19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దుర్బుద్ధి


ఒక అడవిలో జంబుమాలి అని ఒక నక్క ఉండేది.అది చాలా జిత్తులమారి నక్క! అంతే కాదు, గొప్ప స్వార్ధపరురాలు కూడా. రోజూ ఉదయాన్నే లేచి, దేవుడిని ఇలా వేడుకునేది :  ‘‘ దేవా ! ఈ అడవిలో అంతా నన్ను నీచంగా చూస్తూ ఉంటారు. నేను టక్కరి దానినట. జిత్తులమారినట.. అందు చేత ఇవాళ ఈ అడవి జంతులు వేటికీ తిండి దొరక కుండా చెయ్యి. అంతే కాదు, నాకు మాత్రం కడుపు నిండి పోయేటంత  మంచి తిండి దొరికేలా చూడు ! అలా చెయ్యి తండ్రీ ! ఈ అడవిలో నేను తప్ప మిగతావి ఏవీ సుఖంగా ఉండ కూడదు ! వాటి పొగరు అణిగి
 పోవాలి ! ’’ అని వేడుకునేది.
     ఒక రోజు నిద్ర లేస్తూనే ఎప్పటిలాగే దేవుడిని వేడుకుని, తిండి కోసం బయలు దేరింది జంబుమాలి. అలా వెళ్ళగా వెళ్ళగా దానికి ఒక చోట అప్పుడే చచ్చి పడున్న ఒక పెద్ద ఏనుగు కళేబరం కనబడింది. నక్క ఆనందానికి అంతూ పొంతూ లేకుండా పోయింది. చుట్టూ చూసింది. ఇంకా ఎవరూ ఆ ఆహారాన్ని చూసినట్టుగా లేదు. ఏమి నా అదృష్టం ! ’  సంతోషంగా  అనుకుంది నక్క. ‘‘ దేవుడా ! ఈ రోజు నాకు కడుపు నిండా తిండి దొరికేలా చేసావు. నీకు నిజమైన నీ భక్తు లెవరో ఇప్పటికి తెలిసింది కదా ! ’’  అని దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకుంది.
       ‘‘ ఇన్నాళ్ళకు దేవుడు నా మొర ఆలకించాడు. నాకు పుష్కలంగాతిండి దొరికేలా చేసాడు. అలాగే, నేను కోరినట్టుగా  తక్కిన అడవి జంతువులు వేటికీ ఇవాళ తిండి దొరక్కుండా చేసాడో , లేదో , చూడాలి. అడివంతా తిరిగి ముందు
ఆ విషయం తెలుసుకుంటాను. తిండి దేముంది! ఇలా వెళ్ళిఅలా వచ్చెయ్యనూ! వచ్చేక, కడుపు పగిలేలా  తినొచ్చు ! ’’  అనుకుంటూ తనకు దొరికిన ఆ ఏనుగు కళేబరాన్ని ఎవరి కంటా పడకుండా ఉండేలా ఒక చోట దాచి, ఆకులూ అలమలూ కప్పి జాగ్రత్త చేసింది.
   తర్వాత అక్కడ నుండి బయలు దేరి, కనబడిన ప్రతి జంతువునూ ‘‘ నీకివాళ తిండి దొరికిందా ? ’’ అని అడగడం మొదలు పెట్టింది.  ముందుగా పులి కనబడితే ‘‘ పులి రాజా ! భోజన మయిందా ? ’’ అనడిగింది. దానికి పులి ఉసూరుమంటూ ‘‘నేను ముసిలిదానినైపోయాను. మునుపటిలా వేటాడే ఓపిక ఉండడం లేదు. వాళ తినడానికి ఏమీ దొరక లేదు. ఆకలితో నా కడుపు కాలి పోతోంది ’’ అంది దీనంగా.
నక్క పైకి ‘‘ అయ్యో, పాపం ! ’’ అంటూ జాలి నటించింది.  లోలోపల సంతోషపడుతూ అక్కడి నుండి బయలు దేరింది. తర్వాత అడివంతా చాలా దూరం చక్కబెట్టింది. ఏ జంతువుని అడిగినా తిండి దొక లేదనే చెప్పడంతో నక్క ఆనందం అంతా యింతా కాదు !  మంచి శాస్తి జరిగింది ! అని  సంబర పడి పోయింది. పైకి మాత్రం వాటి పట్ల సానుభూతి చూపిస్తూ మాటలాడేది.
    ఆ రోజు నక్కకి అడివంతా ఎంత తిరిగినా  తృప్తి కలగడం లేదు. ఒళ్ళూ మీదా తెలియడం లేదు. ఇదిగో , అదిగో మరో దాన్ని అడిగి చూదాం ! అనుకుంటూనే అడివంతా  తిరుగుతూనే ఉంది. ఏ జంతువూ తనకు తిండి దొరికిందని చెప్పక పోవడంతో దాని ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
     అలా తిరుగుతూ ఉండగానే చీకటి పడి పోయింది. కుండ పోతగా వర్షం మొదలయింది. పిడుగులూ, టఉరుములతో నానా బీభత్సంగా తయారయింది. చుట్టూ చీకటి కమ్ము కోవడంతో నక్క ఒక్క అడుగు తీసి ముందుకు వెళ్ళ లేక పోయింది. ఆ జడి వానకి అడవిలో  చెట్లన్నీ విరిగిపడి ,దారీ తెన్నూ కనిపించేలా లేదు.  భయంతో ఒక చెట్టు తొర్రలోకి దూరి, చలికి వణికి పోతూ బిక్కు బిక్కుమంటూ గడిపింది. వాన ఎంతకీ తగ్గ లేదు.
   అప్పుడు దానికి తన ఆకలి గుర్తుకొచ్చింది. ఆకలితో కడుపు దహించుకు పోసాగింది. దానికి తోడు, అడవి జంతవులు తిండి దొరక లేదని తనతో అబద్ధం కానీ చెప్ప లేదు కదా ! అనే అనుమానం దానికి అప్పుడు  కలిగింది. ఉదయం నుండీ తిండి మాట ఎత్తకుండా తిరిగి తిరిగి అలిసి పోయాను ! చలికి వణికి పోతున్నాను. తిండి లేక నీరసంతో అడుగు కదప లేక పోతున్నాను. ఆకలి మండి పోతోంది. అడవి జంతువలన్నీ ఈ సరికి దొరికిందేదో తిని వెచ్చగా పడుకున్నాయి కాబోలు ! అనుకుంది.
     ఈ ఆలోచన దానిని ఆకలి బాధ కంటె ఎక్కువగా బాధించింది.
      ఆకలి బాధతో ఏడుస్తూ అది సొమ్మసిల్లి పడి పోయింది.
      దుర్బుద్ధికి ఫలితం ఇలాగే ఉంటుంది కదా !!