2, అక్టోబర్ 2014, గురువారం

ఊడల మఱ్ఱి ... బ్రహ్మ రాక్షసి !


ఉజ్జయనికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది. అది కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో ఒక పెద్ద ఊడల మఱ్ఱి ఉండేది.  ఆ అడవి దారంట ప్రక్క ఊళ్ళకి వెళ్ళే బాట సారులు దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. దాని మీద చాలా అల్లరి దెయ్యాలు ఉన్నాయనీ, అవి పాదచారులను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయనీ చెప్పుకునే వారు. అందు చేత, ఎంతో అవసరం పడితే తప్ప, ఆ దారంట చీకటి పడితే ఎవరూ వెళ్ళడానికి సాహసించే వారు కారు ! ఆ అల్లరి దెయ్యాలకు తోడు ఈ మధ్య ఒక బ్రహ్మ రాక్షసి కూడా అక్కడికి వచ్చి చేరిందని , అది అందరినీ పీక్కు తింటోందని  వొక వార్త గుప్పుమంది. బ్రహ్మ రాక్షసి రాకతో అల్లరి  దాదాపు చాలా వరకూ దెయ్యాలన్నీ ఊడల మఱ్ఱి చెట్టు వదలి ఎక్కడికో పారి పోయేయి. వాటి పీడ వదలినా, బ్రహ్మరాక్షసి భయం పట్టుకుంది బాటసారులకు.
    ఇలా ఉండగా, ఒక రోజు నందుడు అనే వాడు జరూరుగా దూర ప్రాంతానికి వెళ్ళ వలసి వచ్చింది. అప్పటికే సాయంత్రమయింది. పొద్దు గూకుతోంది. అన్నం మూట కట్టుకుని, ప్రాణాలు ఉగ్గబట్టుకుని, నందుడు ఆ ఊడల మఱ్ఱి చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చే సరికి, చీకటి చిక్కబడింది. భయంతో నందుడి ఒళ్ళు జలదరించుకు పోతోంది. ఇంతలో ఊడల మఱ్ఱి తొర్ర లోనుండి వొక వికటాట్టహాసం వినిపించింది ! నందుడికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. కొయ్యబారి పోయి నిలబడి పోయేడు.
    వాడు వణికి పోతూ ఉండడం చూసి బ్రహ్మ రాక్షసి గర్వంగా నవ్వుకుంది.  వాడితో లా అంది : ‘‘ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం !  సరే, ఇందాకే రెండు బర్రెలనూ, రెండు ఎనుములనూ తిన్నాను. నాకిప్పుడు అంతగా ఆకలిగా లేదు. అయినా, వాటంగా దొరికిన నర మాంసాన్ని వదులు కోలేను ! నిన్ను తరువాత తింటాను. నేనిక్కడ  కొద్ది కాలంగా ఉంటున్నాను. ఈ ఊడల మఱ్ఱి నన్ను పట్టుకుని వదలడం లేదు. నాకు ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం విసుగ్గా ఉంది !ఎక్కడికియినా కొత్త చోట్లకు వెళ్ళాని ఉంది. కొత్త రుచులను చవి చూడాలని ఉంది. కానీ, ఈ ఊడల మఱ్ఱి నన్ను వదలదే ! తనకి ఎన్ని ఊడలు ఉన్నాయో సరిగ్గా లెక్క కట్టి చెబితేనే నన్ను ఇక్కడ నుండి కదల నిస్తానంటోంది. నాకు ఎన్ని శక్తులు ఉన్నా, దీని ముందు ఎంచేతో పనికి రావడం లేదు. నాకా,  సరిగా లెక్కలు రావు ! దీని ఊడలు లెక్క పెట్టాలని చాలా సార్లు ప్రయత్నించాను, కానీ కుదర లేదు. లెక్క తప్పుతోంది.  అందు చేత , దీనికి ఎన్ని ఊడలు ఉన్నాయో నువ్వు సరిగ్గా లెక్క కట్టి చెబితే నిన్ను వదిలేస్తాను. లేక పోతే తినేస్తాను జాగ్రత్త ! ’’ అంది.
బ్రహ్మరాక్షసి  పీడ వదిలించుకుని ,తప్పించుకునే మార్గం దొరికి నందుకు నందుడు లోలోన సంతోషించేడు.
   వెంటనే బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు : ‘‘దీనికి ఊడలు అసంఖ్యకంగా ఉన్నట్టున్నాయి. అన్నింటినీ లెక్క పెట్టడానికి చాలా సమయం తీసుకునేలా ఉంది.  అదీ కాక, దీని ఊడలు చాలా దూరం వరకూ వ్యాపించి ఉన్నాయి. వాటి మొదళ్ళు వెతుక్కుంటూ కాలి నడకన వెళ్ళాలంటే నా శక్తి చాలదు !  నీరసంతో కుప్పకూలి పోతాను. అదే ఆలోచిస్తున్నాను ... ’’ అన్నాడు.
  ‘‘ అంతే కదా ! ’’ అంటూ బ్రహ్మ రాక్షసి నందుడికి సునాయాసంగా గాలిలో ఎగురుకుంటూ వెళ్ళ గలిగే శక్తిని ఇచ్చే ఒక మంత్ర దండం ఇచ్చింది.
   నందుడు ఆ మంత్ర దండం అందుకుని బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు :
‘‘ ఈ ఊడల మఱ్ఱికి ఎన్ని ఊడలు ఉన్నాయో లెక్క కట్టి పూర్తి చేసుకుని కానీ నీ దగ్గరకి రాను.  నేను తిరిగి వచ్చే వరకూ నువ్వు చాలా నిష్ఠగా ఉడాలి సుమా ! లేక పోతే నా లెక్క తప్పుతుంది.  అంచేత,నువ్వు నేను తిరిగి వచ్చే వరకూ జంతు వథ చేయ కూడదు ! నర మాంసం తిన కూడదు! అంతే కాదు, కేవలం ఆకులూ అలమలూ మాత్రమే తింటూ చాలా నియమంగా ఉండాలి. ఈ నియమాన్ని నువ్వు తప్పేవో, నా లెక్క మళ్ళీ మొదటికే వస్తుంది. జాగ్రత్త ! ’’ అని హెచ్చరించి, బ్రహ్మ రాక్షసి  ఇచ్చిన మంత్ర దండం తల మీద పెట్టు కున్నాడు. దాని మహిమ వల్ల క్షణంలో అక్కడి నుండి మయమై, తను వెళ్ళ వలసిన ఊరికి చేరు కున్నాడు !
ఆ తరువాత మరింక  నందుడు ఆ దారంట రానే లేదు ! తన పని పూర్తయేక, చుట్టు దార్లమ్మట  తన ఊరికి చేరు కున్నాడు.
    బ్రహ్మ రాక్షసి మాత్రం నందుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ , మాంసాహారం మానేసి ఆకులూ అలమలూ తింటూ రోజు రోజుకీ కృశించి పోసాగింది.
     చివరకు అది హారం లేక, చాలా బలహీన పడి పోయింది !
      ఇప్పుడా ఊడల మఱ్ఱి ప్రక్క నుండి వెళ్ళే బాటసారులకి దాని వలన ఏ హానీ లేదు !
        పైగా, వారిలో కొందరు కొంటె కుర్రాళ్ళు ఆట సట్టిస్తూ దానిని అప్పుడప్పుడు ఏడిపిస్తున్నారు కూడా !