11, డిసెంబర్ 2014, గురువారం

నమ్మకం గెలిపిస్తుంది ! అప నమ్మకంఓడిస్తుంది !
అశ్వ సేనుడు అవంతీ రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో, ఒక ఏడాది తీవ్రమయిన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. నెలల తరబడి వొక్క వర్షపు చుక్క కూడా పడడం లేదు. భూములన్నీ బీడు వారి పోయేయి. ప్రభువుల ధనాగారం కూడా నానాటికీ తరిగి పోసాగింది. తిండికి కరువు రావడంతో రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది. దారి దోపిడీలూ, దొంగతనాలూ పెచ్చు పెరిగి పోయేయి. ప్రజలు రాజ శాసనాలను ధిక్కరించే పరిస్థితి ఏర్పడింది. అశ్వ సేనుడి పాలన పట్ల ప్రజలకు నమ్మకం సడలి పోసాగింది.  రాజులో కూడా నానాటికీ అసహనం ఎక్కువ కాసాగింది. ఆకలికి తట్టుకో లేక పెట్టే ఆర్తుల మొర ఆలకించడం మానేసాడు. మీదు మిక్కిలి కఠిన దండనలు విధించ సాగేడు. అధిక పన్నులు వేయ సాగేడు.  దాంతో రాజ్యంలో అరాచకంమరింత పెరిగి పోయింది ! పరిస్థితి చెయ్యి దాటి పోతున్నదని మహా మంత్రి గమనించాడు. రాజ్యంలో అరాచక పరిస్థితుల నివారణకు తగిన పరిష్కారం కనుగొనడానికి వో సారి తపోవనవాసులయిన మునిజనం వద్దకు వెళ్ళి రమ్మని మహా మంత్రి, రాజ గురువు రాజుకి సలహా యిచ్చారు. అందుకు సమ్మతించి అశ్వ సేనుడు కొద్ది పాటి సైన్యంతో అటవీ ప్రాంతానికి బయలుదేరాడు.
      అరణ్య ప్రాంతంలో ప్రవేశించగానే , అక్కడి వాతావరణం చూసి రాజు చకితుడయ్యేడు ! అక్కడ అంతా పచ్చగా ఉంది. మునులూ, వారి శిష్యులూ పుష్ఠిగా వింత తేజస్సుతో వెలిగి పోతున్నారు !  రాచ నగరుకి అతి సమీపంలో ఉండే అటవీ భూములలో రాచ నగరులో వలె కరువు కాటకాలు లేక, అంతా పచ్చగా ఉండడానికి కారణం మునులను  ఇలా అడిగాడు.  ‘‘ మునులారా! ఈ ఆశ్రమ ప్రాంతం మా రాజ నగరుకి ఏమంత దూరంలో లేదు. కానీ అక్కడి కంటె భిన్న మయిన పిరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ అటవీ ప్రాతం కూడా నా ఏలుబడిలో ఉన్నదే కదా ! అతిసమీప ప్రాంతాలయినఈ రెడంటికీ నడుమ ఇంత తేడా ఎలా వచ్చింది ?’’ అనడగాడు.
    మునులు నవ్వి , ‘‘ రాజా ! ఇప్పుడు చూడు ! లా కనిపిస్తోందో !’’ అన్నారు.
రాజు చుట్టూ తేరిపార చూసాడు. ఆశ్చర్యం !  అక్కడి వాతావరణం రాచ నగరు కంటె భిన్నంగా ఏమీ లేదు ! కరువు అక్కడా తాండవిస్తోంది.  రాజుకి అంతా అయోమయంగా తోచింది.
    అప్పుడు మునులు రాజుతో ఇలా అన్నారు : ‘‘ మహా రాజా ! ఆపదలో ఉన్న మిమ్ములను మునుల మయిన మేము ఒడ్డెంక్కించ గలమనే నమ్మకంతోనే నువ్వు ఇక్కడకి వచ్చేవు. అందు వల్లనే నీకలా గోచరించింది. అంతే. దేనికయినా నమ్మకమే ప్రధానం ! ఈ కరువు పరిస్థితులు ఇక ఎన్నాళ్ళో ఉండవు. వెళ్ళి, నీప్రజలలో నీ పాలన పట్ల నమ్మకం కలిగించు. నమ్మకం గెలిపిస్తుంది. అప నమ్మకం ఓటమికి దారి చూపిస్తుంది !  వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించు. అప్పుడు అరాచకం తగ్గుతుంది ’’
   రాజు మునుల వద్ద శలవు తీసుకుని, రాజధానికి తిరిగి వచ్చి, మునులు చెప్పినట్టే తన ఏలుబడి పట్ల ప్రజలలో నమ్మకం కుదురు కునేలా చేశాడు.
  త్వరలోనే రాజ్యమంతటా విస్తారంగా వానలు కురిసాయి !
    రాజ్యం సుభిక్షమయింది !

1 వ్యాఖ్య:

jagannadharao.కొల్లూరు చెప్పారు...

నిజం చెప్పారు అందుకే నరేంద్రుని పాలన పట్ల నమ్మకం తో ఉన్నాము ఖచ్చితం గా మంచే జరుగుతుంది.