29, ఆగస్టు 2014, శుక్రవారం

పక్షుల తీర్మానం !!


పక్షుల రాజ్యంలో రకరకాల పక్షులు అసంఖ్యాకంగా ఉన్నాయి. చిలుకలు ,నెమళ్ళు ,గోరు వంకలు, మైనా పిట్టలు, పిగిలి పిట్టలు, పిచ్చుకలు, కాకులూ, కోళ్ళూ, కోకిలలూ, ,  వడ్రంగి పిట్టలు, బాతులు,బెగ్గురు పక్షులు ... ఇలా చాలా జాతుల పక్షులు ఉన్నాయి. అందమయిన ముక్కులు కలవీ, పెద్ద తోకలతో వయ్యారంగా తిరిగేవీ, చక్కని కళ్ళున్నవీ, కమ్మని కంఠాలున్నవీ,బలమైన రెక్కలు గలవీ, రంగు రంగుల ఈకలున్నవీ ..పక్షుల రాజ్యంలో నిత్యం కిలకిలారావాలతో సందడి చేస్తూ ఉంటాయి      వాటి రెక్కల చప్పుళ్ళతో, కూతలతో అడివంతా గొప్ప సందడిగా ఉంటుంది. ఉదయ సాయంకాలాలయితే మరీనూ !
      ఒక  సారి పక్షుల పండుగ వచ్చింది. పండుగ వేడుక జరుపుకుంటూ పక్షులన్నీ ఒక చోట చేరాయి. పక్షుల రాజ్యంలో జరిగే పెద్ద పండుగకి మానస సరోవరం నుండి రాజ హంసలు ముఖ్య అతిధిలుగా వచ్చేయి. వాటి రాకతో పండుగ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రకరకాలయిన పళ్ళతో, చిగుర్లతో, పూల తేనెలతో, తామర తూడులతో, విందులూ వినోదాలూ జరిగేయి. పాటలూ, ఆటలూ సరే సరి ! పక్షులన్నీ తమ తమ జాతి పక్షులతో గుంపులు గుంపులుగా విడి పోయి ,ముచ్చటలాడుకో సాగేయి. అలాంటి సందర్భంలో వాటి మధ్య మాటా మాటా వచ్చింది. పక్షులన్నిటి లోనూ  ఏ జాతి పక్షి లోకంలో కెల్లా అందమయినదనే ప్రశ్న  తలెత్తింది. దేనికవే తమ అందమే గొప్పదని చెప్పుకో సాగేయి.
    మా గానమే మాకు అందం అంది కోకిల.
    మా పింఛమే మాకు శోభ అంది నెమలి.
    మాకున్నంత తెలుపు రంగు శరీరం ఇక వేటికీ లేవంది కొంగ.
      మా అందమయిన ముక్కు, రంగు రంగుల ఈకలు ప్రపంచానికే అందం           అంది చిలుక.
      అందానిదేముంది ! అందం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మేం లోకంలో పితృదేవతల రూపంలో వస్తూ ఉంటాం. మాదే గొప్ప అంది కాకి.
       మేం లేక పోతే లోకానికే తెల్ల వారదు తెలుసా ! బడాయి పోయింది కోడి.
        ఇలా పక్షులన్నీ మేం గొప్పంటే , మేం గొప్ప అని తగువులాడు కోవడం మొదలెట్టాయి.అక్కడంతా గోల గోలగా తయారయింది. సరదా కబుర్లు కాస్తా రచ్చ రచ్చగా మారింది !
           ఇంతలో ఓ మూల నుండి కిచ కిచ మని బలహీన మైన కంఠాలతో కూతలు వినిపించాయి. వాటి గొంతులలో అంతు లేని విచారం వినిపించింది. పక్షులన్నీ ఒక్క సారిగా ఉలిక్కి పడి , తమ జగడం ఆపి అటు వేపు చూసాయి. అక్కడ కొద్ది పాటి సంఖ్యలో పిచ్చుకలు విచారంగా ముఖాలు పెట్టి, బిక్కు బిక్కుమంటూ కనిపించాయి. వాటి చిన్నారి కళ్ళు ధారగా కన్నీళ్ళు కారుస్తున్నాయి.
      అప్పుడు అతిథులుగా వచ్చిన మానస సరోవరపు  హంసలలో హంసల పెద్ద అందరికీ వినిపించేలా ఇలా అంది : ‘‘పక్షుల రాజ్యంలో పక్షులన్నీ అందమైనవే. మీలో మీరు ఊరికే వాదులాడుకుంటున్నారు. ఆ పిచ్చుకలు చూడండి ! ఎంత ముద్దుగా ఉన్నాయో ! కానీ వాటి జాతి రాను రాను అంతరించి పోతోందని ఎలా కుమిలి పోతున్నాయో !పిచ్చుకలే కాదు మన పక్షి జాతులు చాలా రకాలవి అలా అంతరించి పోయే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.రకరకాలయిన వాతావరణ కాలుష్యం వల్లా, ఆధునిక యంత్రాల వల్లా, వేటగాళ్ళ ముప్పు వల్లా యిలా చాలా కారణాల వల్ల కొన్ని పక్షిజాతులు  ముందు ముందు మనకి కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై మనమంతా ఐక్యంగా ఉండి ఏదో ఒకటి చెయ్యాలి.’’
     అడవి లోని పక్షులన్నీ రాయంచ చెప్పిన మాటలకు అంగీకారం తెలిపాయి.
 ఆ తరువాత అవి, అంతరించి పోతున్న పక్షి జాతులను కాపాడమని వేడుకుంటూ ఒక తీర్మానం చేసాయి.
         ఆ తీర్మానం ప్రతులు ఒకటి పరమేశ్వరుడికీ, మరొకటి  మానవ జాతికీ పంపించేయి.
          ఇంతకీ, అవి వారికి చేరుతాయో లేదో, తెలియదు !
   



  

26, ఆగస్టు 2014, మంగళవారం

చిట్టి చిలుకమ్మ అక్షరాభ్యాసం !


చిలుకమ్మ తన గారాల బిడ్డ చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం చేయించాలని తలపెట్టింది. అందు కోసం సకల సంభారాలూ సమకూర్చుకుంది. చెట్ల నడిగి తీయ తీయని పళ్ళను ఎన్నింటినో సేకరించింది. తేనెటీగలను అడిగి ఆకు దొప్పెడు తియ్యని తేనెను తీసుకుని వచ్చింది. లతల నడిగి రంగు  రంగుల పూలను సేకరించింది. అతిథులు కూర్చోడానికి  కొమ్మలనడిగి లేత రెమ్మలనూ, చిగురుటాకులనూ తెచ్చింది. మామిడాకుల తోరణాలు కట్టింది. కోకిలమ్మను  తన బృందంతో వచ్చి మంగళ వాయిద్యాలు వినిపించమని అడిగింది.  చిలుక పండితుని తన బిడ్డకి అక్షరాభ్యాసం చేయించడానికి రావలసినదిగా ఆహ్వానించింది. అందరినీ తన బిడ్డ అక్షరాభ్యాస కార్యక్రమం చూడడానికి రమ్మని పిలిచింది.
    అందరినీ పిలిచింది కానీ, ఉడుతమ్మని మాత్రం రమ్మని పిలవ లేదు ! ఉడుతమ్మ అంటే చిలుకమ్మకి చాలా రోజుల నుండీ కోపం. వాళ్ళిద్దరికీ పడడం లేదు. దోర ముగ్గిన పళ్ళనన్నింటినీ తన కంటె ముందుగా ఉడుతమ్మ కొరికి రుచి చూస్తోందని చిలుకమ్మకి  మంట ! అందుకే, తన యింట జరిగే ఆ వేడుకకి కావాలనే ఉడుతమ్మని పిలవ లేదు.
     చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం జరిగే రోజు రానే వచ్చింది.  ఉదయాన్నే  బిడ్డను నిద్ర లేపి , చిలుకమ్మ ముస్తాబు చేసింది. అతిథులూ, చిలుక పండితుడూ వచ్చేటప్పుడు అల్లరి చేయ వద్దని బుద్ధులు చెప్పింది. చిట్టి చిలుకమ్మ అక్షరాభ్యాస కార్యక్రమానికి పిలిచిన వాళ్ళందరూ బిరబిరా వచ్చేసారు.
    అయితే, రామ శబ్దం పలికించి, అక్షరాభ్యాసం చేయించే చిలుక పండితుని జాడ ఎక్కడా కనిపించ లేదు.
     చిలుకమ్మ గాభరా పడసాగింది. మాటి మాటికీ చిటారు కొమ్మ మీదకి ఎక్కి, చిలుక  పండితుడు వస్తున్నాడేమోనని చూడసాగింది. వస్తున్న ఆనవాలు ఎక్కడా కనిపించక పోవడంతో చిలుకమ్మ దిగులు పడుతోంది.
    చిలుక పండితుడు ఎందుకు రాలేదంటే ...
     అతడు చిలుకమ్మ యింటికి బయలు దేరి వస్తూ ఉంటే,  దారిలో ఉడుతమ్మ తన ఇంటి ముందు విచారంగా కూర్చుని ఉండడం చూసాడు.  కారణం మిటని లాలనగా అడిగేడు.  అందరినీ తన ఇంటి వేడుకకి పిలిచిన చిలుక తల్లి , తనని మాత్రం పిలవ లేదని చెప్పి ఉడుతమ్మ కంట నీరు పెట్టుకుంది. దానితో చిలుక పండితునికి పట్టరానంత కోపం వచ్చింది. చిలుకమ్మ ఇంటికి అక్షరాభ్యాస కార్యక్రమం చేయించ డానికి వెళ్ళ కూడదని  నిర్ణయించు కున్నాడు. గిరుక్కున వెను తిరిగి,  తన ఇంటికి వెళ్ళి పోయాడు ! అదీ విషయం !
       ఈ సంగతి మైనా పిట్ట వలన చిలుకమ్మకి తెలిసింది. చిలుకమ్మ తన తప్పు తెలుసుకుంది. వెంటనే పరుగు పరుగున  ఉడుతమ్మ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళింది. తన ను క్షమించమని వేడుకుంది. తన ఇంట జరిగే  కార్యక్రమానికి రమ్మని మరీ మరీ ఆహ్వానించింది.  తరువాత ఉడుతమ్మను వెంట తీసుకుని చిలుక పండితుని ఇంటికి వెళ్ళింది. దీనంగా తన తప్పును మన్నించమని వేడుకుంది. దానితో చిలుక పండితుడు శాంతించాడు. చిట్టి చిలుకమ్మకు అక్షరాభ్యాసం చేయించేందుకు చిలుకమ్మ ఇంటికి వారితో పాటూ వచ్చేడు. అతిథు లందరూ సంతోషించారు.
   చిలుక పండితుడు పూజ చేయించి, చిట్టి చిలుక చేత ముమ్మారు రామ శబ్దం పలికించేడు ! చిలుకమ్మ అతిథు లందరికీ తియ్యని పండ్లూ, తేనెతో విందు చేసింది. చిలుక పండితుని తగు విధంగా సత్కరించింది. పండితుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా హితవు చెప్పాడు : ‘‘నువ్వు ఉడుతమ్మ మీద అకారణంగా  ద్వేషం పెంచుకుని అవమానించేవు. నీ బిడ్డ చేత ఇవాళ రామ శబ్దం ముమ్మారు పలికించాను కదా ! ఆ రాముడి మెప్పునే పొందిన ధన్య జీవి ఉడుత  ! తెలుసా ! లంకకి వారధి కట్టేటప్పుడు  చేసిన ఉడుతా సాయానికి మెచ్చుకుని రఘురాముడు ఉడుత వీపు ప్రేమగా నిమిరాడుట ! ఆ గుర్తులే చారికలుగా ఉడుతల మీద ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఉడుతతో నీకు తగవు  తగదు. కనుక మీరిద్దరూ ఇక నుండి స్నేహంగా ఉండండి !’’
    చిలుక పండితుని మాటలకు అందరూ కిలకిల మని కూతలతో  తమ ఆనందాన్ని తెలియ జేసారు.
      అదిగో  ! అప్పటి నుండి చిలుకమ్మ , ఉడుతమ్మ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి !
   

25, ఆగస్టు 2014, సోమవారం

మంచి మిత్రులు కొండ - నది


సీతారామ పురంలో ఒక కొండ ఉంది. దాని ప్రక్క నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంది.ఆ రెండూ ఎన్నో వందల ఏళ్ళ నుండి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. లెక్క పెట్ట లేనంత కాలం నుండి ఆ కొండ అక్కడ అలాగే ఉంది. ఆ నది కూడా ఎన్నో తరాల నుండీ దానిని ఒరుసు కుంటూ ప్రవహిస్తూనే ఉంది. ఎంతో దూరం నుండి వస్తున్న నది  ఆ కొండ దగ్గరకి రాగానే, కొండ చరియలను నీళ్ళతో తడుపుతూ కొండను చల్లగా పలకరిస్తూ ఉంటుంది . వరద నీరు వచ్చి నప్పుడల్లా కొండకు మరీ సంతోషం. ఆ నదిని చూసి కొండ  పులకరించి పోతూ ఉంటుంది. అందుకే దాని మీద  చెట్ల కొమ్మలూ, రెమ్మలూ  ఎప్పుడూ గలగలలాడుతూ ఉంటాయి. నడి వేసవిలో మాత్రం నదిలో నీరు తగ్గు ముఖం పట్టడంతో  నది కొండకి బాగా దూరంగా జరిగి పోతూ ఉంటుంది. అప్పుడు  కొండకి చాలా బాధగా ఉంటుంది. చిక్కి పోయిన నేస్తాన్ని చూసి  దాని మనసు చవుక్కుమంటూ ఉంటుంది. మళ్ళీ వానలు బాగా కురియడంతో నది పొంగి ప్రవహిస్తూ, కొండ చరియలకు దగ్గరగా వస్తుంది. కొండ మురిపెంగా దాని చల్లని స్పర్శకు పులకరించి పోతూ ఉంటుంది. అలా ఆ రెండూ ఎప్పటి నుండో స్నేహంగా ఉంటున్నాయి.
     అయితే, రోజులన్నీ ఒకలాగే ఉండవు కదా !  ఒక సారి వెర్రి గాలి ఒకటి కొండ మీద నుండి వీస్తూ, నదిని గురించి కొండకు చాలా చాడీలు చెప్పింది.. నది మీద కోపం వచ్చేలా చేసింది. దానితో కొండ మనసు విరిగి పోయింది.
   వెర్రి గాలి మాటలు మనసులో ఉంచుకుని ఒక రోజుకొండ నదితో ఇలా అంది :  ‘‘మిత్రమా ! ఎన్నో ఏళ్ళనుండి మనం స్నేహితులం ! అవును కదా ! వరద వచ్చి నప్పుడు నువ్వు నామీద నుండి ఎన్నో మంచి మంచి పళ్ళ చెట్లనూ, పచ్చని కొమ్మలనూ నువ్వు  నీతో లాక్కు పోతూ ఉంటావు. నాకు చెందిన రాళ్ళ సంపదను కూడా నువ్వు నన్ను అడగ కుండానే నీలో కలిపేసు కుంటూ ఉంటావు ! నేస్తానివి కదా అని నేను ఏమీ అనడం లేదు.  కానీ ఒక్క నాడు కూడా నువ్వు నాకు ఒక్క విలువయిన బహుమతినీ  తెచ్చి ఇవ్వ లేదు. పైగా ఎక్కడెక్కడి నుండో చెత్తా చెదారాన్ని తెచ్చి నామీద కుమ్మరించి పోతున్నావు.
   అదీ కాక, ఎన్ని సంవత్సరాలయినా, నేను ఇలా కదలకుండా ఒక్క లాగే ఉన్న చోటునే ఉండి పోవలసి వస్తోంది. నువ్వేమో, నిరంతరం కదిలి ఎక్కడికో వెళ్ళి పోతూ ఉంటావు. లోకంలో వింత లన్నీ చక్కా చూస్తూ ఉంటావు ! నాకయితే ఆ అదృష్టం లేదు కదా ! నా ఖర్మ కాలి నేను ఇక్కడే పాతుకు పోయి ఉంటాను. నువ్వె వెళ్ళి వెళ్ళి సముద్రంలో కలుస్తావుట కదా ! సముద్రంలో గొప్ప గొప్ప రత్నాలూ అవీ ఉంటాయని ఓ సారి నాతో కబుర్ల మధ్య నువ్వే చెప్పావు.  కానీ , ఇంత కాలమైంది నాకు కనీసం ఒక్క సారయినా, ఒక్క రత్న మయినా తెచ్చి ఇవ్వ లేదు. ఈ సారి వచ్చి నప్పుడు నా కోసం గుప్పెడు రత్నాలు తేవాలి సుమా ! ’’ అంది.
   ఆ మాటలు విని  నది నవ్వుతూ, ‘‘ నేస్తమా ! నేను సముద్రంలో కలవడమే కానీ తిరిగి రాలేను. అలా తిరిగి రావడమంటూ కుదరదు. అందు చేత నీకు రత్నాలను ఎలా తెచ్చి ఇవ్వ గలను చెప్పు ? ’’ అంది.
     దీనితో వారి మధ్య మాటా మాటా పెరిగింది.  కొండ కోపంతో ‘‘ అలా అయితే, నేను అమాంతంగా పెరిగి పోయి నిన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళ నివ్వ కుండా చేస్తాను జాగ్రత్త ! ’’ అని బెదిరించింది కోపంగా.
  నది పగలబడి నవ్వుతూ ‘‘ అది నీ తరం కాదు ! ఏదో ప్రక్క నుండి నేను వెళ్ళి పోగలను ! అదీ కాక ఇంత సేపూ నువ్వు నాతో మాటలాడుతూ ఉండగానే నేను చాలా దూరం వెళ్ళి పోయేను తెలుసా !’’ అంది.  ఆ మాటలు కొండకి ఏమీ అర్ధం కాలేదు.
    వీరి వాదులాట ఇంతసేపూ వింటున్న పెద్ద మేఘం ఒకటి వారితో ఇలా అంది : ‘‘ఎన్నో యుగాలుగా  స్నేహంగా ఉంటున్న మీరు ఇలా తగువులాడు కోడం తగదు. ప్రకృతిలో కొండలూ, చెట్లూ, చేమలూ, నదులూ, మబ్బులూ ఈ అందాలన్నీ భగవంతుడు కల్పించినవి.
   కొండల మీద దేవుళ్ళు వెలిస్తే, నదులలో ప్రజలు తీర్ధ స్నానాలు చేస్తారు. దేని గొప్ప దానిదే. కొండలలో సూర్యుడు ఉదయించడం, అస్తమించడం చేస్తూ లోకానికి రాత్రీ పగలూ కలిగిస్తూ ఉంటాడు. అంచేత కొండ  కదలదు. నది ప్రవహిస్తూ దారి పొడుగునా పొలాలకూ, జనాలకూ  సాగు నీరూ, త్రాగు నీరూ,  అందిస్తూ ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. అందు చేత నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి ! తెలిసిందా !’’ అని  సర్ది  చెప్పింది. దానితో  కొండ ,నది ఎప్పటిలాగే సఖ్యంగా ఉండ సాగేయి.
      వాటి అందం అంతా యింతా కాదు ! చూసే వాళ్ళకి రెండు కళ్ళూ చాలవు తెలుసా !!


24, ఆగస్టు 2014, ఆదివారం

చిట్టెలుక చిలిపి కోరిక !



అనగా అనగా ఒక పల్లె లో ఒక కలుగులో ఒక చిట్టెలుక  తల్లితో పాటూ నివసిస్తూ ఉండేది.  దాని పేరు చుంచు లక్ష్మి. అది ఆహారానికి బయలు దేరి నప్పుడల్లా దానికి ఒక ఆబోతు ఎదురు పడేది. ఆ ఆబోతుని చూసి గ్రామం లోని చిన్నా చితకా పెంపుడు జంతువులే కా, మనుషులు కూడా భయంతో పరుగులు తీస్తూ ఉండే వారు. ఎందు కంటే అది చాలా పొగరుబోతు. ఊరిలో విచ్చలవిడిగా తిరుగుతూ డేది. భారీ శరీరంతో, గొప్ప బలంతో ,నల్లని మేని ఛాయతో  అది చూడడానికి భయం కొలుపుతూ ఉండేది. దాని అరుపు గుండె జలదరింప చేసేదిగా  ఉంటుంది. కాలి గిట్టలతో నేలను బలంగా తన్నుతూ అది రంకె వేసిందంటే,  ఎంతటి ధైర్యవంతులకయినా గుండెలు జారి పో వలసినదే !
      మన  చిన్నారి చిట్టెలుకకి  ఒక్కసారయినా, దాని భారీ శరీరం మీద ఎక్కి, చాలా దూరం స్వారీ చేయాలనే  చిలిపి కోరిక కలిగింది ! అది తగని కోరిక అని తల్లి ఎంత నచ్చ చెప్పినా దాని చెవి కెక్కలేదు. ఒకే ఒక్కసారి ఆ పొగరుబోతు ఆబోతు మీదకెక్కి స్వారీ చెయ్యాలని తెగ ముచ్చట పడిపోతూ ఉండేది.  కానీ, ఆ ఆబోతు ఎదురు పడితేనే దానికి కాళ్ళూ చేతులూ గడగడా వణికి పోతూ ఉండేవి. మరి, తన కోరిక తీరడం ఎలాగో దానికి తెలిసేది కాదు !
      చాలా రోజులు ఆలోచించాక దానికి ఓ ఉపాయం తట్టింది.  ఒక రోజు ఆబోతు  ఆ దారంట వస్తూ ఉంటే ,కొంచె ధైర్యం చేసి దానికి ఎదురుపడి నిలుచుంది. ఆబోతు కోపంతో రంకె వేసింది.  కొమ్ములు విదిల్చి చిట్టెలుకను  మరు క్షణంలో నల్లిని నలిపినట్టు నలిపేసేదే !  కానీ చిట్టెలుక గుండె దిటవు చేసుకుని గొంతు  పెగుల్చుకుని  దానితో ఇలా అంది :
 ‘‘ మహానుభావా !  నీ అంత ధైర్యశాలి, బుద్ధిమంతుడూ, అందగాడూ, ఈ భూప్రపంచంలో మరెక్కడా లేడని నా అభిప్రాయం. కానయితే, నీలాంటి గొప్ప వాడికి ఇది ఉండడానికి తగిన చోటు కాదనిపిస్తోంది. ఈ ఇరుకు గ్రామంలో బలహీనులూ. పిరికి పందల మధ్య, వారి బలహీనమయిన పెంపుడు జంతువుల మధ్య , మేరు పర్వతం లాంటి వాడవైన నువ్వు తినుగాడడం నాకెందేకో చిన్నతనంగా తోస్తున్నది. ఇక్కడికి చాలా దూరంలో ఒక విశాలమైన  గొప్ప మైదానం ఒకటి ఉంది. అది నూరు యోజనాల దూరం వవ్యాపించి ఉంటుంది. ఆ మైదానంలో పెద్ద పెద్ద జంతువులు ఎన్నో తామే గొప్ప బలశాలురమని గర్విస్తూ తిరుగుతూ ఉంటాయి. నువ్వు వాటి పొగరు అణచాలి. నీకు అదే తగిన చోటు ! ’’ అంది.
     దాని మాటలకు సంతోషించి ఆబోతు తనకు ఆ మైదానానికి వెళ్ళే దారి చూపించమని చిట్టెలుకను కోరింది.
     అప్పుడు చిట్టెలుక ‘‘ నేను త్రోవ చూపించ గలను. కానీ , పెద్ద పెద్ద కొండల మీదా, గుట్టల మీదా ఎక్కితే కానీ అది కనిపించదు. నీకంటె ఎత్తయిన కొండలేవీ ఈ సమీపంలో లేవు. అదే ఆలోచిస్తున్నాను ! ’’ అంది.
    దానికి ఆ ఆబోతు ‘‘ దానికేముంది !  నా వీపు మీద ఎక్కి నువ్వు అక్కడికి వెళ్ళే దారి చూపించు ! ’’ అంటూ, చిట్టెలుకను తన మూపు మీదకి ఎక్కించుకుంది.  గొప్ప మైదానానికి దారి చూపించే నెపంతో చిట్టెలుక ఆబోతు మూపు మీదకి ఎక్కిగ్రామంలోనే కాక, పరిసర ప్రాంతాలలో కూడా చాలా సేపు ఊరేగింది. ఆబోతు మీద స్వారీ చేస్తున్న చిట్టెలుక ధైర్యానికీ, అదృష్టానికీ తల్లి ఎలుకతో పాటు తక్కిన జంతువులన్నీకూడా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ భయంతో ప్రక్కలకి తప్పుకున్నాయి.
   ఆబోతు చిట్టెలుకను మోసుకుంటూ చాలా సేపు తిరి తిరిగి అలసి పోయింది. దానికి కోపం ముంచుకు వచ్చింది.  అక్కడంటే, ఇక్కడనీ, ఇక్కరడంటే , అక్కడనీ  అదిగో ! ఇదిగో ! అంటూ చిట్టెలుక ఆబోతుని చాలా దూరం తిప్పింది. తన సరదా తీర్చుకుంది ! దాని ముచ్చట తీరి 
పోయింది !
    ఆబోతు యిక నడవ లేక కోపంతో రగిలి పోతూ చిట్టెలుకను చంపుతానంటూ  రంకెలు వేయసాగింది.
     తన చిరకాల కోరిక తీరి పోవడంతో చిట్టెలుక తృప్తిగా ఆబోతు వీపు మీదనుండి చెంగున దుమికి, అంతే వేగంగా ఎక్కడికో పారి పోయింది.
     పొగరుమోతు ఆబోతుకి  మన చిన్నారి చిలిపి కోరికల చిట్టెలుక ఇక మరి ఎక్కడా కనిపంచనే లేదు !

22, ఆగస్టు 2014, శుక్రవారం

చెవులు లేని చెవుల పిల్లి !


అనగా అనగా ఒక కారడివిలో ఒక చెవుల పిల్లి ఉండేది. దానికి  ఎప్పుడూ స్వేచ్ఛగా దుముకుతూ తిరగడం చాలా ఇష్టం. అంతే కాక తాను అనుకున్నది జరిగి తీరాలనే పంతమూ, పట్టుదలా కూడా ఎక్కువే ! ఒక రోజు అది అడవిలో తిరుగుతూ ఉండగా దానికి ఒక పెద్ద ఏనుగు కనిపించింది.  ఆ ఏనుగు చెవులు చేటలంతేసి ఉన్నాయి.  ఏనుగు చెవులను చూసి చెవుల పిల్లి అసూయతో కుమిలి పోయింది.
‘‘ భగవంతుడా ! నువ్వెంత నిర్దయుడి వయ్యా !   అందరూ  చెవుల పిల్లి అని పిలిచేలా నన్ను పుట్టించావు. నాకా, ఈ వేలాడే చెవులను ఇచ్చావు. అందమయిన ఆకారం ఇచ్చావు. ఆ ఏనుగుని చూడు ! భారీ కాయంతో ఎంత అంద వికారంగా ఉందో ! దానికి చిన్న కళ్ళూ, చేటంత చెవులనూ ఇచ్చేవు. నీకిది ధర్మ మేనా ?  చెవుల పిల్లి అనే పేరున్న నాకు ఏనుగు వలె చేటంత చెవులు ఉన్నప్పుడు కదా నా పేరుకి సార్ధకత !’’ అని బాధ పడుతూ అడివంతా విచారంతో తిరిగింది. ఒక చోట ఒక మహా ముని తపస్సు చేసుకుంటూ దానికి కనబడ్డాడు.చెవుల పిల్లి తన గోడు ఆ ఋషి ముందు వెళ్ళ బోసుకుంది.  అది దేవుడు  ప్రకృతి సిద్ధంగా ప్రసాదించినదని ఋషి ఎంత చెప్పినా  చెవుల పిల్లి  విన లేదు. తనకి కూడా ఏనుగు కున్నలాంటి చేటంత చెవులు వచ్చేలా చేయమని ఋషిని  వేడుకుంది. ఎంత చెప్పినా మొండిగా అది వినక పోవడంతో ఇ ఋషి దానికి నుగు కున్నలాంటి చేటంత చెవులు వచ్చేలా చేసాడు. కొత్తగా వచ్చిన చేటంత చెవులను చూసుకుని చెవుల పిల్లి ఆనందంతో ఉప్పొంగి పోయింది. నేస్తాలకు తన చేటంత చెవులను చూపిస్తూ గొప్పలు పోయింది.  ‘‘ మన జాతికి చెవుల పిల్లులని పేరు. నిజానికి మనకి  ఇప్పుడు నాకున్నాయే, ఇంతలేసి చెవులు ఉండాలి.  మీవేం చెవులు ! నా చెవులు చూడండి ఎంత పెద్దవో ! ’’ అంటూ బడాయి పోయింది. దాని మిడిసిపాటు చూసి నేస్తాలు ఏమీ అన లేక పోయేయి.
    అయితే, ఆ చేటంత చెవులు వచ్చిన చెవుల పిల్లి సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు.  తన శరీరం కంటె చాలా పెద్దవయిన ఆ చెవులను మోసుకుంటూ నడవ లేక అది నానా అవస్థలూ పడసాగింది.ఏమీ తిన లేక పోయేది. విశ్రాంతిగా కునుకు తీయ లేక పోయేది. తక్కిన తోటి చెవుల పిల్లులు ఎప్పటి లాగే తమ పనులు హుషారుగా చేసుకుంటూ చెంగు చెంగున గెంతులు వేస్తూ తిరుగుతూ ఉంటే అది దిగులుగా భారీ చెవులను కదప లేక ఉండి పోయేది. ఇక లాభం లేదని మళ్ళీ  ఆ ఋషి పుంగవుడిని వెతుక్కుంటూ అడివంతా తిరిగింది.
   చాలా దూరం తిరిగి వెతగ్గా వెతగ్గా , దానికి ఆ ఋషి కన బడ్డాడు. వెంటనే చెవుల పిల్లి  ఋషితో  ‘‘ స్వామీ ! బుద్ధి తక్కువై నాకు ఏనుగుకి వలె చేటంత చెవులు కావాలని అడిగేను. మీరు ప్రసాదించేరు. వీటితో నాకు నానా యాతనగా ఉంది. ఇక ఇవి నాకు వద్దు.వెంటనే ఇవి పోయేలా అనుగ్రహించండి. అంతే కాదు, నాకసలు ఇప్పుడు చెవులంటేనే రోత పుడుతోంది.  అందు చేత నాకు అసలు చెవులే లేకుండా చేయండి ’’ అంది. దాని మాటలకు ఋషి నవ్వుతూ
 ‘‘ చిన్నారీ ! నువ్వు తగని కోరికలు కోరుతున్నావు !  చేటంత చెవులు కావాలని కోరుకుని దాని వలన అనర్ధాన్ని అనుభవించేవు. అయినా నీకు ఙ్ఞానోదయం కలుగ లేదు.  ఇప్పుడసలు చెవులే వద్దంటున్నావు.  ప్రమాదం సుమా ! ’’ అని హెచ్చరించాడు
అయినా సరే అ జగమొండి చెవుల పిల్లి తన పంతం విడువ లేదు.ఏమయినా సరే తనకు చెవులే అక్కర లేదంటూ భీష్మించుకు కూర్చుంది.ఇక చేసేది లేక ఋషి దానికి చెవులే లేకుండా చేసి వెళ్ళి పోయాడు.
     చెవులు లేని చెవుల పిల్లి సరదాగా గెంతులు వేస్తూ తన నేస్తాల దగ్గరకి వచ్చింది. వాటితో గొప్పగా ఇలా అంది ‘‘ పేరు గొప్పా ఊరు దిబ్బానూ !
చెవుల పిల్లులమట ! చెవుల పిల్లులం ! మన కంటె లోకంలో ఏ ఇతర జంతువుకీ మనకున్నంత చెవులు లేనప్పుడు కదా మనం ఆ పేరుకి తగిన వారమవుతాం ! అందు చేత నేనిప్పుడు చెవులే లేకుండా చేసుకున్నాను. ఎంత హాయిగా ఉందో !
నాకా చెవులంటేనే అసహ్యం ! మీరంతా ఆ దిక్కుమాలిన చెవులను వేలాడేసుకుని తిరగండి!  నన్ను చూసి కుళ్ళుకోండి ! ’’ అంది గర్వంగా.
    ఐతే, ఈ సారి కూడా దాని  ఆనందం ఎక్కువ సేపు నిలవ లేదు. చెవులంటూ లేక పెవడం  వల్ల దాని కసలు ఏ శబ్దమూ వినిపించడం లేదు !  లోగడ చీమ చిటుక్కు మన్నా దానికి తెలిసి పోయేది.  ఇప్పుడా అవకాశం దానికి లేకుండా పోయింది.  దాని తెంపరి తనం తెలిసినా, దాని మీద జాలితో తక్కిన చెవుల పిల్లులు శత్రువు జాడ పొడసూపగానే దానిని హెచ్చరించేవి. అవి హెచ్చరించే దాకా దానికా సంగతే తెలిసేది కాదు కూడానూ ! చాలా సార్లు తృటిలో పెద్ద ప్రమాదాల నుండి నేస్తాల వలన తప్పించుకో గలిగింది.  ఇలా అనుక్షణం  అది తక్కిన చెవుల పిల్లుల మీద ఆధార పడ వలసి వస్తోంది. ప్రతి క్షణం ఏ ఆపద వస్తుందో అని భయంతో గడగడలాడి పోతోంది. రాబోయే ఆపదను గ్రహించడానికి దానికిప్పుడు చెవులు లేవు కదా !
   తన తప్పును తెలుసుకుని అది తనకి తిరిగి మామూలుగా ఉండే చెవులనిమ్మని వేడుకుందామని ఆ ఋషి కోసం వెతుకుతూ అడివంతా తిరిగింది.
    ఎంత వెతికినా దానికి ఆ ఋషి జాడ కనబడనే  లేదు !
     చేసు కున్నంత వారికి చేసుకున్నంత !!

21, ఆగస్టు 2014, గురువారం

మాయా దర్పణం

                  

కోమల పురం రాజు గారికి ఒక్కగా నొక్క సంతానం. లేక లేక కలిగిన ఆడు బిడ్డకి అపరంజి అని పేరు పెట్టుని రాజ దంపతులు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండే వారు. దానితో ఆ పిల్లకి గారాబం ఎక్కువయి చాలా తల బిరుసుగా తయారయింది. ఆమె అపురూప లావణ్యవతి. అనునిత్యం అద్దంలో తన ప్రతి బింబం చూసుకుంటూ మురిసి పోతూ ఉండేది. పొద్దస్తమానం అద్దం ముందు నుండి కదిలేది కాదు. అద్దం తోడిదే లోకంగా ఉండేది. రోజంతా అద్దం ముందు నిలబడి ఒయ్యారాలు పోతూ ఉండేది. ఆమె నయగారాలు చూసి తల్లి దండ్రులు తెగ ముచ్చట పడిపోతూ ఉండే వారు. రాజు  ఆమె కోసం ఎక్కడెక్కడి నుండో మంచి మంచి అద్దాలను తెప్పించి కుమార్తెకు ఇచ్చే వాడు. అవి రకరకాల కొలతలతో, లతలు మొదలయిన రకరకాల అంకారాలతో, మంచి నగిషీలతో ఒప్పుతూ ఉండేవి. అసరంజికి వాటిలో చాలా మట్టుకు నచ్చేవి కావు. నిర్లక్ష్యంగా చూసి ప్రక్కన పడేస్తూ ఉండేది.
    తన అందాన్ని ద్విగుణీకృతం చేయగల అద్దం కావాలని ఆమె కోరిక.అలాంటి అద్దం దొరకడం అసాధ్యం అని ఎవరెంత చెప్పినా ఆమె వినిపించు కునేది కాదు. తన పట్టుదలా. పంతమూ తనదే. కోమలపురం ప్రభువు రకరకాల అద్దాలను ఎంత ఖరీదయినా వెనుతీయకుండా కొనుగోలు చే స్తున్నాడని  తెలిసి,ఎక్కడెక్కడి నుండో వర్తకులు రకరకాల అద్దాలను తెచ్చి , రాజు గారికి విక్రయిస్తూ ఉండే వారు.
    ఇలా ఉండగా ఒక రోజు  నేపాళ దేశం నుండి ఒక వర్తకుడు వచ్చి,అద్బుతమైన పనితనంతో అలరారుతూ ఉన్న ఒక చక్కని  నిలువెత్తు అద్దం ఒకటి అమ్మకానికి తెచ్చాడు. అపరంజి ఆ అద్దాన్ని చూసి వర్తకునితో ‘‘ఇది నా అందాన్ని రెట్టింపు చేసి చూపెడుతుందా ? ’’ అని అడిగింది. అందు కతడు వినయంగా చేతులు జోడించి,  ‘‘ అలాంటి అద్దం ఇంత వరకూ ఎవరూ తయారు చేయ లేక పోయేరు యువ రాణీ ! అయితే ఇప్పటికి మాత్రం వ్యక్తుల ప్రతి బింబాన్ని ఉన్నదున్నట్టుగా చూపెట్టడంతో పాటూ,  వారి నిజ స్వరూపాన్నీ అంతరంగాన్నీ చూపెట్టగల అద్దం మాత్రం తయారయింది.  అదొక మాయా దర్పణం ! అదే, ఇది ! ’’అన్నాడు.  అపరంజి కుతూహలంతో తండ్రి చేత దానిని చాలా ధనం పోసి కొనిపించింది.
     వర్తకుడు వెళ్ళి పోయేక అపరంజి ఆ అద్దాన్ని తన గదిలో పెట్టు కుని అందులో తన ప్రతి బింబం  చూసుకుంది. ఇంకే ముంది ! అద్దంలో ఆమెకు తన ప్రతి బింబం చాలా వకృతంగా కనిపించింది ! దానితో ఆమె ఉగ్రురాలై వర్తకుని కోసం భటులను పంపించి వెతికించి బంధింప చేసి కారాగారంలో పడ వేయించింది.
    ఆ తరువాత తన గది లోకి వెళ్ళి మరో మారు అద్దంలో తన రూపం చూసుకుంది. ఆ సారి ఆమెకు తన రూపం అద్దంలో జంతు రూపంలో కనబడింది. ఆమెకి పట్టరానంత ఆగ్రహం కలిగింది. వెంటనే  కారాగారంలో ఉన్న వర్తకుని ఉరి తీయించమని తండ్రి గారితో చెప్పింది.
   వర్తకుడిని ఉరి తీసే ఘడియలు సమీపిస్తూ ఉండగా, కుతూహలం పట్ట లేక అపరంజి అద్దంలో మరో మారు తన రూపం చూసుకుంది. ఆశ్చర్యం ! ఈ సారి ఆమెకు అద్దంలో తానొక రాక్షసి రూపంలో కనిపించింది. దానితో ఆమె విపరీతంగా భయ పడి పోయింది. ఏడుస్తూ తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగినదంతా తండ్రికి వివరించి చెప్పింది. రాజు వర్తకునికి వేసిన ఉరి శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసి,  రాజ పురోహితుని రప్పించి, అపరంజికి కలిగిన అనుభవాలను గురించి చెప్పి, కారణ మేమిటని అడిగాడు.
    రాజ పురోహితుడు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు  ‘‘ ప్రభూ ! అహితం చెబుతున్నందుకు తమరు అన్యథా భావించ వద్దు. మన్నిస్తే నాకు తోచిన కారణం విశదం చేస్తాను. అవధరించండి.  యువ రాణి వారు తొలిసారిగా మాయా దర్పణంలో చూసు కున్నప్పుడు, లోకాతీత మయిన అంద గత్తెననే అహంకారం వల్ల ఆమెకు తన రూపం వికారంగా కనబడింది. వర్తకుని అకారణంగా చెరసాలలో బంధించి నందుకు  రెండో సారి జంతు రూపంలో తను కనబడింది.  మూడవసారి ఏకంగా వర్తకుని నిర్దయగా ఉరి తీయించ మన్నందుకు ఆమెకు తానొక రాక్షస
 స్త్రీ గా కనిపించింది. యువ రాణి వారిలో మార్ప వస్తే తిరిగి ఆమెకు తన ప్రతి బింబం మామూలుగా కనబడే అవకాశం ఉందని అనిపిస్తోంది’’ అని వివరించాడు.
   వెంటనే అపరంజి అతని మాటలలో నిజానిజాలు తెలుసుకోగోరి వర్తకుని ఉరిశిక్షను రద్దు చేయించింది. ఈ సారి ఆమెకు అద్దంలో జంతు రూపంలో తాను కనిపించింది. వర్తకునికి విధించిన కారాగార శిక్షను రద్దు చేయించాక అద్దంలో చూసుకుంటే, ఆమెకు మానవ రూపంలోనే  కనిపించింది. అయినా  కొంత అనాకారితనంతో కనిపించింది. అపరంజి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో గర్వాన్ని విడిచి పెట్టి, ఆ వర్తకునికి విలువయిన కానుకలను ఎన్నింటినో ఇచ్చి గౌరవించి పంపింది.
    వర్తకుడు మహదానంతో వెళ్ళి పోయేక, అపరంజి కొంత బెరుకుగానే తన రూపం అద్దంలో చూసుకుంది.
    ఈ సారి అద్దంలో తన రూపం ఆమెకు అందంగా కనబడింది. !
     అంతే కాదు, మునుపటి కన్నా రెట్టింపు అందంగా కనబడింది !!
    

18, ఆగస్టు 2014, సోమవారం

ఊరి పేరు నిలపాలి !



 కోతుల గూడెంలో అసంఖ్యాకంగా కోతులు ఉండేవి.  అవి ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తూ నానా హంగామా చేస్తూ ఉండేవి. కోతుల గూడెం ప్రజలకు కోతుల బెడద చెప్పనలవి కానంతగా ఉండేది. ఏ క్షణంలో ఏ కోతి వచ్చి గాయ పరుస్తందో అని బెంబేలు పడిపోతూ ఉండే వారు. అవి గుంపులు గుంపులుగా వచ్చి, చాలా బీభత్సం చేస్తూ ఉండేవి. ఇళ్ళలోకి చొరబడి, వస్తువులను చిందరవందర చేస్తూ వీరంగం  సృష్టిస్తూ ఉండేవి.  అదిలిస్తే మీద పడి రక్కేవి.వాటి అల్లరీ ఆగంతో కోతుల గూడెం ప్రజలకు రాత్రిళ్ళు నిద్ర కూడా కరువయ్యేది. దానితో నీరసం కమ్ముకొచ్చి డీలా పడి పోయే వారు. ఒంట్లో సత్తువ  సన్నగిల్లడంతో వారు తమ రోజువారీ పనులు కూడా సక్రమంగా చేసుకో లేక పోయే వారు.  కోతుల బెడద ఎలా వదిలించు కోవాలో తెలియక దిగులు చెందే వారు.
    ఇలా ఉండగా, ఒక రోజు ఆ ఊరికిఒక సాధువు వచ్చేడు. గ్రామ ప్రజలు అతనికి రామాలయంలో ఆశ్రయం కల్పించేరు.
      అలా సాధువుకి ఆశ్రయం కలిపించాక, కోతుల గూడేనికి కొత్త ఆపద వొకటి వచ్చి పడింది. మునుపెన్నడూ లేని విధంగా గ్రామంలోని ఇళ్ళలో  దొంగతనాలు విరివిగా జరుగు తున్నాయి. ఎవరి కంటా పడకుండా  ఎవరో లాఘవంగా ఇళ్ళలోకి జొరబడి అందినకాడికి దోచుకు పోతున్నారు. కోతుల బెడదతో పాటూ ఈ దొంగల బాధేమిటని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పగలంతా  కోతుల బెడదతోఅలసి పోయిన ప్రజలు రాత్రిళ్ళు  ఒళ్ళెరక్కుండా నిద్ర పోతున్నారు. దాంతో దొంగల పని తేలికవుతోంది !
చాలా రోజులు ఈ బాధలు అనుభవించేక వారి ఓర్పు నశించి పోయింది.
దొంగల బెడద తగ్గాలంటే, ఊరి శివార్లలో ఇరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం స్థాపించడమే సరైనదని వారికి సాధువు చెప్పాడు. సరే అంటే సరే అనుకుని, ఊరి ప్రజలు చందాలు వేసుకుని ఆంజనేయ  స్వామి విగ్రహం స్థాపించే బాధ్యత సాధువు మీద ఉంచేరు. చందాలు వేసుకుని , పోగయిన ధనమంతా సాధువు చేతిలో ఉంచారు,
      ఆ రాత్రే వాళ్ళిచ్చిన డబ్బుల మూటతోనూ, ఊరిలో దొంగతనం చేసిన ధనంతోనూ  సాధువు ఊరొదిలి ఎక్కడికో పలాయనం
 చిత్తగించాడు !
     ఆ వార్త తెలుసుకుని ఊరి ప్రజలంతా లబోదిబో మన్నారు. కాస్సేపటికి వారిలో వారు తర్జన భర్జనలు చేసుకుని, అసలు ఆ సాధువుని నమ్మడమే తమ తప్పిదమని తెలుసు కున్నారు.
    వంచన చేసే మనిషి బుద్ధి కోతి బుద్ధి కన్నా హేయమయినదని  వారికి అర్ధమయింది.  తాతల కాలంనుండీ తమ గ్రామలో తమతో పాటూ కోతులు కూడా సహజీవనం చేస్తున్నాయనీ, వాటి వల్లనే తమ ఊరికి కోతుల గూడెమనే పేరు వచ్చిందనీ వారికి స్ఫురించింది ! ఊళ్ళో కోతులనేవే లేకుండా చేస్తే తమ ఊరి పేరు సమసి పోతుందని వారికి తోచిం ది. కోతుల గూడెం అనే తమ ఊరి పేరు నిలపాలనుకున్నారు !
ఆ ఊరి ప్రజలు మునుపటిలా కోతులను     తరిమెయ్యకుండా, వాటి పట్ల ప్రేమతో మెలగడం మొదలెట్టారు.వాటికి రకరకాల తినుబండారాలు అందిస్తూ,ప్రతి యేటా కోతుల పండుగ పేరిట  ఉత్సవాలు కూడా నిర్వహించడం మొదలు పెట్టారు !
  మునుపు తోటల వెంటా, తోపుల వెంటా తిరిగే కోతు లన్నీ, ఇప్పుడు ఊరి ప్రజలు కొత్తగా నిర్మించిన హనుమంతుని ఆలయంతో కిచ కిచలాడుతూ,  తెగ సందడి చేస్తూ కనిపిస్తున్నాయి.
   వాటి వైభవం చూడాలంటే, మీరు వెంటనే కోతుల గూడెం వెళ్ళి తీరాలి !
కోతుల వలన మీకు ఏ ఆపదా రాదు. వస్తే గిస్తే కోతి బుద్ధి కలిగిన మనుషుల వల్లనే ... అలాంటి వారెవరయినా మీకు తారస పడితే మాత్రం ఏం జరుగుతుందో నేను చెప్ప లేను. మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది .
       

14, ఆగస్టు 2014, గురువారం

చుక్కల సమావేశం





ఒకసారి ఆకాశంలో చిన్న చుక్కలన్నీ కలిసి ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో అవి చాలా దీర్ఘంగా తమ కష్టాల గురించి చర్చించాయి.మరీ కొన్ని చిన్న చుక్కలయితే, మరింత ఉద్రేకంగా ప్రసంగించాయి. యుగ యుగాల నుండీ అవి తమకు జరుగుతున్న అన్యాయాలను గురించి గొంతెత్తి సభలో ఘోషించాయి.

వాటి చర్చల సారాంశం ఏమిటంటే, గగన వీధిలో పెద్ద చుక్కలతో పాటు కోట్లాది సంఖ్యలో ఉన్న తమకి ఏ ప్రత్యేకతా లేక పోవడం అన్యాయం అని ... తమకు న్యాయం జరగాలని అవి గట్టిగా కోరుకుంటున్నాయి. పెద్ద చుక్కలు తమ ప్రియనాథుడు చంద్రుడికి దగ్గరగా ఉండడం, తాము మాత్రం దూరంగా ఎక్కడో విసిరివేయబడినట్టు కనీ కనిపించకుండా మిణుకు మిణుకుమంటూ కునారిల్లిపోతూ ఉండడం అవి సహించ లేక పోతున్నాయి. అంతే కాక, పెద్ద చుక్కల్లో కొన్నింటికి ఏవో మంచి పేర్లు కూడా ఉండడం, వాటిని గురించి పురాణాలలో కథలు ప్రసిద్ధిలో ఉండడం కూడా వాటికి అవమానకరంగా ఉంది. అందుకని చిన్న చుక్కలన్నీ కూడబలుక్కుని సమావేశమై తాము తీసుకున్న నిర్ణయాన్ని తమ రేడు చంద్రుడికి వినయంగా విన్నవించుకున్నాయి.

చంద్రుడు నవ్వి, అలాగే చూదాం ! అన్నాడు. ఇలాచాలాసార్లు జరిగింది. చిన్న చుక్కలకి న్యాయం జరుగ లేదు. అందుకు అవి తీవ్రంగా మనస్తాపం చెందాయి. కొన్ని చుక్కలయితే, ఏకంగా నేల మీదకి రాలి ఆత్మహత్యలు కూడా చేసుకున్నాయి.

చిన్న చుక్కలు తమ వారి బలిదానాలను భరించ లేక పోయాయి. వాటిఆందోళన నానాటికీ తీవ్రతరమవుతూ ఉండడంతో

చంద్రుడు వాటితో ఇలా అన్నాడు ‘‘ మీ అసంతృప్తిని గమనించాను. ప్రకృతికి కొన్ని నియమాలుంటాయి. వాటిని అధిగమించి ఉండడం ఎవరికీ సాధ్యం కాదు.అయినా, మీరంతా ఇంతలా కోరుకుంటున్నారు కనుక, మీ కోరిక నెరవేర్చాలనే నాకూ ఉంది. ముందుగా మీరు ఎంత మంది ఉన్నారో లెక్కగట్టి నాకు చెప్పండి. అప్పుడు మీ అందరికీ ఏయే పేర్లు పెట్టాలో, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నిర్ణయిస్తాను. ’’

చిన్న చుక్కలన్నీ సరే అంటే సరే అన్నాయి.

అప్పటి నుండీ ఆకాశంలో చిన్న చుక్కలన్నీ చుక్కల గణనలో తలమునకలయి పోయేయి.

యుగాలు గడుస్తున్నా వాటి లెక్క తేలడం లేదు.

మబ్బుల పరదా వెనుక ముసిముసి నవ్వులు చిందిస్తూ

చుక్కల రేడు వినోదం చూస్తూనే ఉన్నాడు !


13, ఆగస్టు 2014, బుధవారం

దొంగ గారు



మ్మ కథలు చెబుతుంది. అమ్మమ్మ కథలు చెబుతుంది. తాతయ్య కథలు చెప్పడమే కాదు చక్కని చిన్న చిన్న పద్యాలూ, శ్లోకాలూ కూడా చెబుతాడు. నాన్న కథలు చెప్పరు, కానీ, కథలు రాస్తారుట ! నేను చదవ లేదనుకోండి ... పెద్దయితే చదువుతానులే.

అంచేత, నాకూ కథ రాయాలనిపించింది. వెంఠనే పెన్సిలు తీసుకుని నోటు పుస్తకంలో గబగబా రాసీసేను.

కథ పేరు : దొంగ గారు

అనగనగనగా నేమో ఒక ఇల్లు. అందులో అమ్మా, నాన్నా, అక్కా, నేనూనూ.

ఒక రాత్రేమో అమ్మా వాళ్ళింటికి, అంటే మా ఇంటికే లెండి ఒక దొంగ గారు వచ్చేరు. అంతా బజ్జుని ఉన్నాం.

దొంగ గారు మా ఇంటిలో డబ్బూ బంగారఁవూ అదీ పట్టుకు పోడానికి వచ్చేరన్న మాట.

అందరం లేచి దొంగ గారిని చూసేం. దొంగ గారు కూడా మమ్మల్ని చూసేరు.

‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మా ఇంటిలో కొంచెమే డబ్బు లున్నాయి. మా చిట్టికి పుస్తకాలూ, రంగు పెన్సిళ్ళూ అవీ కొనాలి. మా డబ్బులు పట్టుకు పోవద్దండీ ’’ అని, నాన్న దొంగ గారితో అన్నారు.

అమ్మేమో, ‘‘ చిట్టి పాపకి బోర్నవిటా, నూడిల్సూ, పుట్టిన రోజుకి బుట్టల గవునూ అవీ కొనాలి. మా కొంచెం డబ్బుని మీరు పట్టుకు పోవద్దూ ’’ అనంది.

అక్కేమో,‘‘ చిట్టి పాపకి రిబ్బన్లూ, జడ పిన్నులూ కొనాలి. మా ఇంట్లో కొంచెమే డబ్బులున్నాయి. తీసుకు పోవద్దూ, ప్లీజ్ !’’ అంది.

దొంగ గారు విన లేదు. ‘‘ మా చిన్నబ్బాయికి బువ్వ పెట్టాలి. నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే మీ కొంచెం డబ్బుని తీసుకు పోతాను’’ అన్నాడు కోపంగా.

అప్పుడు నేనేమా ధైర్యంగా దొంగ గారి దగ్గరకి వెళ్ళి, ‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మరేమో, మా అమ్మ రోజూ దేవుడికి పూజలు చేస్తే, దేవుడు మాకు కొంచెం డబ్బులు యిచ్చేడు. ఇంకా ఎక్కువ పూజలు చేస్తే యింకా ఎక్కువ డబ్బులు యిస్తాడన్న మాట.

మరందు చేత మీరు కూడా ఆంటీకి చెప్పి దేవుడికి ఎక్కువ పూజలు చేయమని చెప్పండి. దేవుడు మీకూ బోలెడు డబ్బులు ఇస్తాడు. మా కొంచెం డబ్బులు ఇప్పుడు తీసుకు పోకండేం ... దేవుడు మీకు చాలా డబ్బులు యిచ్చేక ఆంటీకీ,తమ్ముడికి మంచి బువ్వ పెట్టొచ్చును. మీరు కూడా ఈ మురికి బట్టలు మానీసి మంచి బట్టలు కుట్టించుకో వచ్చును...’’ అన్నాను.

దొంగ గారు నాముఖంలోకి చూసి, నా దగ్గరకొచ్చి. నాబుగ్గ మీద ముద్దు పెట్టీసుకున్నారు.

మరింక మా కొంచెం డబ్బులు తీసుకు పోకుండానే వెళ్ళి పోయేరు.

****** ***** ***** ***** ***** ***** *****

నాన్న నేను రాసిన ఈ కథ చదివి, అమ్మకు చూపించేరు. అమ్మ కూడా చదివింది. ఇద్దరూ ఎందుకో చాలా సేపు పడి పడి నవ్వేరు.

తరవాత నాన్న అన్నారూ : ‘‘ కథ బావుందమ్మా ,,, కానీ దొంగని దొంగ గారూ, దొంగ గారూ అని ఎందుకు రాసేవు. దొంగ అని రాయలేదేం ?’’ అనడిగేరు.

అందుకు నేను చెప్పేనూ : ‘‘అమ్మో ! నాకు బయ్యం ! ...’’