26, ఆగస్టు 2014, మంగళవారం

చిట్టి చిలుకమ్మ అక్షరాభ్యాసం !


చిలుకమ్మ తన గారాల బిడ్డ చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం చేయించాలని తలపెట్టింది. అందు కోసం సకల సంభారాలూ సమకూర్చుకుంది. చెట్ల నడిగి తీయ తీయని పళ్ళను ఎన్నింటినో సేకరించింది. తేనెటీగలను అడిగి ఆకు దొప్పెడు తియ్యని తేనెను తీసుకుని వచ్చింది. లతల నడిగి రంగు  రంగుల పూలను సేకరించింది. అతిథులు కూర్చోడానికి  కొమ్మలనడిగి లేత రెమ్మలనూ, చిగురుటాకులనూ తెచ్చింది. మామిడాకుల తోరణాలు కట్టింది. కోకిలమ్మను  తన బృందంతో వచ్చి మంగళ వాయిద్యాలు వినిపించమని అడిగింది.  చిలుక పండితుని తన బిడ్డకి అక్షరాభ్యాసం చేయించడానికి రావలసినదిగా ఆహ్వానించింది. అందరినీ తన బిడ్డ అక్షరాభ్యాస కార్యక్రమం చూడడానికి రమ్మని పిలిచింది.
    అందరినీ పిలిచింది కానీ, ఉడుతమ్మని మాత్రం రమ్మని పిలవ లేదు ! ఉడుతమ్మ అంటే చిలుకమ్మకి చాలా రోజుల నుండీ కోపం. వాళ్ళిద్దరికీ పడడం లేదు. దోర ముగ్గిన పళ్ళనన్నింటినీ తన కంటె ముందుగా ఉడుతమ్మ కొరికి రుచి చూస్తోందని చిలుకమ్మకి  మంట ! అందుకే, తన యింట జరిగే ఆ వేడుకకి కావాలనే ఉడుతమ్మని పిలవ లేదు.
     చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం జరిగే రోజు రానే వచ్చింది.  ఉదయాన్నే  బిడ్డను నిద్ర లేపి , చిలుకమ్మ ముస్తాబు చేసింది. అతిథులూ, చిలుక పండితుడూ వచ్చేటప్పుడు అల్లరి చేయ వద్దని బుద్ధులు చెప్పింది. చిట్టి చిలుకమ్మ అక్షరాభ్యాస కార్యక్రమానికి పిలిచిన వాళ్ళందరూ బిరబిరా వచ్చేసారు.
    అయితే, రామ శబ్దం పలికించి, అక్షరాభ్యాసం చేయించే చిలుక పండితుని జాడ ఎక్కడా కనిపించ లేదు.
     చిలుకమ్మ గాభరా పడసాగింది. మాటి మాటికీ చిటారు కొమ్మ మీదకి ఎక్కి, చిలుక  పండితుడు వస్తున్నాడేమోనని చూడసాగింది. వస్తున్న ఆనవాలు ఎక్కడా కనిపించక పోవడంతో చిలుకమ్మ దిగులు పడుతోంది.
    చిలుక పండితుడు ఎందుకు రాలేదంటే ...
     అతడు చిలుకమ్మ యింటికి బయలు దేరి వస్తూ ఉంటే,  దారిలో ఉడుతమ్మ తన ఇంటి ముందు విచారంగా కూర్చుని ఉండడం చూసాడు.  కారణం మిటని లాలనగా అడిగేడు.  అందరినీ తన ఇంటి వేడుకకి పిలిచిన చిలుక తల్లి , తనని మాత్రం పిలవ లేదని చెప్పి ఉడుతమ్మ కంట నీరు పెట్టుకుంది. దానితో చిలుక పండితునికి పట్టరానంత కోపం వచ్చింది. చిలుకమ్మ ఇంటికి అక్షరాభ్యాస కార్యక్రమం చేయించ డానికి వెళ్ళ కూడదని  నిర్ణయించు కున్నాడు. గిరుక్కున వెను తిరిగి,  తన ఇంటికి వెళ్ళి పోయాడు ! అదీ విషయం !
       ఈ సంగతి మైనా పిట్ట వలన చిలుకమ్మకి తెలిసింది. చిలుకమ్మ తన తప్పు తెలుసుకుంది. వెంటనే పరుగు పరుగున  ఉడుతమ్మ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళింది. తన ను క్షమించమని వేడుకుంది. తన ఇంట జరిగే  కార్యక్రమానికి రమ్మని మరీ మరీ ఆహ్వానించింది.  తరువాత ఉడుతమ్మను వెంట తీసుకుని చిలుక పండితుని ఇంటికి వెళ్ళింది. దీనంగా తన తప్పును మన్నించమని వేడుకుంది. దానితో చిలుక పండితుడు శాంతించాడు. చిట్టి చిలుకమ్మకు అక్షరాభ్యాసం చేయించేందుకు చిలుకమ్మ ఇంటికి వారితో పాటూ వచ్చేడు. అతిథు లందరూ సంతోషించారు.
   చిలుక పండితుడు పూజ చేయించి, చిట్టి చిలుక చేత ముమ్మారు రామ శబ్దం పలికించేడు ! చిలుకమ్మ అతిథు లందరికీ తియ్యని పండ్లూ, తేనెతో విందు చేసింది. చిలుక పండితుని తగు విధంగా సత్కరించింది. పండితుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా హితవు చెప్పాడు : ‘‘నువ్వు ఉడుతమ్మ మీద అకారణంగా  ద్వేషం పెంచుకుని అవమానించేవు. నీ బిడ్డ చేత ఇవాళ రామ శబ్దం ముమ్మారు పలికించాను కదా ! ఆ రాముడి మెప్పునే పొందిన ధన్య జీవి ఉడుత  ! తెలుసా ! లంకకి వారధి కట్టేటప్పుడు  చేసిన ఉడుతా సాయానికి మెచ్చుకుని రఘురాముడు ఉడుత వీపు ప్రేమగా నిమిరాడుట ! ఆ గుర్తులే చారికలుగా ఉడుతల మీద ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఉడుతతో నీకు తగవు  తగదు. కనుక మీరిద్దరూ ఇక నుండి స్నేహంగా ఉండండి !’’
    చిలుక పండితుని మాటలకు అందరూ కిలకిల మని కూతలతో  తమ ఆనందాన్ని తెలియ జేసారు.
      అదిగో  ! అప్పటి నుండి చిలుకమ్మ , ఉడుతమ్మ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి !