3, డిసెంబర్ 2014, బుధవారం

కవులకు సత్కారం !


పూర్వం  ఒక గ్రామంలో  ముగ్గురు కవి పండితులు ఉండే వారు.  వారు ముగ్గురూ చక్కని కవిత్వం చెబుతూ చుట్టు ప్రక్కల గ్రామాలలో మంచి పేరు సంపాదించు కున్నారు.  కానీ , వారిని పేదరికం వెంటాడుతూ ఉండేది.  తమ రాజ్యాన్ని పాలించే రాజుని దర్శించుకుని, ప్రభువుల ఆశ్రయం పొందితే తప్ప , వారి దారిద్ర్యం తీరదని ఎవరో సలహా చెప్పారు.
    ‘‘ మనబోటి వారికి రాజాశ్రయం దొరకడం దుర్లభం ! వెళ్ళడం వృధా ప్రయాస ! ’’ అని, ఒక కవి నిరాశగా అన్నాడు.
   మరొక కవి, ‘‘ మన కవిత్వం గొప్పతనం విని, ప్రభువుల వారే మనల్ని ఆహ్వానించి సత్కరించాలి. అంతే తప్ప, మనంతట మనం వెళ్ళడం ఏమిటి !’’ అని వాదించాడు.
   మూడో కవి  వారిని బ్రతిమలాడి, ఎలాగో వారికి నచ్చ చెప్పి, రాచ నగరుకి బయలుదేర దీసాడు.  కవులు ముగ్గురూ రాచ నగరుకి వెళ్ళి, అక్కడ వో సత్రంలో బస చేసారు. రాజ దర్శనం అనుకున్నంత తేలికగా లభించదని వారికి అర్ధం కావడానికి అట్టే రోజులు పట్ట లేదు !
మొదటి కవి , ‘‘ ఇక రాజు గారి దర్శనం దొరకడం వట్టి మాట ! నేను ముందే చెప్పాను కదా ... నేను మన గ్రామానికి తిరిగి వెళ్ళి పోతున్నాను.  ’’ అన్నాడు. రెండో కవి ‘‘ నేనూ ముందే చెప్పాను కదా ! మనంతగా  మనం రాజ దర్శనానికి రావడంసరికాదని. అలా చేస్తే లోకువ అయి పోమూ ! మనం ఇక్కడకి రావడమే తెలివి తక్కువ.  నేను తిరిగి మన గ్రామం వెళ్ళి పోతున్నాను. ’’ అన్నాడు. ఆ ఇద్దరు కవులూ గ్రామానికి వెళ్ళి పోయాక,  మూడో కవి మాత్రం అక్కడే ఉండి, రాజ దర్శనం కోసం ఓపికగా నిరీక్షించ సాగేడు.
  వేగుల వలన రాజు ఈ ముగ్గురు కవుల గురించి విన్నాడు.  ముదుంగా గ్రామం నుండి మొదటి కవిని సభకి  పిలిపించాడు.  అతని కవిత్వం సాంతం వినకుండానే  అతనికి కొద్దిపాటి ధనం యిచ్చి, పంపించివేసాడు.  తర్వాత, గ్రామం నుండి  రెండో కవిని పిలిపించి, అతని కవిత్వం పూర్తిగా విని ఆస్వాదించి, అతనికి గొప్ప బహుమానాలు ఇచ్చి. సత్కరించి పంపించాడు.  ఆ తర్వాత, మూడో కవిని
అతను బస చేసిన సత్రానికి భటులను పంపి. సభకు రప్పించాడు.అతని కవిత్వం కొంచెం విని, తొలి కవికి ఇచ్చిన దానికన్నా కొంత ధనం ఎక్కువ ఇచ్చి పంపించాడు.
   ఇదంతా గమనిస్తున్న మహా మంత్రి రాజుతో ‘‘ ప్రభూ ! ఈ ముగ్గురు కవులలో ఏ ఒక్కరూ  తక్కువ ప్రతిభావంతులు కారు.  ముగ్గురి కవిత్వమూ ఒక్కలాగే రసవంతంగా ఉందికదా ! వారికి కానుకలు ఇవ్వడంలో ప్రభువులు వివక్ష చూపించడంలో ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది. అదేదో చెబితే వినాలని ఉంది. అనుగ్రహించండి ! ’’ అన్నాడు వినయంగా.
   రాజు నవ్వుతూ మంత్రితో  ఇలా చెప్పాడు :  ‘‘ మీరన్నట్టు ముగ్గురు కవులూ సమాన ప్రతిభావంతులే ! సందేహం లేదు. కానీ, మొదటి కవి ఒట్టి నిరాశా వాది. తన మీద తనకే నమ్మకం లేదు. అందు చేత, ఎప్పటికయినా అతని కవిత్వంలో పస తగ్గి పోయే వీలుంది.  మూడో కవి  చాలా ఓర్పు కల వాడు. అతనికి ఏ కొంచెం ఇచ్చినా, పొంగి పోయే రకం. మరిన్ని కానుకల కోసం, మెప్పు కోసం కవిత్వం వ్రాస్తూనే ఉంటాడు. కానీ మానెయ్యడు. ఇక, రెండో కవి గొప్ప ఆత్మాభిమానం ఉన్న కవి. కవులు నిరంకుశులు. అచంచల మయిన  ఆత్మాభిమానం ఉంటుంది. రెండో కవి అలాంటి వాడే. అతనికి సత్కారం చేయడంలో లోటు జరిగితే, ఆ కోపంతో ఇక మీదట కవిత్వ రచనకే స్వస్తి చెప్పే ప్రమాదం ఉంది ! అందుకే ముగ్గురు కవులనూ సత్కరించడంలోనూ, కానుకలు ఇవ్వడంలోనూ కావాలనే అలాంటి వివక్ష చూపించాను. వారు తమ ధోరణి మార్చు కున్నాక,  ఈ తడవ ముగ్గురికీ సమాన సత్కారాలు చేస్తాను. ’’ అని వివరించాడు.
    రాజు గారి  మాటలతో  సభ సంతోషంతో కరతాళధ్వనులతో మారు మ్రోగి పోయింది !

కామెంట్‌లు లేవు: