24, అక్టోబర్ 2014, శుక్రవారం

తిరగబడిన చిలుక తల్లి జోస్యం !


చిలకలపల్లిఅడవిలో పచ్చని చెట్లు విస్తారంగా ఉన్నాయి. వాటి మీద లెక్క లేనన్ని చిలకలు నివసిస్తూ ఉండేవి. అవి చేసే సందడి అంతా యింతా  కాదు ! తియ్య తియ్యని పండ్లను తింటూ, చిలుక పలుకులు పలుకుతూ అవి హాయిగా బ్రతుకుతూ ఉండేవి.
     వాటిలో ఒక కొంటె చిలుక కూడా ఉండేది. దాని చిలిపితనం చెప్పతరం కాదు !
ఎప్పుడూ ఏదో చిలిపి చేష్ట చేస్తూ,  తక్కిన వాటిని కడుపుబ్బా నవ్విస్తూ ఉండేది.  అది వయసులో అన్నిటికన్నా పెద్దది కావడం చేత, మిగతా చిలుకలన్నీ  దానిని ‘‘ చిలుక తల్లీ !’’ అని పిలుస్తూ ఉండేవి.  చిలుక తల్లి చేసే కొంటె పనులతో అవి ఒక్కో సారి అయోమయంలో పడిపోతూ ఉండేవి కూడా ! చిలుక తల్లి ఏవో అబద్ధాలు చెప్పి , వాటిని నమ్మిస్తూ ఉండేది. దాని  మాయ మాటలు విని అవి మోస పోతూ ఉండేవి. తన మాటకారితనంతో  వాటిని బురిడీ కొట్టించి వినోదించడం చిలుక తల్లికి ఒక వ్యసనంగా మారిపోయింది.
     ఒక్కో సారి ఫలానా తిథి నాడు భూ ప్రళయం వస్తుందని భయ పెట్టేది. మరోతూరి గ్రామం పొలిమేరల్లో ఉండే అగ్ని పర్వతం బ్రద్దలై పెను ముప్పు కలుగుతుందని హడలు కొట్టేది. ఇంకో సారి పదుల సంఖ్యలో బోయలు వచ్చి చిలుకల నన్నింటినీ ఉచ్చులు వేసి బంధించి తీసుకు పోనున్నారని అదర గొట్టేది. మరొక సారి , అడవి చెట్లన్నీ అకారణంగా కూలి పోయి, చిలుకలు తినడానికి ఒక్క పండూ మిగలదని జోస్యం చెప్పేది.  తీరా గడువు దాటి పోయినా ఏ ఆపదా కలగక పోవడంతో  చిలుకలు ఊపిరి పీల్చు కునేవి ! ఇలా  చిలుక తల్లి జోస్యం పేరుతో ఎన్ని సార్లు బెదర గొట్టినా,  ఆఅమాయకపు చిలుకలు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉండేవి !
     ఇలా ఉండగా, ఒక రోజు నిజంగానే ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చి. అక్కడి చిలుకలని పట్టుకోడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ వాడి చేతికి చిలుక తల్లి  చిక్కింది !  వాడు దానిని తీసుకుని పోయి, చెట్టు క్రింద చిలుక జోస్యం చెప్పే వాడికి అమ్మేసాడు. వాడు దాన్ని పంజరం లాంటి పెట్టెలో బంధించాడు. ఎగిరి పోకుండా రెక్కలు సన్నగా కత్తిరించాడు. పెట్టె మీద చేతి వేళ్ళతో తాను కొడుతూ ఉంటే , క్రింద  పరచి ఉంచిన కాగితాల కట్టలోంచి ఒక కాగితాన్ని ముక్కుతో తీసి ఇవ్వడం ఎలాగో దానికి తర్ఫీదు ఇచ్చేడు. ఇప్పుడు దాని పని ఆ జోస్యం  అబద్ధమని తెలిసినా కాగితాల కట్టలోంచి ఒక కాగితం తీసి ఇచ్చి, తిరిగి బుద్ధిగా పెట్టె లోకి దూరి పోవడమే అయింది ! కొంటె తనంతో నేస్తాలకి అబద్ధపు జోస్యాలు చెప్పి, అదరగొడుతూ ఉండే  చిలుక తల్లికి ఇప్పుడు నిజంగానే అబద్ధపు జోస్యం చెప్పే  దుస్థితి దాపురించింది !  అందుకది చింతిస్తూ ఉండేది. ఏమీ చేయ లేని అసహాయతతో అది కుమిలి పోతూ ఉండేది.
     ఇలా ఉండగా, ఒక రోజు అక్కడికి ఒక వీధి రౌడీ వచ్చేడు. వాడు లోగడ  అక్కడ చిలుక జోస్యం చెప్పించు కున్నాడు. ఆ జోస్యం ఏ మాత్రం నిజం కాలేదని వాడు కోపంతో ఊగి పోతూ అక్కడికి వచ్చేడు ! ఆగ్రహంతో నానా మాటలూ అంటూ వాడు చిలుక తల్లి ఉండే పెట్టెను కాలితో బలంగా ఒక్క తాపు తన్నేడు ! పెట్టెతో పాటూ దూరంగా ఎగిరి పడిన చిలుక తల్లికి వొళ్ళంతా బాగా గాయా లయ్యాయి.
    జోస్యం నెపంతో లోగడ అడవి లోని తోటి చిలుకలని తాను ఆటపట్టిస్తూ ఉండడం చిలుక తల్లికి గుర్తుకొచ్చింది. ఆ పాపమే ఇప్పుడు తనపాలిట శాపమయిందని అది ఎంతగానో విచారించింది !
    ఆపసోపాలు పడుతూ ఎలాగో తిరిగి అడవికి చేరుకుంది. అడవిలో చిలుకలన్నీ  దాని చుట్టూ చేరి జరగినదంతా అడిగి తెలుసు కున్నాయి.  చిలుక తల్లి ఏడుస్తూ జరిగినదంతా వివరించింది. అంతే కాదు, లోగడ తాను వాటితో   అబద్ధాలు కల్పించి చెప్పి , వాటిని వేళా కోళం చేసినందుకు పశ్చాత్తాప పడుతూ మన్నించమని వేడుకుంది.
 ‘‘అయ్యో ! అంతమాట లెందుకమ్మా ! మేము అవేవీ మనసులో ఉంచు కోములే !’’ అంటూ చిలుకలన్నీ అప్పటి నుండి చిలుక తల్లితో స్నేహంగా ఉంటూ గడపసాగేయి !
   ఇప్పుడు చిలకల పల్లి అడవిలో చిలుకల ఆటపాటల సందడి ఇంతా అంతా కాదు !
చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు తెలుసా !

2 వ్యాఖ్యలు:

నవజీవన్ చెప్పారు...

పాపం చిలుక తల్లి....ఇది అబద్దాల కోరైనా..కథ చివరిలో నాకెందుకో దాని మీద ఎంతో జాలి వేసింది.. ఇది మళ్ళీ తనవారిని చేరితే బాగుణ్ణు ..

పంతుల జోగారావ్ చెప్పారు...

మంచి మాట చెప్పారు నవ జీవన్ గారూ. కథ ముగింపు మార్చి రాసేను. చూడండి !