22, అక్టోబర్ 2014, బుధవారం

కొత్త మిత్రం కుందేలు !అనగా అనగా ఒక అడవిలో ఒక ఏనుగు, ఎలుగు బంటి, కోతి, గాడిద, ఎనుము, అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. అవి అలా స్నేహంగా ఉండడం ఒక జిత్తుల మారి నక్కకి నచ్చ లేదు. వాటి మధ్య ఏ తగాదాలూ లేకుండా హాయిగా ఉండడం చూసి ఆ తగవులమారి నక్క ఓర్చుకో లేక పోయింది ! అకారణ శతృత్వంతో వాటి నడుమ ఎలాగయినా చిచ్చు పెట్టి, వాటిని ఒకదాని కొకటి బద్ధ శత్రువులగా మారేలా చేయాలని అనుకుంది.
    ఒక రోజు ఏనుగు ఒంటరిగా ఉండడం చూసి ,అక్కడికి చేరి ఏనుగుతో ఇలా అంది : ‘‘  నీ  మిత్రులు నీ గురించి హేళనగా మాట్లాడు కుంటూ ఉంటే విన్నాను ! నువ్వు బలశాలివే కానీ , వొట్టి మంద మతివట ! నీకు తెలివితేటలు అనేవే
లేవుట ! వాళ్ళ వెటకారపు మాటలు విన లేక పోయాననుకో ! ’’అంది. దానితో ఏనుగుకి తన చిరకాల మిత్రుల మీద చెప్ప లేనంత కోపం వచ్చింది.  నక్క తరువాత ఎలుగు బంటి దగ్గరకు చేరి, ‘‘ నీ అంత అంద వికారి లోకంలోనే ఎవరూ లేరని నీ మిత్రులు  నీ వెనుక హేళన చేస్తున్నారు తెలుసా !నీ వొంటి నిండా అసహ్యంగా బొచ్చేనుట ! హవ్వ !నీ ఎదుట నిన్ను పొగుడుతూ, నీ వెనుక నిన్ను ఎంతలేసి మాట లంటున్నారో ! తలచు కుంటే కడుపు రగిలి పోతోంది ’’ అని చాడీలు చెప్పింది. దానితో లుగు బంటికి తక్కిన వాటి మీద అంతు లేని ఆగ్రహం కలిగింది. నక్క తన పాచిక పారి నందుకు లోలోన సంతోషిస్తూ తక్కిన వాటి దగ్గరకి కూడా వెళ్ళి ఇలాగే చాడీలు చెప్పి, వాటి మనసు విరిచేసింది. చపల చిత్తం కలదని కోతినీ, కర్ణ కఠోర మయిన గాత్రం కలదని గాడిదనీ, కారు నలుపూ, వికారపు శరీరం కలదని ఎనుమునూ ఎకసెక్కాలు ఆడుతున్నాయని  లవి ఒంటరిగా ఉన్నప్పుడు చాడీలు చెప్పింది. దానితో వాటికి ఒకదాని మీద ఒకదానికి చెప్ప లేనంత కోపం వచ్చింది. ఇలా వాటి మధ్య నిప్పును రాజేసి, అవి ఎలా తగవులాడుకుంటాయో చూద్దామని జిత్తుల మారి నక్క ఎదురు చూడసాగింది !
     ఇలా ఉండగా ఆ మిత్రులంతా ఒక రోజు ఒక చోట కలవడం తటస్థించింది. ఇంకేముంది ! వాటి మధ్య జగడం మొదలయింది. ఒక దాని నొకటి తీవ్రంగా దూషించు కోవడం మొదలెట్టాయి. ఇదంతా ఓ చెట్టు చాటు నుండి చూస్తూ నక్క సంబర పడుతోంది. రాను రాను వాటి మధ్య కలహం హెచ్చి, గాయాల పాలయ్యే పరిస్థితి వచ్చింది.
    ఇంతలో , ఎన్నాళ్ళనుండో వాటితో తను కూడా చెలిమి  చేయాలని అనుకుంటున్న ఒక కుందేలు అక్కడికి వచ్చింది. వాటి కలహం చూసి నివ్వెర పోయింది. చాలా బాధ పడింది. అతి కష్టం మీద వాటిని వారించింది,  వాటి కలహానికి కారణం అడిగి తెలుసు కుంది. తరువాత వాటితో లా అంది :
‘‘ చిరకాలంగా మీ అందరి స్నేహం చూసి ఎంతో ముచ్చట పడి,  నేను కూడా మీతో స్నేహం చెయ్యాలని వచ్చేను. తీరా, మీరేమో ఇలా కొట్టుకు ఛస్తున్నారు ! ఇదేం బాగు లేదు. ఇంత వరకూ మీరంతా ఒకరి లోపాలను ఒకరు ఎంచారని కదా తగవులాడు కుంన్నారు ?! ఇప్పుడు  మీ అందర లోపాలు తెలిసిన మరొక జంతువు ఉందని మీరు మరచి పోతున్నారు ! అది మీ లోపాలను అడివంతా చాటి చెప్పి, మీ పరువు తీయాలనుకుంటోంది. ఒకరికి తెలియకుండా మీలో మరొకరికి మీమీద చాడీలు చెప్పి, వినోదం చూస్తోంది ! అదిగో ! ఆ చెట్టు చాటున నక్కి
 ఉంది ! అది చెప్పినదే నిజమయితే ధైర్యంగా మీ ఎదుటికి వచ్చి చెప్పమనండి చూద్దాం !’’  అంది.
   దానితో కళ్ళు తెరచిన మిత్రులంతా ఒక్క సారిగా ఆ జిత్తుమారి నక్క మీదకి దాడి చేసి, దానిని అడవి నుండి దూరంగా తరిమి కొట్టాయి !
      ఆ రోజు నుండి కుందేలు వారికి కొత్త మిత్రమయింది !!

1 వ్యాఖ్య:

పంతుల సీతాపతి రావు చెప్పారు...

బాగుంది పిల్లలు నేర్చుకోవాలి