29, అక్టోబర్ 2014, బుధవారం

గుణ పాఠం !


మానాపురం అనే ఊళ్ళో భూమయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండే వాడు. అతనికి లెక్క లేనంత సిరి సంపదలు ఉండేవి. కాని, పరమ లోభి. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టే వాడు కాదు.అయితే, అతడు తన పిసినారి తనాన్ని పది మంది ముందూ వెల్లడి కాకుండా జాగ్రత్త పడే వాడు.
   ఒక సారి అతని దగ్గరకి రామయ్య అనే పేద  రైతు వచ్చి, తన కుమార్తె పెళ్ళికి వెయ్యి రాపాయలు  తక్కువ పడ్డాయనీ, అంచేత వో వెయ్యి రూపాయలు అప్పుగా ఇమ్మని అర్ధించాడు. ఆ సమయంలో భూమయ్య చుట్టూ ఊరి పెద్దలు చాలా మంది కూర్చుని ఉన్నారు.  అందరి మధ్య  రామయ్యని లేదు పొమ్మనడం కుదరక, భూమయ్య ఇరుకున పడ్డాడు. మింగా లేక, కక్కా లేక తన భావాలను ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు.
    రామయ్య అడిగిన వెయ్యి రూసాయలూ అతనికి ఇస్తూ ఇలా న్నాడు : ‘‘దానిదేముంది రామయ్యా ! ఈ డబ్బుతో నీ కూతురి పెళ్ళి జరిపించు. నాకు నువ్వు వడ్డీ ఇవ్వ నవసరం లేదు. అసలు కూడా, నీ దగ్గర ఎప్పుడు కలిగితే అప్పుడే తెచ్చియఇవ్వు. తొందరేమీ లేదులే ! నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నా బాకీ తీర్చ వచ్చును. పోయి రా !’’ అన్నాడు ఎంతో దయగా. భూమయ్య మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ అతని మంచి తనాన్ని ఎంతగానో పొగిడారు !
    భూమయ్య ఇంట్లో పని చేసే  గోపాలుడు అనే నౌకరు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తూనే న్నాడు. వాడికి తన యజమాని మాటలు నమ్మ బుద్ధి కాలేదు. బయటకి మంచి తనం చూపిస్తున్నా, యజమాని మనసులో ఏదో దురూహ ఉండే ఉంటుందని వాడు అనుమానించాడు.
     వాడు అనుమానించి నట్టే అయింది ! ఆ మర్నాడే భూమయ్య నౌకరు గోపాలుడిని పిలిచి ఇలా చెప్పాడు : ‘‘ నువ్వు వెంటనే రామయ్య ఇంటికి వెళ్ళు. అనుకోని అవసరం వచ్చి పడింది. అతనికి నేను నిన్న ఇచ్చిన వెయ్యి రూపాయలలో నాలుగు వందల రూపాయలు అడిగి తీసుకురా ! సాయంత్రానికి తిరిగి ఇస్తానని చెప్పు. రమయ్య కూతురి పెళ్ళికి ఇంకా  వారం రోజుల వ్యవధి ఉంది కదా ! ’’ అన్నాడు. గోపాలుడికి  యజమాని ఎత్తు తెలిసి పోయింది. చేసేది లేక, రామయ్య దగ్గరికి వెళ్ళి ,యజమాని చెప్పి నట్టే చెప్పాడు. రామయ్య ఇచ్చిన నాలుగు వందలూ తెచ్చి భూమయ్య చేతికి ఇచ్చేడు.  మరుచటి దినం కూడా మరో సాకుతో  మరో రెండు వందలు తెప్పించు కున్నాడు భూమయ్య. భూమయ్యకి ఏం అవసరం వచ్చిందో , పాపం ! అను కున్నాడే కానీ రామయ్యకి అతని మీద అనుమానం రాలేదు. పెళ్ళికి ఇంకా వ్యవధి ఉంది కనుక భూమయ్య  వెనక్కి తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాడనే నమ్మాడు రామయ్య. మూడో నాడు భూమయ్యే నేరుగా రామయ్య ఇంటికి వచ్చి, కన్నీళ్ళు పెట్టుకుని ఏదో కారణం చెప్పి ఆ సాయంత్రమే మొత్తం వెయ్యి రూపాయలూ మళ్ళీ ఇస్తానని చెప్పి  నాలుగు వందలు తీసుకుని పోయేడు ! దీనితో రాయ్యకి ఇచ్చిన వెయ్యి రూపాయలూ తిరిగి భూమయ్య తీసుకున్నట్టయింది ! ఆ సాయంత్రం కాదు కదా, మర్నాడు కూడా భూమయ్య అతనికి డబ్బు సర్దుబాటు చెయ్యనే లేదు. దానితో రామయ్య కళ్ళ నీళ్ళపర్యంత మయ్యేడు. ఇదంతా గమనిస్తున్న గోపాలుడు యజమాని నీచత్వాన్ని అసహ్యించుకున్నాడు.
    తన యజమానికి ఎలాగయినతా గుణపాఠం నేర్పాలని గట్టిగా అనుకున్నాడు ఆ రోజు రాత్రి భోజనాల వేళ భూమయ్య విస్తట్లో గోపాలుడు అన్ని పదార్ధాలూ వడ్డించేడు. తీరా యజమాని తిన బోతూ ఉంటే, ఆగమని చెప్పి,ఉప్పు తక్కువయిందనో, పులుపు చాల లేదనో, కారం వెయ్యడం మరచి పోయాననో చెబుతూ అతని వస్తట్లో నుండి ఒక్కో పదార్ధమూ తీసెయ్యడం మొదలు పెట్టాడు ! చివరకి విస్తరంతా ఖాళీ అయింది ! గోపాలుడు మళ్ళీ పదార్ధాలను వడ్డిస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడు భూమయ్య. కానీ ఎంత సేపు ఎదురు చూసినా, వడ్డంచడే !  దాంతో భూమయ్య కోపంతో ఊగి పోయాడు. ‘‘ విస్తట్లో వడ్డించి నట్టే వడ్డించి ,అన్నీ తీసేస్తా వేమిట్రా గాడిదా ! ’’ అంటూ గోపాలుడిని కొట్టడానికి చేయెత్తాడు. కానీ , అంత లోనే అతనికి గోపాలుడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనసుకి తట్టింది. రామయ్యకి తను చేసిన ద్రోహానికి ఇది ప్రతీకారమని  అతను గ్రహించాడు !  సిగ్గుతో తల దించు కున్నాడు.
ఆ మర్నాడే రామయ్యని పిలిపించి, అతని కుమార్తె పెళ్ళికి డబ్బు సర్దుబాటు చేసాడు ! అంతే కాక, వధువు చేతిలో విలువైన కానుకలు ఉంచి శీర్వదించేడు !
  ఆ నాటి నుండీ భూమయ్యలో పిసినారి తనం కలికానికి కూడా కనిపించ లేదు !