5, అక్టోబర్ 2014, ఆదివారం

ఏది శాశ్వతం ? !గోవింద పురాన్ని పాలించిన విక్రమ వర్మ కొలువులో ఇద్దరు మహా కవిపండితులు ఉండే వారు. మార్తాండ వర్మ, అహోబిల శాస్త్రి అనేవి వాళ్ళ పేర్లు. దాయాదులయిన వాళ్ళిద్దరూ పాండిత్యం లోనూ, కవిత్వం చెప్పడంలోనూ దిట్టలు. ఆ రోజులలో వారిని మించిన కవులూ, పండితులూ ఆ రాజ్యం లోనే కాదు, చుట్టు ప్రక్కల ఎక్కడా ఉండే వారు కాదు ! అందు చేత రాజు వారిద్దరికీ మంచి మంచి బిరుదులు ఇవ్వడమే కాక, గొప్ప సత్కారాలు కూడా జరిసిస్తూ ఉండే వాడు.   అయితే, అంతటి రాజాదరణ, ప్రజాదరణా ఉన్నప్పటికీ,  వారి మధ్య కొద్ది కాలంగా మనస్పర్ధలు బయలు దేరాయి. ఇద్దరూ ఒకరి నొకరు దేనికో ఒకదానికి ద్వేషించు కుంటూ ఉండే వారు. దానికి తోడు దాయాదులైన వారి మధ్య ఏవో భూ తగాదాలు కూడా ఉండడంతో  ఆ తగవులు మరింత ఎక్కువయ్యేయి ! ఇద్దరి నడుమ పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే స్థితి వచ్చింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవనే సామెత ఉంది కదా ! విక్రమ వర్మ కొలువు నుండి ఒకరి నొకరు బయటికి గెంటించెయ్యాలని రుట్రలు పన్న సాగేరు ! ఎలాగయినా  రెండో వారికి ప్రభువు చేత దేవిడీమన్నా చెప్పించాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ నోటా , ఈ నోటా వారి మధ్య రగులు కొంటున్న వైరం గురించి రాజుకి కూడా తెలిసింది.  తన రాజ్యానికే గర్వ కారణ మయిన ఆ ఇద్దరు కవులలో ఏ ఒక్కరినీ వదులు కోవడం వికమ వర్మకి సుతరాము ఇష్టం లేదు. బాగా ఆలోచించాడు.
   ఒక రోజు కొలువు తీర్చి,  సభలో అందరి ముందూ ఆ ఇద్దరు కవులతో ఇలా అన్నాడు : ‘‘మీ మధ్య కొద్ది కాలంగా నెకొన్న తగాదాల గురించి మా
 దృష్టికి వచ్చింది. ఇక మీలో ఒకరికే నా కొలువులో స్థానం ఉంటుంది. రెండో కవి రాజ్యం విడిచి వెళ్ళి పోవలసినదే ! అందు చేత మీ ఇద్దరిలో ఎవరిని మా కొలువులో ఉంచాలో నిర్ణయించడానికి మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. మీ ఇద్దరికీ చెరొక తాళ పత్రం  ఇస్తున్నాను. వాటి మీద వ్రాసి ఉన్న పద్యాలను చదివి , గుణ దోషాలను ఎవరయితే చక్కగా విశ్లేషిస్తారో వారే ఇక మీదట మా కొలువులో ఉండానికి అర్హులు .అలా చెప్ప లేని కవికి దేవిడీమన్నా తప్పదు ! ’’ అన్నాడు.. అంటూ ఆ కవులిద్దరికీ వేరు వేరుగా చెరొక తాళపత్ర మూ ఇచ్చాడు.
      ముందుగా మార్తాండ వర్మ న అభిప్రయం ఇలా చెప్పాడు : ‘‘ మహా రాజా ! ఇది చాలా గొప్ప పద్యం ! ఇంత రసవంతమయిన పద్యం నేనింత వరకూ చదవ లేదు ! నేను కూడా ఇంత గొప్ప పద్యం వ్రాయలేననిపిస్తోంది ! కావ్య జగత్తులో ఈ పద్యం శాశ్వతంగా నిలిచి పోతుంది !’’ నఅన్నాడు.
    అతని మాటలు వింటూనే అహోబిల శాస్త్రి ముఖం వెలిగి పోయింది !
 ఆ తర్వాత తన వంతు వచ్చి నప్పుడు అహోడిల శాస్త్రి తనకిచ్చిన పద్యాన్ని నోరారా పొగిడాడు. దాని గొప్పతనాన్ని ఎంతగానో మనసారా కీర్తించాడు.
   అప్పుడు రాజు ఇద్దరు కవులతో ఇలా అన్నాడు : ‘‘ ఈ రెండు పద్యాలూ నిజానికి ఈ మధ్య మీరు వ్రాసిన గ్రంథాల లోనివే ! ఒకరు వ్రాసిన పద్యం ఇంకొకరికిచ్చాను ! మీలో మీకు తగవులు ఉండడం చేత, ఒకరి పద్యాల గురించి వేరొకరికి తెలియదు!
శాశ్వతమయిన కవిత్వం విషయంలో,  తెలియక పోయినా , ఒకరి ఘనతను ఒకరు నిండు మనసుతో శ్లాఘించేరు. అశాశ్వతాలయిన సంపదల గురించి, తక్కిన వాటి గురించి కలహించు కోవడం మీకు తగునా ! ఆలోచించండి !’’ అన్నాడు.
   రాజు మాటలతో కవులిద్దరికీ కను విప్పు కలిగింది.  అప్పటి నుండి వైరం విడిచి,ఎంతో సఖ్యంగా మెలగ సాగేరు.
   అంతే కాదు, అపూర్వమైన కావ్యాలు ఎన్నో వ్రాసి  రాజు మన్ననలు పొందారు !


2 వ్యాఖ్యలు:

Padmarpita చెప్పారు...

చిట్టి కధ బాగుంది

Pantula Jogarao చెప్పారు...

ధన్యవాదాలండీ