31, అక్టోబర్ 2014, శుక్రవారం

కుక్క కాటుకి చెప్పు దెబ్బ !


కంటకా పల్లిలో నారాయణడనే వాడు ఉండే వాడు. అతడు వట్టి జగడాలమారి.  అందరితోనూ నిష్కారణంగా ఎందుకో ఒకందుకు తగవులు పెట్టుకుంటూ ఉండే వాడు. అందు చేత అతనికి ఆ ఊర్లో స్నేహితులనే వారే లేకుండా పోయేరు,.
      ఇలా ఉండగా, ఒక రోజు నారాయణ ప్రక్క ఇంటి లోకి ఆనందుడు అనే వ్యక్తి అద్దెకి దిగాడు. అతనికి నారాయణ గురించి మీ తెలియక పోవడంతో,  అతనిని పలుకరిద్దామని  గోడ మీ నుండి నారాయణ ఇంటి వేపు చూసేడు.  ఆ రోజు నారాయణ ఇంట్లో ఏదో శుభ కార్యం జరుగుతోంది.  ఇంట్లో పిండి వంటలు వండు తున్నారు. ఆ ఘుమఘుమలు ఆనందుని ముక్కు పుటాలకు తగిలాయి.  ఇంతలో నారాయణ ఇంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఆనందుడు తనను తాను అతనికి పరిచయం చేసు కుంటూ ఇలా అన్నాడు : ‘‘ మేము ఈ దినమే
ఈ ఇంట్లో అద్దెకు దిగాము.  నా పేరు ఆనందుడు, మీతో పరిచయం కోరు కుంటున్నాను.  ఇవాళ మీ ఇంట్లో ఏదో విశేషం ఉన్నట్టుగా ఉందే !  వంటకాల వాసనలు కమ్మగా  ముక్కుకి తగులు తున్నాయి !మా ఆవిడా పిల్లలూ కూడా అదే అంటున్నారు ! ’’ అన్నాడు మెచ్చుకోలుగా.
      అంతే ! నారాయణ ఉగ్రరూపం ధరించాడు !శివాలెత్తి పోయేడు.  ‘‘ మేం ఎంతో ఖర్చు చేసి పదార్ధాలు తెచ్చుకుని వంటలు చేసుకుంటూ ఉంటే, వాటి వాసలు పీల్చి మీరంతా కడుపు నింపు కుంటున్నారా ? ! సిగ్గు లేదూ ! మా వంటల వాసనలు పీలిస్తే, మా వంటలు మెక్కి నట్టే ! అంచేత, మీ తిండికి అయిన  ఖర్చంతా ఇచ్చి తీర వలసినదే ! ’’ అంటూ గొడవ చేసాడు.  ఆ మాటలతో ఆనందుడికి తల తిరిగి పోయింది.  నోట మాట రాలేదు. చాలా సేపు ఇద్దరి మధ్యా గొడవ జరిగేక,  వాళ్ళూ వీళ్ళూ కలుగ జేసుకుని సర్ది చెప్పడంతో  అప్పటికి ఆ తగువు  సద్దు మణిగింది.  ఆనందుడు తన జీవితంలో ఇలాంటి జగడాలమారిని చూడ లేదనుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళి పోయేడు. ఎలాగయినా, నారాయణకి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించు కున్నాడు.
      ఆ తర్వాత ఓ  దినం ఆనందుడు బజారు వీధిలో ఎండ వేళ  ఒక చోట నిలబడి ఉండగా,  ఏదో పని మీద అక్కడికే వచ్చిన నారాయణ కూడా అతని ప్రక్కనే నిలబడ వలసి వచ్చింది.  అంతే  !  ఆనందుడు అతని చెంప ఛెల్లు మనిపించాడు ! అంతటితో ఆగకుండా ఇలా అరవడం మొదలు పెట్టాడు :
‘‘ బుద్ధి లేదూ ! నా మీద కాలు పెట్టి నిలుచుంటావా ! నా నీడ మీద కాలు పెట్టి నిలుచున్నావంటే, నా మీద కాలు పెట్టి నిలుచున్నట్టే.  నా నీడను త్రొక్కితే నన్ను త్రొక్కినట్టే.  నా నీడను అవమానిస్తే నన్ను అవమానించినట్టే ...’’ అంటూనే మరి రెండు దెబ్బలు వేసాడు. అనుకోని ఈ సంఘటని నారాయణ బిక్క చచ్చి పోయేడు. చుట్టూ జనం సోగయి, ఏం జరిగింటూ అడిగారు.  ఆనందుడు  లోగడ తన ఇంటి వంటకాల వాసనల గురించి నారాయణ తనతో గొడవ పెట్టుకోడం గురించి  చెప్పి. వారితో ఇలా అన్నాడు : ‘‘చూడండి ! ఇతగాడు నా నీడను త్రొక్కి  నిలబడ్డాడు. అంటే నన్ను అవమానించి నట్టే కదా ! అందుకే  కొట్టేను ! ’’ అన్నాడు.    అతని మాటల్లోని అంతరార్ధం అర్ధమై  ‘‘ కుక్క కాటుకి చెప్పు దెబ్బ !’’ అనుకుంటూ అందరూ గొల్లున నవ్వేరు. నారాయణని తిట్టి పోసారు.  దాంతో  నారాయణకి పొగరంతా అణగి పోయింది. అప్పటి నుండి , తన ధోరణి మార్చు కున్నాడు. 
    నోరు మంచి దయితే , ఊరు మంచి దవుతుందంటారు కదా !
    ఇప్పుడు నారాయణకి ఊరంతా స్నేహితులే తెలుసా !!