25, ఆగస్టు 2014, సోమవారం

మంచి మిత్రులు కొండ - నది


సీతారామ పురంలో ఒక కొండ ఉంది. దాని ప్రక్క నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంది.ఆ రెండూ ఎన్నో వందల ఏళ్ళ నుండి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. లెక్క పెట్ట లేనంత కాలం నుండి ఆ కొండ అక్కడ అలాగే ఉంది. ఆ నది కూడా ఎన్నో తరాల నుండీ దానిని ఒరుసు కుంటూ ప్రవహిస్తూనే ఉంది. ఎంతో దూరం నుండి వస్తున్న నది  ఆ కొండ దగ్గరకి రాగానే, కొండ చరియలను నీళ్ళతో తడుపుతూ కొండను చల్లగా పలకరిస్తూ ఉంటుంది . వరద నీరు వచ్చి నప్పుడల్లా కొండకు మరీ సంతోషం. ఆ నదిని చూసి కొండ  పులకరించి పోతూ ఉంటుంది. అందుకే దాని మీద  చెట్ల కొమ్మలూ, రెమ్మలూ  ఎప్పుడూ గలగలలాడుతూ ఉంటాయి. నడి వేసవిలో మాత్రం నదిలో నీరు తగ్గు ముఖం పట్టడంతో  నది కొండకి బాగా దూరంగా జరిగి పోతూ ఉంటుంది. అప్పుడు  కొండకి చాలా బాధగా ఉంటుంది. చిక్కి పోయిన నేస్తాన్ని చూసి  దాని మనసు చవుక్కుమంటూ ఉంటుంది. మళ్ళీ వానలు బాగా కురియడంతో నది పొంగి ప్రవహిస్తూ, కొండ చరియలకు దగ్గరగా వస్తుంది. కొండ మురిపెంగా దాని చల్లని స్పర్శకు పులకరించి పోతూ ఉంటుంది. అలా ఆ రెండూ ఎప్పటి నుండో స్నేహంగా ఉంటున్నాయి.
     అయితే, రోజులన్నీ ఒకలాగే ఉండవు కదా !  ఒక సారి వెర్రి గాలి ఒకటి కొండ మీద నుండి వీస్తూ, నదిని గురించి కొండకు చాలా చాడీలు చెప్పింది.. నది మీద కోపం వచ్చేలా చేసింది. దానితో కొండ మనసు విరిగి పోయింది.
   వెర్రి గాలి మాటలు మనసులో ఉంచుకుని ఒక రోజుకొండ నదితో ఇలా అంది :  ‘‘మిత్రమా ! ఎన్నో ఏళ్ళనుండి మనం స్నేహితులం ! అవును కదా ! వరద వచ్చి నప్పుడు నువ్వు నామీద నుండి ఎన్నో మంచి మంచి పళ్ళ చెట్లనూ, పచ్చని కొమ్మలనూ నువ్వు  నీతో లాక్కు పోతూ ఉంటావు. నాకు చెందిన రాళ్ళ సంపదను కూడా నువ్వు నన్ను అడగ కుండానే నీలో కలిపేసు కుంటూ ఉంటావు ! నేస్తానివి కదా అని నేను ఏమీ అనడం లేదు.  కానీ ఒక్క నాడు కూడా నువ్వు నాకు ఒక్క విలువయిన బహుమతినీ  తెచ్చి ఇవ్వ లేదు. పైగా ఎక్కడెక్కడి నుండో చెత్తా చెదారాన్ని తెచ్చి నామీద కుమ్మరించి పోతున్నావు.
   అదీ కాక, ఎన్ని సంవత్సరాలయినా, నేను ఇలా కదలకుండా ఒక్క లాగే ఉన్న చోటునే ఉండి పోవలసి వస్తోంది. నువ్వేమో, నిరంతరం కదిలి ఎక్కడికో వెళ్ళి పోతూ ఉంటావు. లోకంలో వింత లన్నీ చక్కా చూస్తూ ఉంటావు ! నాకయితే ఆ అదృష్టం లేదు కదా ! నా ఖర్మ కాలి నేను ఇక్కడే పాతుకు పోయి ఉంటాను. నువ్వె వెళ్ళి వెళ్ళి సముద్రంలో కలుస్తావుట కదా ! సముద్రంలో గొప్ప గొప్ప రత్నాలూ అవీ ఉంటాయని ఓ సారి నాతో కబుర్ల మధ్య నువ్వే చెప్పావు.  కానీ , ఇంత కాలమైంది నాకు కనీసం ఒక్క సారయినా, ఒక్క రత్న మయినా తెచ్చి ఇవ్వ లేదు. ఈ సారి వచ్చి నప్పుడు నా కోసం గుప్పెడు రత్నాలు తేవాలి సుమా ! ’’ అంది.
   ఆ మాటలు విని  నది నవ్వుతూ, ‘‘ నేస్తమా ! నేను సముద్రంలో కలవడమే కానీ తిరిగి రాలేను. అలా తిరిగి రావడమంటూ కుదరదు. అందు చేత నీకు రత్నాలను ఎలా తెచ్చి ఇవ్వ గలను చెప్పు ? ’’ అంది.
     దీనితో వారి మధ్య మాటా మాటా పెరిగింది.  కొండ కోపంతో ‘‘ అలా అయితే, నేను అమాంతంగా పెరిగి పోయి నిన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళ నివ్వ కుండా చేస్తాను జాగ్రత్త ! ’’ అని బెదిరించింది కోపంగా.
  నది పగలబడి నవ్వుతూ ‘‘ అది నీ తరం కాదు ! ఏదో ప్రక్క నుండి నేను వెళ్ళి పోగలను ! అదీ కాక ఇంత సేపూ నువ్వు నాతో మాటలాడుతూ ఉండగానే నేను చాలా దూరం వెళ్ళి పోయేను తెలుసా !’’ అంది.  ఆ మాటలు కొండకి ఏమీ అర్ధం కాలేదు.
    వీరి వాదులాట ఇంతసేపూ వింటున్న పెద్ద మేఘం ఒకటి వారితో ఇలా అంది : ‘‘ఎన్నో యుగాలుగా  స్నేహంగా ఉంటున్న మీరు ఇలా తగువులాడు కోడం తగదు. ప్రకృతిలో కొండలూ, చెట్లూ, చేమలూ, నదులూ, మబ్బులూ ఈ అందాలన్నీ భగవంతుడు కల్పించినవి.
   కొండల మీద దేవుళ్ళు వెలిస్తే, నదులలో ప్రజలు తీర్ధ స్నానాలు చేస్తారు. దేని గొప్ప దానిదే. కొండలలో సూర్యుడు ఉదయించడం, అస్తమించడం చేస్తూ లోకానికి రాత్రీ పగలూ కలిగిస్తూ ఉంటాడు. అంచేత కొండ  కదలదు. నది ప్రవహిస్తూ దారి పొడుగునా పొలాలకూ, జనాలకూ  సాగు నీరూ, త్రాగు నీరూ,  అందిస్తూ ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. అందు చేత నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి ! తెలిసిందా !’’ అని  సర్ది  చెప్పింది. దానితో  కొండ ,నది ఎప్పటిలాగే సఖ్యంగా ఉండ సాగేయి.
      వాటి అందం అంతా యింతా కాదు ! చూసే వాళ్ళకి రెండు కళ్ళూ చాలవు తెలుసా !!