17, సెప్టెంబర్ 2014, బుధవారం

నోటికి తాళం !


అనగా అనగా ఒక ఊళ్ళో సోమయ్య అనే ఒక ఆకతాయి ఉండే వాడు. పెద్దంతరం,చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వారిని ఎంత మాట తోస్తే అంత మాట అనెయ్యడం వాడికి అలవాటు ! ఎవరెంత నచ్చ చెప్పినా వినిపించు కునే వాడు కాదు. వాడి  నోటికి జడిసి ఊళ్ళో అంతా వాడికి దూరంగా మెలగ సాగేరు.
    ఇలా ఉండగా ఒక నాడు ఆ ఊరికి గొప్ప యతీంద్రుల వారు ఒకరువచ్చేరు. అతనికి గొప్ప మహిమలు ఉన్నాయని అందరూ పొగుడుతూ ఉండే వారు. ఆ సంగతి సోమయ్య చెవిని కూడా పడింది. సోమయ్య  ఆ యతీంద్రుని గురించి చాలా విన్నాడు.  జరిగిందీ, జరుగ బోయేదీ కూడా  ఒక్క పిసరు పొల్లు పోకుండా చెప్ప గలరని విన్నాడు. అంతే కాకుండా వారిని దర్శించు కుంటే  గొప్ప మేలు జరుగుతుందని కూడా విన్నాడు.  సోమయ్యకి కూడా  ఆ యతీంద్రుల వారిని దర్శించు కోవాలని బుద్ధి పుట్టింది.  అలా అనుకుంటూనే  ఏ రోజుకారోజు బద్ధకించి, రోజులు గడిపేసాడు. వాడికి బుద్ధి పుట్టి,  ఓ రోజు సాయంత్రం వెళ్ళే సరికి
 ఆ యతీంద్రుల వారు  ఆ ఉదయమే ఊరు విడిచి  వెళ్ళి పోయేరు !
    సోమయ్యకి చెప్ప లేనంత నిరాశ కలిగింది. ఉక్రోశం వచ్చింది. ఊరిలో దాదాపు అందరూ వారిని అప్పటికే దర్శించుకో గలిగారు. తన కొక్కడికే అతని దర్శన భాగ్యం దొరక లేదు.  దానితో వాడి కడుపు రగిలిపోయింది. తన కోపాన్ని యతీంద్రుల వారి మీదకే నెట్టి, నానా కారుకూతలూ మొదలు పెట్టాడు. ఒక వితండ వాదాన్ని ప్రారంభించాడు. ఊర్లో అందరితో వాదనకి దిగి, నోటికొచ్చి నట్టు వాగడం మొదలు పెట్టాడు.  ‘‘ నాలాంటి మహా భక్తుడు తనని చూడడానికి  వస్తున్నాడని కూడా తెలుసుకో లేక ఊరొదిలి వెళ్ళి పోయేడు !  అతనేం యతి ! అతనిదేం
మహిమ !  వట్టి దొంగ సన్యాసి ! మీరంతా అతడిని నమ్మి మోస పోయారు ..’’ అంటూ తెగ వాగడం మొదలు పెట్టాడు. తాము నమ్మిన మతీంద్రులను వాడు అలా దుర్భాషలు ఆడడం ఎవరికీ నచ్చ లేదు. కాదంటే తమనీ నోటికి వచ్చి నట్టు తివడతాడని అంతా నోరు మెదపకుండా ఉండి పోయేరు. వాడి నోటికి తాళం వేయడం లాగో ఎవరికీ తెలిసింది కాదు !
    చివరకి,  రామయ్య అనే ఒక తెలివైన కుర్రాడు ఒక రోజు  సోమయ్యతో ఇలా అన్నాడు :  ‘‘ ఊర్లో వృద్ధులూ, వికలాంగులూ, రోగ గ్రస్థులూ, ఇంకా నీ లాంటి మహా భక్తులూ మాత్రమే యతీంద్రుల వారిని దర్శించుకో లేక పోయేరు. అలాంటి వారందరికీ వారు ప్రత్యేకంగా వారి కలల లోకి వచ్చి , దర్శన మిస్తున్నారు !నేడో, రేపో మహా భక్తుడవైన నీకల లోకి కూడా వచ్చి కనబడతారు కాబోలు, అదీ,నీభక్తి నిజమైన దయితేను మాత్రమే సుమా ! నీది నిజమైన భక్తి అని ఊర్లో అందరికీ తెలుసు. నీ అంత గొప్ప భక్తుడు ఊళ్ళో మరొకడు లేడు ! అంచేత వారు తప్పకుండా నీ కలలోకి వచ్చి కనపబడతారు ... అసలు ఈ సరికే వారి దర్శనం నీకు కలలో జరిగే ఉంటుంది .. అవునా !  ఏమయినా, నీ అంత అదృష్ట వంతుడు
మన ఊళ్ళోనే కాదు, చుట్టు ప్రక్కల గ్రామాలలో కూడా ఎక్కడా లేడయ్యా ! భాగ్యశాలివి ! మాకా అదృష్టం లేదు ! ’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు !
    సోమయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. కలలో యతీంద్రులు కనబడ లేదంటే , ఊరి వాళ్ళ ముందు తను మహా భక్తుడు కాకుండా పోతాడు !
     అంచేత,  ‘‘ అవునవును యతీంద్రుల వారు నాకు నిన్న రాత్రే కలలో కనిపించారు. చాలా సేపు మాట్లాడు కున్నాం కూడానూ ! ’’ అని బొంకాడు.
      ఆ తర్వాత వాడు మరింక యతీంద్రుల వారి గురించి అవాకులూ చెవాకులూ పలకడం మానీసేడు !
       వాడి నోటికి తాళం పడింది !!