22, సెప్టెంబర్ 2014, సోమవారం

పొగడ్త ఫలితం !


పూర్వం విక్రమ పురం అనే ఊళ్ళో గంగులు అనే గజ దొంగ ఒకడు ఉండే వాడు. వాడి చేతి లాఘవం అంతా యింతా కాదు ! బెంగా బెతుకూ లేదు. మంచీ చెడ్డా తెలియదు. ఎంతటి దొంగ తనమయినా అవలీలగా చేసే వాడు.చాలా బలవంతుడు. వాడి నోరు చెడ్డది. వాడంటే అందరికీ హడల్ ! గ్రామాధికారి ఒక సరి వాడిని పట్టించి కారాగారానికి పంపంచినా, వాడిలో మార్పు రాలేదు. మరింత పెట్రేగి పోయి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.
     ఇలా ఉండగా ఒక రోజు గంగులు తమ ఊరిలో ఉండే దేవాలయం నుండి దేవతా విగ్రహాలు దొంగిలించాడు. వాటిని ఊరి వెలుపల  ఒక పాడు పడిన నూతిలో దాచి పెట్టాడు.
   మర్నాడు గుడిలో విగ్రహాలు కనబడక భక్తులు గగ్గోలు పెట్టారు. అదిగంగులు పనే అని అందరికీ అర్ధ మయి పోయింది. కానీ వాడిని అడగడానికి ఎవరికీ ధైర్యం చాల లేదు. ఊరి వెలుపల బావిలో విగ్రహాలు గంగులు దాచేడని  వారికి ఆచూకీ తెలిసింది. కానీ గంగులు ఎప్పుడూ ఆ బావి దగ్గరే తచ్చాడుతూ ఉండడంతో వాటిని తెచ్చే సాహసం వాళ్ళు చేయ లేక పోయేరు. అలాగని విగ్రహాలు వాడి పరం చేసి ఉండడం కూడా వారికి కష్టంగానే ఉంది.
    చివరకి వర ప్రసాదం అనే ఒక యువకుడు ఒక ఉపాయం ఆలోచించేడు. దానిని ఊళ్ళో భక్తులందరికీ వివరించి ఏం చేయాలో చెప్పాడు.  అతని మాట ప్రకారం భక్తులు ఎప్పటి లాగే గుడికి వచ్చి, అక్కడ విగ్రహాలు లేక పోయినా, అవి లోగడ ఉండే ఖాళీ స్థలం లోనే పూజలు చేయడం మొదలు పెట్టారు !
   ఇదంతా గమనిస్తున్న గంగులికి మతి పోయింది ! విగ్రహాలు లేని గుడిలో భక్తులు ఎందుకు పూజలు చేస్తున్నారో తెలుసు కోవాలనుకున్నాడు. తనంటే అందరూ భయ పడతారు కనుక అలా ఎందుకు చేస్తున్నారో చెప్పమని వారిని నిలదీసాడు.
   అప్పుడు వరప్రసాదు వినయంగా చేతులు కట్టుకుని ఇలా చెప్పాడు :  ‘‘మన తాతల కాలం నాడు ఈ స్వామి, దేవేరులతో పాటు మన ఊరి వెలుపల బావిలో దొరికాడు. ఆ బావి శ్రీవారి పుట్టిల్లు అన్న మాట ! అయితే మనం బావి లోని విగ్రహాలను గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నాం.  స్వామికి ఒక సారి తన పుట్టిన చోటుకి వెళ్ళి రావాలని బుద్ధి పుట్టిందిట. ఒక మహా భక్తుని సాయంతో అక్కడికి వెళ్ళి కొద్ది రోజులలోనే గుడికి తిరిగి వస్తానని స్వామి పూజారి వారికి కలలోకనబడి చెప్పారుట.  ఆ మహా భక్తుడెవరో కానీ, అతడే స్వామిని తిరిగి ఇక్కడకి చేరుస్తాడు. అందుచేత, ఎప్పటికయినా ఆ మహా భక్తుడే విగ్రహాలను బావి నుండి ఇక్కడకి తెస్తాడని నమ్మకంతో ఉన్నాం. అంత వరకూ ఆటంకం లేకుండా స్వామికి ఈ ఖాళీ జాగాలోనే నిత్య పూజలు చేస్తున్నాం, ’’

   ఆ యువకుని మాటలు విన్నాక, గంగులికి నిజంగానే తానొక మహా భక్తుడిననే భావన కలిగింది. పులకించి పోయేడు. ఆ రాత్రి ఎవరూ చూడకుండా  దేవతా విగ్రహాలను భక్తితో బావి నుండి వెలికి తీసి,  తిరిగి గుడిలో పెట్టి వెళ్ళి పోయేడు !
   అప్పటి నుండి గుడిలో పూజాదికాలు యథావిధిగా జరుగుతున్నాయి !
   గంగులులో కూడా మంచి మార్పు వచ్చి, భక్తుడిగా మారేడు.
    ఊరంతా సంతోషించింది !!