21, అక్టోబర్ 2014, మంగళవారం

తిండి పోతు వరదయ్య !


వెంకటాపురం అగ్రహారంలో వరదయ్య అనే వ్యక్తి ఒకడు ఉండే వాడు. వాడికి తాత తండ్రులు మిగిల్చి పోయిన ఆస్తి చెప్ప లేనంత ఉండేది. దాంతో ఏ పనీ చేయ కుండా సోమరిగా తిని కూర్చుంటూ ఉండే వాడు. వాడు గొప్ప భోజన ప్రియుడు ! ఆ భోజన ప్రియత్వం వాడిని క్రమేపీ తిండి పోతుగా మార్చేసింది! నిద్ర పోయేటప్పుడు తప్ప , మెళకువగా ఉండే సమయంలో దో తింటూ దవడ ఆడిస్తూ ఉండ వలసినదే ! అదీ ఇదీ అని కాదు. ఏది దొరికితే అది ఆబగా తినే వాడు. రుచీ పచీ లెక్కలోకి వచ్చేది కాదు. తిండి పదార్ధం దొరికితే చాలు, ఏదో నిథి దొరికి నట్టుగా సంబర పడి పోయే వాడు. డబ్బుకి కొదువ లేదు కనుక, వాడికి ఏ ఆహార పదార్థం కావాలన్నా చిటికెలో వచ్చి పడుతుడేవి.
    ఇలా అడ్డూ ఆపూ లేకుండా తింటూ ఉండడం వల్ల వాడికి అజీర్తి రోగం పట్టుకుంది ! అది కాస్త ముదిరి పోయి, ఒక్క మెతుకు నోట పెట్టు కున్నా అరిగేది కాదు. ఆ రోగంతో వాడు నానా అవస్థలూ పడ్డాడు. మునపటిలా సరైన తిండి లేక పోవడంతో విలవిలలాడి పోయేవాడు. చిక్కి శల్యమై పోయేడు. వాడికి దు:ఖం ఆగేది కాదు. తిండి తిన లేక పోతున్నానన్న విచారంతో వాడు కుమిలి పోయే వాడు. ఇక ఆ అజీర్తి బాధనీ, విపరీత మయిన కడుపు నొప్పినీ  భరించ లేక  ఒక రోజు ఆత్మ హత్య  చేసు కోవాలని అనుకుని  అడవి లోకి బయలు దేరాడు.
       అలా అడవిలో చాలా దూరం నడిచేక వాడికి తపస్సు చేసుకుంటూ ఒక ముని కనిపించేడు. వరదయ్య చేతులు జోడించి, తన బాధ ముని చెప్పు కోడానికి సిద్ధ పడ్డాడు. ముని కళ్ళు తెరచి, ‘‘ ఏం కావాలి నాయనా ! ’’ అనడిగేడు దయతో.
ముని అలా అడిగే సరికి వరదయ్య తన అజీర్తి రోగాన్నీ, కడుపు నొప్పినీ మరచి పోయి, ‘‘ స్వామీ ! నాకు నిత్యం పంచ భక్ష్య పరమాన్నాలు దొరికేలా  వరం అనుగ్రహించండి !’’ అని వేడు కున్నాడు. ముని సరే అని వరదయ్యని దీవించేడు.  వరదయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆత్మ హత్యా ప్రయత్నం మానుకుని ఇంటికి వెళ్ళి పోయేడు.
     ఇంట్లో అడుగు పెడుతూనే వాడికి తన ఇంట్లో లెక్క లేనన్ని పాత్రలలో మంచి మంచి భోజన పదార్ధాలు కనబడ్డాయి ! వాడి ఆశ్చర్యానికీ, సంతోషానికీ లెక్క లేకుండా పోయింది! కాస్సేపటికి ఆశ్చర్యం నుండి తేరుకుని వాటిని ఆబగా తిన బోయాడు . అప్పుడు చప్పున వాడికి తన అజీర్తి రోగం, కడుపు నొప్పి గుర్తు కొచ్చింది! ఒక్క ముద్ద నోట పెట్ట లేక పోయాడు. కడుపు నొప్పితో మెలి తిరిగి పోతూ మంచాన పడ్డాడు. కళ్ళెదుట అంత రుచి కరమయిన తిండి చెప్ప లేనంత కనబడుతున్నా, తిన లేని తన అవస్థకి వాడికి ఏడుపు ఆగింది కాదు.
     తిండీ తిప్పలూ లేక ఆ రాత్రి చాలా సేపటికి కానీ వాడికి నిద్ర పట్ట లేదు. కునుకు పట్టేక, కలలో ఆ ముని కనబడి వరదయ్యతో ఇలా చెప్పాడు :
 ‘‘ నాయనా ! నీ పరిస్థితి చూస్తూ ఉంటే జాలి కలుగుతోంది. ఏ పనీ చేయకుండా తింటూ కూచోడం మంచిది కాదు. అలాగే ఎవరికీ పెట్ట కుండా ఒక్కడివే తినడం కూడా తగదు. మితాహారం తీసు కుంటూ, దాన ధర్మాలు చేస్తూ, చక్కగా పని పాటలు  చేసుకుంటూ ఉండే నీ  ఆరోగ్యం కుదుట పడుతుంది !’’ అని హితవు చెప్పాడు.
    అప్పటి నుండి వరదయ్య లో చాలా మార్పు వచ్చింది. మితంగా తినడం, సోమరి తనం విడిచి పెట్టి పని చేయడం, ఇతరులకు సాయ పడుతూ దానధర్మాలు చేయడం అలవాటు చేసు కున్నాడు. దానితో వాడి అజీర్తి రోగం, కడుపు నొప్పీ తగ్గి పోయాయి. వాడి ఆరోగ్యం కుదుట పడింది.

   అంతే కాదు, ఇప్పుడు వాడికున్న ‘‘ తిండి పోతు వరదయ్య’’ అనే చెడ్డ పేరు కూడా తొలగి పోయింది !

1 వ్యాఖ్య:

anu చెప్పారు...

బాగుందండీ.. మీ చిట్టి కథ