25, నవంబర్ 2014, మంగళవారం

దైవానుగ్రహం ఉంటే చాలు కదా !


పూర్వం అవంతీ రాజ్యంలో ఒక రాజు ఉండే వాడు. అతని పేరు నవనాథుడు. అతని రజ్యంశత్రు భయం లేకుండా ప్రశీంతంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండే వారు. ఎక్కడా అరాచకాలు  లేవు. ఆందోళనలు లేవు. ఆకలి చావులు అసలే లేవు.  ఇదంతా నత పరిపాలన లోని గొప్పతనం అని రాజు గట్టిగా నమ్మే వాడు.  దానితో అతనికి అహంకారం ఎక్కువయింది.
   నవనాథుని పూర్వీకులు ఎంతో భక్తి త్పరులు.  గుడులూ గోపురాలూ కట్టించేరు. ఎన్నో పుణ్య కార్యాలు చేసారు. పండితులను ఎంతో గౌరవంగా చూసుకునే వారు. నవనాథుని  పాలనలో అవన్నీ అంతరించి పోయాయి. దానికి కారణం రాజుకి దైవం మీద కన్నా,  త మీద ఉండ కూడనంత నమ్మకం ఉండడం చేతనే. దైవానిదేమీ లేదని, అంతా తన గొప్ప తనమేననీ అతడు నమ్మే వాడు.
    నవనాథుడు దైవ దూషన చేయక పోయినా, రాజ్యంలో దైవ కార్యాలకి ఏ మాత్రం ఆదరన లేకుండా పోయింది.దేవాలయాలు కళా విహీనాలయి పోయేయి !
పండితులకు ఆదరణ  లేకుండా పోయింది. రాజ పురోహితుడు సుశర్మ ఈ పరిస్థితి గమనించి చాలా బాధ పడ్డాడు. దైవానుగ్రహం గురించి రాజుతో ఒక రోజు సంభాషించేడు. రాజు ఆగ్రహించి, దైవానుగ్రహం కన్నా ప్రజలకు రాజానుగ్రహమే కావాలని వాదించాడు. ఏమీ అనలేక సుశర్మ మిన్నక ఉండి పోయాడు.
    ఇలా ఉండగా, కొన్నాళ్ళకు, రాచ కొలువులో కొన్ని ముఖ్య మయిన పదవులలో ఉద్యోగులను నియమించ వలసి వచ్చింది.  వాటిలో కొన్న పదవులు రాజు గారి అంత: పురంలో చేయాల్సినవి.  అంత: పురంలో కొలువు చేసే వారికి ఎక్కువ వేతనం ఉంటుంది.  మరి కొన్న రాజ్యం లోని వివివధ దేవాలయాలలో నిర్వర్తించాల్సినవి.  దేవాలయ విధులు చేసే వారికి వేతనం తక్కువగా ఉంటుంది. రాజు ఆ పదవులలో నియమించడానికి రాజ్యం లో నలు మూలలనుండి గొప్ప పండితులను పిలిపించాడు. ఆయా పదవులకు కావలసిన సంఖ్యలో  పండితులను ఎన్నిక చేసాడు. చిత్రంగా వారందరూ వేతనం తక్కవే అయినప్పటికీ,  దేవాలయాలలో విధులు చేయడానికే మొగ్గు చూపారు ! అంత: పురంలో ఉద్యోగానికి ఏ ఒక్కరూ సిద్ధ నడ లేదు.
     రాజుకి ఆగ్రహంతో పాటూ ఆశ్చర్యం కూడా కలిగింది ! అప్పటికి వారిని పంపి వేసి, సుశర్మను పిలిపించి వారలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుందని అడిగాడు.
సుశర్మ అదే అదునుగా రాజుకి ఇలా వివరించాడు :  ‘‘ మహా రాజా ! తమ అనుగ్రహం వలన మన రాజ్యంలో ప్రజలూ , పండితులూ  ఎంతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు.  దీనికి తిరుగు లేదు. ఈ మహా పండితులంతా తమ వకొలువులో కాకుండా, దేవాలయాలలో పని చేయడానికి ఒష్ట పడడానికి కారణం ఉంది. అదేమిటంటే, -  దైవానుగ్రహం ఉంటే, రాజానుగ్రహం ఎలాగూ ఉంటుందని వారు భావిస్తున్నారు. తమకు రాజానుగ్రహం ఎలాగూ పుష్కలంగా ఉంది కనుక ధనానికి లోటు లేదు. అందుకే  తమ అనుగ్రహం ఎప్పుడూ ఉండేలా వారు దైవానుగ్రహం కోరు కుంటున్నారు. అంచేతనే వేతనం తక్కు వయినప్పటికీ దైవానుగ్రహం పొందడానికి దేవాలయాలలో దైవ కార్యాలు చేయడానికే మొగ్గు చూపు తున్నారు. అంతే కానీ ఇది ప్రభువుల పట్ల అవిధేయత మాత్రం కాదు ! తమరు చిత్తగించాలి ’’ అని చెప్పాడు.
     మహా మంత్రి మాటలతో రాజులో పరివర్తన కలిగింది. అహంకారం తొలిగి పోయింది.
ఆ నాటి నుండీ ఆ రాజ్యంలో వేవాలయాలు తిరిగి కళకళలాడుతూ వర్ధిలాయి.
ప్రజలు  రెట్టించిన సుఖ సంతోషాలతో జీవించడం మొదలు పెట్టారు.
    శత్రు రాజ్యాలు దాని వేపు కన్నెత్తి చూస్తే వొట్టు!
     

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Very nice