29, ఆగస్టు 2014, శుక్రవారం

పక్షుల తీర్మానం !!


పక్షుల రాజ్యంలో రకరకాల పక్షులు అసంఖ్యాకంగా ఉన్నాయి. చిలుకలు ,నెమళ్ళు ,గోరు వంకలు, మైనా పిట్టలు, పిగిలి పిట్టలు, పిచ్చుకలు, కాకులూ, కోళ్ళూ, కోకిలలూ, ,  వడ్రంగి పిట్టలు, బాతులు,బెగ్గురు పక్షులు ... ఇలా చాలా జాతుల పక్షులు ఉన్నాయి. అందమయిన ముక్కులు కలవీ, పెద్ద తోకలతో వయ్యారంగా తిరిగేవీ, చక్కని కళ్ళున్నవీ, కమ్మని కంఠాలున్నవీ,బలమైన రెక్కలు గలవీ, రంగు రంగుల ఈకలున్నవీ ..పక్షుల రాజ్యంలో నిత్యం కిలకిలారావాలతో సందడి చేస్తూ ఉంటాయి      వాటి రెక్కల చప్పుళ్ళతో, కూతలతో అడివంతా గొప్ప సందడిగా ఉంటుంది. ఉదయ సాయంకాలాలయితే మరీనూ !
      ఒక  సారి పక్షుల పండుగ వచ్చింది. పండుగ వేడుక జరుపుకుంటూ పక్షులన్నీ ఒక చోట చేరాయి. పక్షుల రాజ్యంలో జరిగే పెద్ద పండుగకి మానస సరోవరం నుండి రాజ హంసలు ముఖ్య అతిధిలుగా వచ్చేయి. వాటి రాకతో పండుగ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రకరకాలయిన పళ్ళతో, చిగుర్లతో, పూల తేనెలతో, తామర తూడులతో, విందులూ వినోదాలూ జరిగేయి. పాటలూ, ఆటలూ సరే సరి ! పక్షులన్నీ తమ తమ జాతి పక్షులతో గుంపులు గుంపులుగా విడి పోయి ,ముచ్చటలాడుకో సాగేయి. అలాంటి సందర్భంలో వాటి మధ్య మాటా మాటా వచ్చింది. పక్షులన్నిటి లోనూ  ఏ జాతి పక్షి లోకంలో కెల్లా అందమయినదనే ప్రశ్న  తలెత్తింది. దేనికవే తమ అందమే గొప్పదని చెప్పుకో సాగేయి.
    మా గానమే మాకు అందం అంది కోకిల.
    మా పింఛమే మాకు శోభ అంది నెమలి.
    మాకున్నంత తెలుపు రంగు శరీరం ఇక వేటికీ లేవంది కొంగ.
      మా అందమయిన ముక్కు, రంగు రంగుల ఈకలు ప్రపంచానికే అందం           అంది చిలుక.
      అందానిదేముంది ! అందం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మేం లోకంలో పితృదేవతల రూపంలో వస్తూ ఉంటాం. మాదే గొప్ప అంది కాకి.
       మేం లేక పోతే లోకానికే తెల్ల వారదు తెలుసా ! బడాయి పోయింది కోడి.
        ఇలా పక్షులన్నీ మేం గొప్పంటే , మేం గొప్ప అని తగువులాడు కోవడం మొదలెట్టాయి.అక్కడంతా గోల గోలగా తయారయింది. సరదా కబుర్లు కాస్తా రచ్చ రచ్చగా మారింది !
           ఇంతలో ఓ మూల నుండి కిచ కిచ మని బలహీన మైన కంఠాలతో కూతలు వినిపించాయి. వాటి గొంతులలో అంతు లేని విచారం వినిపించింది. పక్షులన్నీ ఒక్క సారిగా ఉలిక్కి పడి , తమ జగడం ఆపి అటు వేపు చూసాయి. అక్కడ కొద్ది పాటి సంఖ్యలో పిచ్చుకలు విచారంగా ముఖాలు పెట్టి, బిక్కు బిక్కుమంటూ కనిపించాయి. వాటి చిన్నారి కళ్ళు ధారగా కన్నీళ్ళు కారుస్తున్నాయి.
      అప్పుడు అతిథులుగా వచ్చిన మానస సరోవరపు  హంసలలో హంసల పెద్ద అందరికీ వినిపించేలా ఇలా అంది : ‘‘పక్షుల రాజ్యంలో పక్షులన్నీ అందమైనవే. మీలో మీరు ఊరికే వాదులాడుకుంటున్నారు. ఆ పిచ్చుకలు చూడండి ! ఎంత ముద్దుగా ఉన్నాయో ! కానీ వాటి జాతి రాను రాను అంతరించి పోతోందని ఎలా కుమిలి పోతున్నాయో !పిచ్చుకలే కాదు మన పక్షి జాతులు చాలా రకాలవి అలా అంతరించి పోయే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.రకరకాలయిన వాతావరణ కాలుష్యం వల్లా, ఆధునిక యంత్రాల వల్లా, వేటగాళ్ళ ముప్పు వల్లా యిలా చాలా కారణాల వల్ల కొన్ని పక్షిజాతులు  ముందు ముందు మనకి కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై మనమంతా ఐక్యంగా ఉండి ఏదో ఒకటి చెయ్యాలి.’’
     అడవి లోని పక్షులన్నీ రాయంచ చెప్పిన మాటలకు అంగీకారం తెలిపాయి.
 ఆ తరువాత అవి, అంతరించి పోతున్న పక్షి జాతులను కాపాడమని వేడుకుంటూ ఒక తీర్మానం చేసాయి.
         ఆ తీర్మానం ప్రతులు ఒకటి పరమేశ్వరుడికీ, మరొకటి  మానవ జాతికీ పంపించేయి.
          ఇంతకీ, అవి వారికి చేరుతాయో లేదో, తెలియదు !
   



  

కామెంట్‌లు లేవు: