10, సెప్టెంబర్ 2014, బుధవారం

దేవుడ్ని చూసిన వాడు !


నంది వర్ధన పురంలో గంగాధరుడనే కుర్రాడు ఉండే వాడు, వాడికి ఓ ముసలి అవ్వ తప్పితే వెనుకా ముందూ ఎవరూ లేరు.బడికి పోయే వాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండే వాడు.అర్ధం పర్ధంలేని ప్రశ్నలు అడుగుతూ అందరినీ విసిగిస్తూ ఉండే వాడు. వాడు వేసే తలా తోకా లేని ప్రశ్నలకి ఊళ్ళో అందరూ విసిగి పోయి, వాడంటేనే చిరాకు పడే వారు. 
      రామయ్య అనే ఒక ముసలి రైతుకి మాత్రం వాడంటే ఇష్టం.  అమ్మా నాన్నా లేని పిల్లాడని వాడంటే  అమితమైన జాలి చూపిస్తూ ఉండే వాడు. వాడిని ఎలాగయినా ఓ దారికి తీసుకుని రావాలని రామయ్యకి కోరికగా ఉండేది. కానీ గంగాధరుడు మాత్రం రామయ్య మాటని పెడ చెవిని పెట్టే వాడు.
    ఒక రోజు రామయ్య తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా, గంగాధరుడు అక్కడికి వచ్చేడు. వస్తూనే, ‘‘ తాతా ! అంతలా అలసి పోతూ పని చేయక పోతే ఏం !’’ అంటూ తన సహజ ధోణిలో అడిగాడు.దానికి రామయ్య  ‘‘ మంచి వాడివే !
పొలం దున్నాలి .. ఎరువులు వేయాలి ... విత్తాలి ... కలుపు తీయాలి .. కోతలు కోయాలి ... కుప్పలు కూర్చాలి ... వడ్లు దంచాలి ... అన్నం వండాలి ...ఇంత చేస్తేనే కదా, నోటికి అన్నం ముద్ద దక్కేది. ఊరికే కూర్చుంటే ఎలాగురా ! నీలా తిని  బలాదూరుగా తిరిగితే నోట్లో మట్టేరా, నాయనా !’’ అన్నాడు.
‘‘ అబ్బో, చాలా తతంగం ఉందే ! కష్ట పడకుండా తిండి దొరికే మార్గం ఏదీ లేదంటావా  తాతా? ’’ అనడిగేడు గంగాధరుడు.
‘‘ నాకయితే తెలియదు కానీ, దూరన ఉండే  ఆ గుడిలో శివయ్య ఉన్నాడు కదా, .. అతనేమయినా చెబుతాడేమో కనుక్కో ! కనుక్కుని వచ్చేక అతడు ఏమన్నదీ నాతో తిరిగి చెప్పాలి సుమా !’’ అన్నాడు రామయ్య.
   కష్ట పడకుండా తిండి దొరికే మార్గం గుడిలో శివయ్య చెబుతాడని ఆశతో ఆనందంగా గుడి వేపు పరుగు తీసాడు గంగాధరుడు. గుడిలో  ఉలుకూ పలుకూ లేని శివ లింగాన్ని చూసేక వాడి ఆనందం నీరు కారి పోయింది. వెంటనే పరుగు పరుగున తిరిగి రామయ్య దగ్గరకి వచ్చి, ‘‘నువ్వు నాకు అన్నీ అబద్ధాలే చెప్పావు! గుడిలో లింగమే తప్ప, శివయ్య లేడు. ’’ అన్నాడు కోపంగా.
     అందుకు రామయ్య నవ్వి, ‘‘ అదేమిటి ! శివయ్య అక్కడే ఉన్నాడట కదా !
నువ్వు వచ్చి ఏమీ అడగకుండానే వెళ్ళి పోయావని నాతో చెప్పాడు కూడానూ !’’ అన్నాడు.  ఆ మాటలతో గంగాధరుడికి ఉడుకుమోతు తనం వచ్చింది. మళ్ళీ  అంత దూరమూ ఆయాస పడుతూ గుడికి పరిగెత్తాడు. ఈ సారి కూడా వాడికి శివయ్య కనిపించ లేదు ! ఎంత పిలిచినా పలక లేదు ! దానితో తిరిగి ఆయాస పడుతూ రామయ్య దగ్గరకి వచ్చేడు.  ‘‘ నీవన్నీ ఉత్త మాటలు ! గుడిలో శివయ్య లేనే లేడు ! నీకు కనిపించిన వాడు నాకెందుకు కనిపించడు ?’’ అన్నాడు కోపంగా.
    దానికి రామయ్య నవ్వుతూ ‘‘నేను పొద్దుటి నుండీ పొలంలో వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తున్నాను. నువ్వు ఏ పనీ చేయడం లేదు. కష్ట పడి పని చేసే వాళ్ళంటేనే శివయ్యకి ఇష్టం కాబోలు ! అందుకే, నాకు కనిపించిన వాడు నీకు కనిపించడం లేదు ! ’’ అన్నాడు.
    ఆ మాటలు గంగాధరుడి మీద బాగా పని చేసాయి. ఆ రోజు నుండీ వాడిలో చాలా మార్పు వచ్చింది. ఒళ్ళు వంచి పని చేయ సాగేడు.బడికి వెళ్ళి, శ్రద్ధగా చదువు కోవడం మొదలు పెట్టాడు. త్వరలోనే ఊళ్ళో అందరి దగ్గరా  గంగాధరుడు బుద్ధి మంతుడనే పేరు తెచ్చు కున్నాడు !
     ఆ తర్వాత ఓ రోజు రామయ్య గంగాధరుడు కనబడితే అడిగాడు ‘‘ ఇంతకీ నీకు శివయ్య ఇప్పటికయినా కనిపించేడూ ?!’’ అని.
    దానికి గంగాధరుడు  ‘‘లేదు కానీ తాతాతాతా ! శ్రమలోనే దేవుడున్నాడని తెలిసింది. శ్రమించే వారికీ, పేదలకి సాయం చేసే వారికీ ఆ శివయ్య వెన్నంటే ఉంటాడని తెలిసింది !’’ అన్నాడు తను కూడా నవ్వుతూ.
      దానికి రామయ్య - 
    ‘‘ ఇప్పుడు నచ్చేవురా! భడవా, ఏదీ ఒక ముద్దియ్యి ! ’’ అన్నాడు !