30, సెప్టెంబర్ 2014, మంగళవారం

విలువైన విద్య !


మైత్రేయ పురంలో గోపాలుడనే వాడు ఉండే వాడు.  వాడు ఏ పనీ చేయకుండా వ్యర్ధంగా కాలం గడిపే వాడు. తండ్రి సంపాదనతో ఇల్లు గడిచి పోతూ ఉండడంతో జులాయిగా తిరుగుతూ కాలక్షేపం చెయ్యడం అలవాటయింది. ఏదో పని చేసి ఎంతో కొంత తెమ్మని భార్య రోజూ పోరు పెడుతూ ఉండేది. వాడు వినిపించు కునే వాడు కాదు. చెప్పి చెప్పీ ఆమె విసిగి పోయింది.
      ఇలా ఉండగా జబ్బు చేసి, వాడి తండ్రి హఠాత్తుగా చని పోవడంతో ఇంటి బాధ్యత అంతా వాడి మీద పడింది. ఒక్క సారిగా వచ్చి మీద పడిన బాధ్యతలతో వాడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ! అప్పుడు కూడా ఏపనీ చేయడానికి ఇష్ట పడకుండా, తండ్రి సంపాదించిన దంతా ఖర్చు పెడుతూ కాలం గడిపే వాడు.
            కూర్చుని తింటే, కొండలయినా కరిగి పోతాయి కదా !
             తండ్రి సంపాదించినదంతా  ఖర్చయి పోవడంతో వాడికి మరింక రోజులు గడవడం కష్టమై పోయింది. ఏం చేయాలో తెలియక దిగులు పట్టుకుంది. ఇప్పటికయినా  ఏదో పని చేయమని భార్య అంటే ఆమెని కసురు కునే వాడు.
       ఇలా ఉండగా ఆ ఊరికి హిమాలయాల నుండి ఒక సాధువు వచ్చేడు. ఆ సాధువుకి రస వాద విద్య తెలుసుననీ, అతను ఇత్తడిని బంగారం చెయ్య గలడని ఎవరో గోపాలుడితో చెప్పారు.  గోపాలుడు సాధువు దగ్గరకి వెళ్ళాడు. ఆ సాధువుతో తన ఇంటి పరిస్థితి వివరించి చెప్పాడు. ఇంటి నుండి తెచ్చుకున్న ఒక చిన్న ఇత్తడి ముక్క నొక దానిని సాధువు చేతిలో పెట్టి, దానిని బంగారంగా చేయమని వేడు కున్నాడు.
   సాధువు కొద్ది క్షణాలు ఆలోచించి, గోపాలుడితో ఇలా అన్నాడు :  ‘‘నాయనా ! నువ్వు తెచ్చిన ఈ చిన్న ఇత్తడి ముక్కను బంగారంగా చేసి ఇవ్వడం నాకేం కష్టం కాదు ! నాకా విద్య తెలుసును ! కానయితే,  కక్కుర్తి సడ్డా, కడుపు నిండా లంటారు కదా ! అందు చేత నువ్వు వీలయినంత ఎక్కువ ఇత్తడిని సేకరించుకుని నా దగ్గరకి మళ్ళీ రా ! నేను హరి ద్వారం వెళ్ళి,  వారం రోజులలో మీ ఊరికి తిరిగి వస్తాను.  అప్పటికి నువ్వు ఎంత ఎక్కువ ఇత్తడి తెచ్చుకుంటే దానినంతా బంగారంగా చేసి నీకిస్తాను. నీ దరిద్రం తీరి పోతుంది ! ’’ అన్నాడు. సాధువు సాధువు మాటలకి చాలా సంతోషించి, లెక్క లేనంత ఇత్తడిని సంపాదించాలనుకుంటూ ఇంటికి చేరాడు గోపాలుడు.
        ఇక, ఆ రోజు నుండి గోపాలుడు ఇత్తడిని సమకూర్చు కునే పనిలో పడ్డాడు. ఊళ్ళోనే కాక, చుట్టు ప్రక్కల ఊళ్ళకు కూడా వెళ్ళి, ఎవరెవరి దగ్గర పాత ఇత్తడి సామాన్లు ఉన్నా, ఏవో మాటలు చెప్పి, వారు అడిగినంత ముట్ట చెప్పి , కొని ఇంటికి తెచ్చు కునే వాడు.ఇత్తడిని కొనడం కోసం డబ్బు కావాలి కనుక,  రాత్రీ పగలూ ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాడు. వాడికిప్పుడు క్షణం తీరిక ఉండడం లేదు. త్వరలోనే వాడి వ్యాపారాలు పుంజుకుని గొప్ప ధనవంతు డయ్యాడు. ఇత్తడికి గిరాకీ పెరగడంతో ఇత్తడి వ్యాపారం కూడా వాడికి బాగా కలసి వచ్చింది. ఇప్పుడు ఊర్లో ఉన్న వ్యాపారవేత్తలలో వాడికి చాలా పేరు వచ్చింది.
ఈ వ్యాపారాలలోనూ, సంపాదనలోనూ పడి,  గోపాలుడు సాధువు గురించి మరిచే పోయేడు !
    చాలా రోజుల తరువాత ఆ సాధువు ఆ  ఊరికి వచ్చి, స్వయంగా గోపాలుడి ఒంటికి అతిథిగా వచ్చేడు. గోపాలుడు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి, గోపాలుడితో ఇలా అన్నాడు : ‘‘నాయనా ! ఎంత ఇత్తడిని సంపాదించావో చెప్పు !
నేను రావడం కొంత ఆలస్యం అయింది. అయితే ఈ లోగా నువ్వు చాలా ఇత్తడిని పోగు చేసి ఉంటావు. దానినంతటినీ ఇలా తెచ్చివ్వు. బంగారంగా మార్చి
ఇస్తాను !’’ అన్నాడు.
   దానికి గోపాలుడు ‘‘ స్వామీ ఇత్తడిని పుత్తడిగా చేసే రసవాద విద్య మీకు తెలుసు. ఆ విద్యతో నేను ఎంత ఇత్తడి ఇచ్చినా బంగారంగా మార్చెయ్య గలరు. కానీ , నాకిప్పుడు అలా వచ్చే ధనంతో పని లేదు. శ్రమ చేసి సాందించు కునే గొప్ప విద్య నాకు ఇప్పుడు అలవడింది! నాకది చాలు ! ’’ అన్నాడు తృప్తిగా.
   ‘‘ నేను నీ నుండి కోరుకున్నదీ అదే నాయనా !’’  నవ్వుతూ అని సాధువు గోపాలుడిని దీవించి వెళ్ళి పోయేడు !

కామెంట్‌లు లేవు: