసింది.  ఆ యువకుడు కమలినికి ఈడూ జోడూ అని కూడా తెలుసుకుని మురిసి పోయింది. ధైర్యం చేసి. తన మనసు లోని మాట తన అన్న గారి ద్వారా ఆ పండితునికి తెలియ జేసింది.
     ఆ పండితుడు తన కుమారుడు వినయ రాహులుడిని  వెంట పెట్టుకుని, పెళ్ళి చూపులకు వచ్చేడు. ఎప్పటి లాగే, మార్కండేయ శాస్త్రి తన ప్రశ్నల వర్షం వారి మీద కురిపించాడు.  ఆ కాశీ పండితుడూ, అతని కుమారుడూ వాటికి చక్కగా సమాధానాలు చెప్పారు. గంటలు గడుస్లున్నాయి. కానీ, శాస్త్ర చర్చ మాత్రం ముగియడం లేదు ! ఆ సంబంధం ఎలాగయినా కుదిరితే బాగుణ్ణు ! అని ఆశ పడుతున్న వారందరికీ ఆదుర్దాగా ఉంది.
     ఆ సమయంలో కాశీ పండితుడు మార్కండేయ శాస్త్రి గారితో ఇలా అన్నాడు : ‘‘ అయ్యా ! మీరు మహా పండితులు ! దానికి తిరుగు లేదు ! మా గురు దేవులు అనుగ్రహించిన  విద్య వలన మేమూ తగిన జవాబులు చెప్ప గలిగాము. కానీ, మేము అడిగే ఒకే ఒక ప్రశ్పకు మీరు సమాధాన మివ్వాలని వినయంగా కోరు కుంటున్నాము ’’ అన్నాడు. దానికి మార్కండేయ శాస్త్రి సమ్మతించాడు.
      ‘‘ ఇంత వరకూ మీ అమ్మాయికి చాలా సంబంధాలు వచ్చాయనీ,
మీ శాస్త్ర   చర్చలతో అవి తిరిగి పోయేయనీ విన్నాను.  మీరు వచ్చిన వారి పాండిత్యాన్ని పరీక్షిస్తూ ఉండి పోయారే తప్ప , ఏనాడయినా, మీ అమ్మాయి మనసులో ఏముందని ఒక్క నాడయినా అడిగారా !  ఇదే నేను అడిగే ప్రశ్న!’’  అని అడిగాడు కాశీ పండితుడు.  దానితో మార్కండేయ శాస్త్రికి కోపం ముంచు కొచ్చింది.
    ‘‘ ఇదేం ప్రశ్న ! ఇలాంటి లౌకిక మయిన ప్రశ్నలకి నేను జవాబులు
 చెప్పను ! ’’ అన్నాడు కోపంగా.
   ‘‘ అయ్యా !  క్షమించాలి ! నేను  తమను వొకే ఒక్క ప్రశ్న అడుగు తానన్నాను కానీ, అది లౌకిక మయినదా , కాదా అని చెప్ప లేదు !  అదీ కాక, వివాహం చేసు కోవడం, కాపురం చేయడం అనేవి లౌకిక సంబంధ మయిన విషయాలని తమకు నేను చెప్ప నక్కర లేదు !’’ అన్నాడు కాశీ పండితు.
    సూక్ష్మ బుద్ధి గల మార్కండేయ శాస్త్రి కి కాశీ పండితుని మాటలలో ఆంతర్యం అర్ధ మయింది.  మరో ఆలోచన లేకుండా అతనితో వియ్య మందడానికి అంగీకరించాడు ! అంతా సంతోషించారు.        మంచి ముహూర్తాన కాశీ పండితుని కుమారుడు వినయ రాహులుడితో  కమలిని వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది.
         ఇప్పుడా దంపతులకి వొక చక్క దనాల కొడుకు కూడానూ ! రేపో మాపో నామ కరణం చెయ్య బోతున్నారు.  మీకూ పిలుపు  వస్తుంది. వెళ్ళి ఆశీర్వదించి వస్తారు కదూ ? !