సేకరణ : from youtube
29, డిసెంబర్ 2014, సోమవారం
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ...
సేకరణ : from youtube
25, డిసెంబర్ 2014, గురువారం
రాజ కుమారి పెళ్ళి !
అవంతీ రాజ్యాన్ని పాలించే రాజు అసమర్ధుడు కావడంతో
రాచ వ్యవహారాలన్నీ అతని చిన్న రాణి కుముదినీ దేవి నిర్వహించేది. పట్టపు రాణి ఏదో
వింత వ్యాధి దాపురించి, అకాల మరణం చెందింది. దానితో ఆమె ఒక్కగా నొక్క కూతురు
వినోదిని తల్లి లేని పిల్లయి పోయింది. చిన్న రాణి ఆమెను నానా బాధలూ పెట్టేది.
చిన్న రాణి పెట్టే బాధలు భరించ క వినోదిని
నిత్యం ఏడుస్తూ కాలం గడిపేది. రాజు
చిన్న రాణిని వారించ లేక సతమత మయ్యే వాడు. చిన్న రాణి పెట్టే బాధలు భరించ లేక వినోదిని ఒక రోజు అడవి లోకి పారి పోయింది.
చాలా
సేపు అడవిలో ఎక్క డెక్కడో తిరిగి, నీరసంతో ఓపిక నశించి, చీకటి పడే వేళకి అక్కడ వో
పెద్ద పాడు పడిన భవనం కనిపిస్తే అందు లోకి వెళ్ళింది. అక్కడ వొక పాత కాలపు పెద్ద
పందిరి మంచం కనిపిస్తే, దాని మీద వాలి పోయి,ఒళ్ళెరక్కుండా నిద్ర పోయింది.
ఆ
పాడు పడిన భవనంలో చాలా ఏళ్ళుగా ఒక బ్రహ్మ రాక్షసి ఉంటోంది. అది ఆ రాత్రి వస్తూనే తన మంచం మీద ఎవరో అపురూప
లావణ్యవతి పడుకుని ఉండడం చూసింది. కోపంతో ఆ పిల్లని చంపి తినెయ్యాలని అనుకుంది.కాని,
దాని కప్పుడు ఆకలి అంతగా లేదు. అదీ కాక,
అమాయికంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని వెంటనే చంపెయ్యడం దానికి ఇష్టం లేక పోయింది.
నిద్ర లేపి ఆ పిల్ల వివరాలు తెలుసు కోవానుకుంది. వినోదిని నిద్ర లేస్తూనే మ్రహ్మ
రాక్షసిని చూసింది. తనని చూసికూడా ఆ పిల్ల ఏమాత్రం భయపడక పోవడం బ్రహ్మ రాక్షసికి
ఆశ్చర్యం కలిగించింది.
‘‘ అమ్మాయీ !నన్ను చూస్తూనే మీ నరమానవులందరూ
వజవజా వణికి పోతారు. కానీ నువ్వు కించిత్తు కూడా భయ పడడం లేదు. కారణం ఏమిటి !?’’
అని అడిగింది. దానికి వినోదిని బ్రహ్మ రాక్షసితో ఇలా అంది : ‘‘ నాకో సవతి తల్లి
ఉంది. ఆమె పెట్టే బాధలు అంతా ఇంతా కాదు.
ఆమె కనిపిస్తే చాలును ! నాకు పై ప్రాణాలు పైనే పోతాయి ! ఆవిడంటే కలిగే భయం ముందు నాకు
ఇంకేవీ అంతగా భయ పెట్టవు !’’ అంటూ తన సవతి తల్లి పెట్టే హింసల గురించి ఏకరువు
పెట్టింది. దానితో బ-హ్మ రాక్షసి మనసు కరిగి పోయింది. వెంటనే వినోదినికి తినడానికి
మంచి ఆహారం సమకూర్చి, ఆమె సేద తీరాక, ఆమెకు ఒక మాయా దర్పణం, ఒక మాయ జలతారు చీర,
మాయా పాద రక్షలు ఇచ్చి ధైర్యంగా కోటకు తిరిగి వెళ్ళమంది.
వినోదిని కోటకు తిరిగి వెళ్ళడానికి మొదట భయ పడినా,ధైర్యం కూడదీసుకుని రాచ
నగరుకి చేరు కుంది. తిరిగి వచ్చిన
వినోదినిని చూస్తూనే చిన్న రాణి కోపంతో ఊగి పోయింది. నానా దుర్భాషలూ ఆడింది. కాని వినోదిని తన వెంట తెచ్చిన వస్తువులను చూసి
కాస్త నిదానించింది. అవన్నీ వినోదిని నుండి లాక్కుంది. ముందుగా అందంగా మెరిసి
పెతున్న మాయ జలతారు చీరని ముచ్చట పడి కట్టుకుంది.
అంతే ! ఆమె శరీరమంతా పొడలు పొడలుగా మారి పోయింది. అది గమనించని చిన్న రాణి, ఆ మాయ జలతారు చీరలో
తన అందం మాయా దర్పణంలో చూసుకోవాలనుకుంది. అంతే ! అద్దంలో తన వికృతాకారం చూసి కెవ్వు
మంది. ఈ లోగా రాజు అక్కడికి వచ్చి, వికృతాకారంలో ఉన్న చిన్న రాణిని పోల్చు కోలేక,
తక్షణం కోట వదలి పొమ్మని ఆదేశించేడు. చిన్న రాణి రాజుతో తన గురించి చెప్పాలనుకున్నా, ఆమె గొంతు పెగల్లేదు! ఆమె భోరున ఏడుస్తూ మాయా
పాద రక్షలను ధరించింది. అంతే ! ఏదో ఒక
వింత శక్తి విసురుగా ఆమెను లాక్కు
పోయి సుదూర తీరంలో ఒక దట్ట మయిన అడవిలో
పడవేసింది !
అప్పటి నుండి రాకుమారి వినోదినికి సవతి తల్లి బాధలు తప్పాయి ! రాజు కూడా
ఆమెను నిర్భయంగా ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు. కొద్ది రోజులకే ఉజ్జయినీ రాజ
కుమారునితో వివాహంజరిపించాడు..
ఆ
పెళ్ళికి ఆకాశమంత పందిరి ! భూ దేవంత ముగ్గు వేసారు ! మణి దీపాల కాంతులు రాత్రీ
పగలు అనే తేడా లేకుండా చేసాయి ! మంగళ వాయిద్యాలూ. వేద మంత్రాలూ మారు మ్రోగి పోయాయి
! రాచ కుటుంబాల వారూ, పుర జనులూ , వారూ వీరని కాదు ఇసక వేస్తే రాలనంత మంది
అతిథులతో కళకళలాడి పోయింది పెళ్ళి పందిరి !
ఇక ఐదు
రోజుల ఆ పెళ్ళి వేడుకలో వడ్డించిన నవకాయ
పిండి వంటల రుచులంటారా ?
అబ్బో
! నేను చెప్ప లేను బాబూ !
22, డిసెంబర్ 2014, సోమవారం
ఊడల మఱ్ఱి !
ఉజ్జయినికి సమీపంలో కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. అందులో ఒక పెద్ద ఊడల మఱ్ఱి చెట్టు ఉండేది. దానిని అందరూ దెయ్యాల చెట్టు అనే వారు. దాని మీద ఒక బ్రహ్మరాక్షసి ఆ దారంట వెళ్ళే వారిని పీక్కు తినేదిట. ఎంతో అవసరం పడితే తప్ప, ఆ దారంట వెళ్ళడానికి ఎవరూ సాహసించే వారు కాదు !
ఇలా ఉండగా, ఆనందుడు అనే వాడు ఒక సారి జరూరుగా ఆదారంట వెళ్ళ వలసి వచ్చింది. అప్పటికే చీకటి పడింది. భయంతో వణికి పోతూ గబగబా నడవసాగేడు. ఆ చెట్టు దగ్గరకి వచ్చే సరికి, వాడికి ఒక వికటాట్టహాసం వినిపించింది. ఆనందుడికి ముచ్చెమటలు పోసాయి. కొయ్యబారిపోయి నిబడి పోయాడు.
బ్రహ్మరాక్షసి పెద్ద గొందుకతో ఇలా అంది : ‘‘ ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం ! నేనిప్పుడే రెండు పెద్ద బర్రెలను తిని ఉన్నాను. ఆకలిగా లేదు. అలాగని వాటంగా దొరికిన నరమాంసాన్ని వదులు కోలేను ! నిన్ను తరవాత తింటాను. నేను ఈ ఊడల మఱ్ఱిని పట్టుకుని చాలా ఏళ్ళుగా ఉంటున్నాను. విసుగేస్తోంది. మరో చోటికి ఎక్కడికేనా వెళ్ళాలని ఉంది. అయితే, ఈ ఊడల మఱ్ఱి తనకి ఎన్ని ఊడలు ఉన్నాయో సరిగ్గా లెక్క కట్టి చెబితే కానీ వదలనంటూ పట్టుకుని ఉంది. నాకా, లెక్కలు సరిగా రావు ! అందు చేత, దీనికి ఎన్ని ఊడలు ఉన్నాయో లెక్క కట్టి చెబితే ఎక్కడికయినా హాయిగా వెళ్ళాలని ఉంది. అంతే కాదు, ఊడల లెక్క సరిగ్గా చెబితే, నిన్ను తినకుండా వదిలి పెడతాను. ’’ అంది.
ఆనందుడు దొరికిన అవకాశాన్ని ఉసయోగించు కోవాలనుకున్నాడు. దీనంగా ముఖంపెట్టి, ఇలా అన్నాడు : ‘‘ దీని ఊడలు అసంఖ్యాకంగా ఉన్నాయి. చాలా దూరం వరకూ వ్యాపించి ఉన్నాయి. వాటిని లెక్క పెట్టు కుంటూ అంతదూరం నడవాలంటే నాకు శక్తి చాలదు !’’ అని.
మ్రహ్మ రాక్షసి మరేం ఆలోచించకుండా వాడికి గాలిలో ఎగురుతూ వెళ్ళే శక్తినిచ్చే ఒక మంత్ర దండం ఇచ్చింది.
దానిని అందుకుంటూ ఆనందుడు బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు : ‘‘ సరే ! దీని ఊడలు ఎన్ని ఉన్నాయో సరిగ్గా లెక్క పెట్టుకుని వస్తాను. అయితే, ఒక దీనికి ఒక నియమం ఉంది. నేను తిరిగి వచ్చే వరకూ నువ్వు ఎంతో నియమ నిష్ఠలతో ఉండాలి ! ఎలాంటి జంతు హింసా చేయ కూడదు ! ఈ నియమం తప్పావో, అక్కడ నా లెక్క తప్పుతుంది ! మళ్ళీ మొదటికి వస్తుంది ! జాగ్రత్త ! ’’ అన్నాడు.
తెలివి తక్కువ బ్రహ్మరాక్షసి సరేనంది ! ఆనందుడు మంత్ర దండం సాయంతో అక్కడ నుండి మాయమైపోయేడు !
బ్రహ్మ రాక్షసి మాత్రం, ఆనందుడికి ఇచ్చిన మాట ప్రకారం మాంసాహారం మానివేసి. సరైన తిండీ తిప్పలూ లేక, నానాటికీ కృశించి పోయి బాగా బలహీన పడి పోయింది. ఇప్పుడు దానికి కదలడానికే కాదు ... మాట్లాడడానికి కూడా శక్తి చాలడం లేదు !
ఇప్పుడా దారి వెంట వెళ్ళే వారికి బ్రహ్మ రాక్షసి వలన ఏ ప్రమాదమూ లేదు!
కావాలంటే మీరూ నిర్భయంగా వెళ్ళొచ్చు. ఊడల మఱ్ఱి చెట్టు అందాలను
చూడొచ్చును !
11, డిసెంబర్ 2014, గురువారం
నమ్మకం గెలిపిస్తుంది ! అప నమ్మకంఓడిస్తుంది !
అశ్వ సేనుడు అవంతీ రాజ్యాన్ని పరిపాలించే
రోజుల్లో, ఒక ఏడాది తీవ్రమయిన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. నెలల తరబడి వొక్క వర్షపు
చుక్క కూడా పడడం లేదు. భూములన్నీ బీడు వారి పోయేయి. ప్రభువుల ధనాగారం కూడా
నానాటికీ తరిగి పోసాగింది. తిండికి కరువు రావడంతో రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది.
దారి దోపిడీలూ, దొంగతనాలూ పెచ్చు పెరిగి పోయేయి. ప్రజలు రాజ శాసనాలను ధిక్కరించే
పరిస్థితి ఏర్పడింది. అశ్వ సేనుడి పాలన పట్ల ప్రజలకు నమ్మకం సడలి పోసాగింది. రాజులో కూడా నానాటికీ అసహనం ఎక్కువ కాసాగింది.
ఆకలికి తట్టుకో లేక పెట్టే ఆర్తుల మొర ఆలకించడం మానేసాడు. మీదు మిక్కిలి కఠిన
దండనలు విధించ సాగేడు. అధిక పన్నులు వేయ సాగేడు.
దాంతో రాజ్యంలో అరాచకంమరింత పెరిగి పోయింది ! పరిస్థితి చెయ్యి దాటి
పోతున్నదని మహా మంత్రి గమనించాడు. రాజ్యంలో అరాచక పరిస్థితుల నివారణకు తగిన
పరిష్కారం కనుగొనడానికి వో సారి తపోవనవాసులయిన మునిజనం వద్దకు వెళ్ళి రమ్మని మహా
మంత్రి, రాజ గురువు రాజుకి సలహా యిచ్చారు. అందుకు సమ్మతించి అశ్వ సేనుడు కొద్ది
పాటి సైన్యంతో అటవీ ప్రాంతానికి బయలుదేరాడు.
అరణ్య ప్రాంతంలో ప్రవేశించగానే , అక్కడి వాతావరణం చూసి రాజు చకితుడయ్యేడు !
అక్కడ అంతా పచ్చగా ఉంది. మునులూ, వారి శిష్యులూ పుష్ఠిగా వింత తేజస్సుతో వెలిగి
పోతున్నారు ! రాచ నగరుకి అతి సమీపంలో ఉండే
అటవీ భూములలో రాచ నగరులో వలె కరువు కాటకాలు లేక, అంతా పచ్చగా ఉండడానికి కారణం
మునులను ఇలా అడిగాడు. ‘‘ మునులారా! ఈ ఆశ్రమ ప్రాంతం మా రాజ నగరుకి
ఏమంత దూరంలో లేదు. కానీ అక్కడి కంటె భిన్న మయిన పిరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ
అటవీ ప్రాతం కూడా నా ఏలుబడిలో ఉన్నదే కదా ! అతిసమీప ప్రాంతాలయినఈ రెడంటికీ నడుమ
ఇంత తేడా ఎలా వచ్చింది ?’’ అనడగాడు.
మునులు నవ్వి , ‘‘ రాజా ! ఇప్పుడు చూడు ! లా కనిపిస్తోందో !’’ అన్నారు.
రాజు చుట్టూ తేరిపార చూసాడు. ఆశ్చర్యం
! అక్కడి వాతావరణం రాచ నగరు కంటె భిన్నంగా
ఏమీ లేదు ! కరువు అక్కడా తాండవిస్తోంది.
రాజుకి అంతా అయోమయంగా తోచింది.
అప్పుడు మునులు రాజుతో ఇలా అన్నారు : ‘‘ మహా రాజా ! ఆపదలో ఉన్న మిమ్ములను
మునుల మయిన మేము ఒడ్డెంక్కించ గలమనే నమ్మకంతోనే నువ్వు ఇక్కడకి వచ్చేవు. అందు
వల్లనే నీకలా గోచరించింది. అంతే. దేనికయినా నమ్మకమే ప్రధానం ! ఈ కరువు పరిస్థితులు
ఇక ఎన్నాళ్ళో ఉండవు. వెళ్ళి, నీప్రజలలో నీ పాలన పట్ల నమ్మకం కలిగించు. నమ్మకం
గెలిపిస్తుంది. అప నమ్మకం ఓటమికి దారి చూపిస్తుంది ! వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించు. అప్పుడు
అరాచకం తగ్గుతుంది ’’
రాజు మునుల వద్ద శలవు తీసుకుని, రాజధానికి తిరిగి వచ్చి, మునులు
చెప్పినట్టే తన ఏలుబడి పట్ల ప్రజలలో నమ్మకం కుదురు కునేలా చేశాడు.
త్వరలోనే రాజ్యమంతటా విస్తారంగా వానలు కురిసాయి !
రాజ్యం సుభిక్షమయింది !
3, డిసెంబర్ 2014, బుధవారం
కవులకు సత్కారం !
పూర్వం ఒక గ్రామంలో
ముగ్గురు కవి పండితులు ఉండే వారు.
వారు ముగ్గురూ చక్కని కవిత్వం చెబుతూ చుట్టు ప్రక్కల గ్రామాలలో మంచి పేరు
సంపాదించు కున్నారు. కానీ , వారిని
పేదరికం వెంటాడుతూ ఉండేది. తమ రాజ్యాన్ని
పాలించే రాజుని దర్శించుకుని, ప్రభువుల ఆశ్రయం పొందితే తప్ప , వారి దారిద్ర్యం
తీరదని ఎవరో సలహా చెప్పారు.
‘‘ మనబోటి వారికి రాజాశ్రయం దొరకడం దుర్లభం ! వెళ్ళడం వృధా ప్రయాస ! ’’
అని, ఒక కవి నిరాశగా అన్నాడు.
మరొక కవి, ‘‘ మన కవిత్వం గొప్పతనం విని, ప్రభువుల వారే మనల్ని ఆహ్వానించి
సత్కరించాలి. అంతే తప్ప, మనంతట మనం వెళ్ళడం ఏమిటి !’’ అని వాదించాడు.
మూడో కవి వారిని బ్రతిమలాడి, ఎలాగో
వారికి నచ్చ చెప్పి, రాచ నగరుకి బయలుదేర దీసాడు.
కవులు ముగ్గురూ రాచ నగరుకి వెళ్ళి, అక్కడ వో సత్రంలో బస చేసారు. రాజ దర్శనం
అనుకున్నంత తేలికగా లభించదని వారికి అర్ధం కావడానికి అట్టే రోజులు పట్ట లేదు !
మొదటి కవి , ‘‘ ఇక రాజు గారి దర్శనం
దొరకడం వట్టి మాట ! నేను ముందే చెప్పాను కదా ... నేను మన గ్రామానికి తిరిగి వెళ్ళి
పోతున్నాను. ’’ అన్నాడు. రెండో కవి ‘‘
నేనూ ముందే చెప్పాను కదా ! మనంతగా మనం రాజ
దర్శనానికి రావడంసరికాదని. అలా చేస్తే లోకువ అయి పోమూ ! మనం ఇక్కడకి రావడమే తెలివి
తక్కువ. నేను తిరిగి మన గ్రామం వెళ్ళి
పోతున్నాను. ’’ అన్నాడు. ఆ ఇద్దరు కవులూ గ్రామానికి వెళ్ళి పోయాక, మూడో కవి మాత్రం అక్కడే ఉండి, రాజ దర్శనం కోసం
ఓపికగా నిరీక్షించ సాగేడు.
వేగుల వలన రాజు ఈ ముగ్గురు కవుల గురించి విన్నాడు. ముదుంగా గ్రామం నుండి మొదటి కవిని సభకి పిలిపించాడు. అతని కవిత్వం సాంతం వినకుండానే అతనికి కొద్దిపాటి ధనం యిచ్చి,
పంపించివేసాడు. తర్వాత, గ్రామం నుండి రెండో కవిని పిలిపించి, అతని కవిత్వం పూర్తిగా
విని ఆస్వాదించి, అతనికి గొప్ప బహుమానాలు ఇచ్చి. సత్కరించి పంపించాడు. ఆ తర్వాత, మూడో కవిని
అతను బస చేసిన సత్రానికి భటులను పంపి. సభకు
రప్పించాడు.అతని కవిత్వం కొంచెం విని, తొలి కవికి ఇచ్చిన దానికన్నా కొంత ధనం
ఎక్కువ ఇచ్చి పంపించాడు.
ఇదంతా గమనిస్తున్న మహా మంత్రి రాజుతో ‘‘ ప్రభూ ! ఈ ముగ్గురు కవులలో ఏ
ఒక్కరూ తక్కువ ప్రతిభావంతులు కారు. ముగ్గురి కవిత్వమూ ఒక్కలాగే రసవంతంగా ఉందికదా !
వారికి కానుకలు ఇవ్వడంలో ప్రభువులు వివక్ష చూపించడంలో ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది. అదేదో
చెబితే వినాలని ఉంది. అనుగ్రహించండి ! ’’ అన్నాడు వినయంగా.
రాజు నవ్వుతూ మంత్రితో ఇలా
చెప్పాడు : ‘‘ మీరన్నట్టు ముగ్గురు కవులూ
సమాన ప్రతిభావంతులే ! సందేహం లేదు. కానీ, మొదటి కవి ఒట్టి నిరాశా వాది. తన మీద
తనకే నమ్మకం లేదు. అందు చేత, ఎప్పటికయినా అతని కవిత్వంలో పస తగ్గి పోయే వీలుంది. మూడో కవి
చాలా ఓర్పు కల వాడు. అతనికి ఏ కొంచెం ఇచ్చినా, పొంగి పోయే రకం. మరిన్ని
కానుకల కోసం, మెప్పు కోసం కవిత్వం వ్రాస్తూనే ఉంటాడు. కానీ మానెయ్యడు. ఇక, రెండో
కవి గొప్ప ఆత్మాభిమానం ఉన్న కవి. కవులు నిరంకుశులు. అచంచల మయిన ఆత్మాభిమానం ఉంటుంది. రెండో కవి అలాంటి వాడే.
అతనికి సత్కారం చేయడంలో లోటు జరిగితే, ఆ కోపంతో ఇక మీదట కవిత్వ రచనకే స్వస్తి
చెప్పే ప్రమాదం ఉంది ! అందుకే ముగ్గురు కవులనూ సత్కరించడంలోనూ, కానుకలు ఇవ్వడంలోనూ
కావాలనే అలాంటి వివక్ష చూపించాను. వారు తమ ధోరణి మార్చు కున్నాక, ఈ తడవ ముగ్గురికీ సమాన సత్కారాలు చేస్తాను. ’’
అని వివరించాడు.
రాజు గారి మాటలతో సభ సంతోషంతో కరతాళధ్వనులతో మారు మ్రోగి పోయింది
!
25, నవంబర్ 2014, మంగళవారం
దైవానుగ్రహం ఉంటే చాలు కదా !
పూర్వం అవంతీ రాజ్యంలో ఒక రాజు ఉండే
వాడు. అతని పేరు నవనాథుడు. అతని రజ్యంశత్రు భయం లేకుండా ప్రశీంతంగా ఉండేది. ప్రజలు
సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండే వారు. ఎక్కడా అరాచకాలు లేవు. ఆందోళనలు లేవు. ఆకలి చావులు అసలే లేవు. ఇదంతా నత పరిపాలన లోని గొప్పతనం అని రాజు గట్టిగా
నమ్మే వాడు. దానితో అతనికి అహంకారం
ఎక్కువయింది.
నవనాథుని పూర్వీకులు ఎంతో భక్తి త్పరులు.
గుడులూ గోపురాలూ కట్టించేరు. ఎన్నో పుణ్య కార్యాలు చేసారు. పండితులను ఎంతో
గౌరవంగా చూసుకునే వారు. నవనాథుని పాలనలో
అవన్నీ అంతరించి పోయాయి. దానికి కారణం రాజుకి దైవం మీద కన్నా, త మీద ఉండ కూడనంత నమ్మకం ఉండడం చేతనే.
దైవానిదేమీ లేదని, అంతా తన గొప్ప తనమేననీ అతడు నమ్మే వాడు.
నవనాథుడు దైవ దూషన చేయక పోయినా, రాజ్యంలో దైవ కార్యాలకి ఏ మాత్రం ఆదరన
లేకుండా పోయింది.దేవాలయాలు కళా విహీనాలయి పోయేయి !
పండితులకు ఆదరణ లేకుండా పోయింది. రాజ పురోహితుడు సుశర్మ ఈ
పరిస్థితి గమనించి చాలా బాధ పడ్డాడు. దైవానుగ్రహం గురించి రాజుతో ఒక రోజు
సంభాషించేడు. రాజు ఆగ్రహించి, దైవానుగ్రహం కన్నా ప్రజలకు రాజానుగ్రహమే కావాలని
వాదించాడు. ఏమీ అనలేక సుశర్మ మిన్నక ఉండి పోయాడు.
ఇలా ఉండగా, కొన్నాళ్ళకు, రాచ కొలువులో కొన్ని ముఖ్య మయిన పదవులలో
ఉద్యోగులను నియమించ వలసి వచ్చింది. వాటిలో
కొన్న పదవులు రాజు గారి అంత: పురంలో చేయాల్సినవి.
అంత: పురంలో కొలువు చేసే వారికి ఎక్కువ వేతనం ఉంటుంది. మరి కొన్న రాజ్యం లోని వివివధ దేవాలయాలలో
నిర్వర్తించాల్సినవి. దేవాలయ విధులు చేసే
వారికి వేతనం తక్కువగా ఉంటుంది. రాజు ఆ పదవులలో నియమించడానికి రాజ్యం లో నలు
మూలలనుండి గొప్ప పండితులను పిలిపించాడు. ఆయా పదవులకు కావలసిన సంఖ్యలో పండితులను ఎన్నిక చేసాడు. చిత్రంగా వారందరూ
వేతనం తక్కవే అయినప్పటికీ, దేవాలయాలలో
విధులు చేయడానికే మొగ్గు చూపారు ! అంత: పురంలో ఉద్యోగానికి ఏ ఒక్కరూ సిద్ధ నడ
లేదు.
రాజుకి ఆగ్రహంతో పాటూ ఆశ్చర్యం కూడా కలిగింది ! అప్పటికి వారిని పంపి వేసి,
సుశర్మను పిలిపించి వారలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుందని అడిగాడు.
సుశర్మ అదే అదునుగా రాజుకి ఇలా
వివరించాడు : ‘‘ మహా రాజా ! తమ అనుగ్రహం
వలన మన రాజ్యంలో ప్రజలూ , పండితులూ ఎంతో
సుఖ సంతోషాలతో ఉంటున్నారు. దీనికి తిరుగు
లేదు. ఈ మహా పండితులంతా తమ వకొలువులో కాకుండా, దేవాలయాలలో పని చేయడానికి ఒష్ట
పడడానికి కారణం ఉంది. అదేమిటంటే, -
దైవానుగ్రహం ఉంటే, రాజానుగ్రహం ఎలాగూ ఉంటుందని వారు భావిస్తున్నారు. తమకు
రాజానుగ్రహం ఎలాగూ పుష్కలంగా ఉంది కనుక ధనానికి లోటు లేదు. అందుకే తమ అనుగ్రహం ఎప్పుడూ ఉండేలా వారు దైవానుగ్రహం
కోరు కుంటున్నారు. అంచేతనే వేతనం తక్కు వయినప్పటికీ దైవానుగ్రహం పొందడానికి
దేవాలయాలలో దైవ కార్యాలు చేయడానికే మొగ్గు చూపు తున్నారు. అంతే కానీ ఇది ప్రభువుల
పట్ల అవిధేయత మాత్రం కాదు ! తమరు చిత్తగించాలి ’’ అని చెప్పాడు.
మహా మంత్రి మాటలతో రాజులో పరివర్తన కలిగింది. అహంకారం తొలిగి పోయింది.
ఆ నాటి నుండీ ఆ రాజ్యంలో వేవాలయాలు
తిరిగి కళకళలాడుతూ వర్ధిలాయి.
ప్రజలు
రెట్టించిన సుఖ సంతోషాలతో జీవించడం మొదలు పెట్టారు.
శత్రు రాజ్యాలు దాని వేపు కన్నెత్తి చూస్తే వొట్టు!
16, నవంబర్ 2014, ఆదివారం
అడగ వలసిన అసలు ప్రశ్న !
చామలా
పల్లి అగ్రహారంలో మార్కండేయ శాస్త్రి అనే ఒక మహా పండితుడు ఉండే వాడు. అతడు
చిన్నప్పుడే అన్ని శాస్త్రాలూ ఔపోసన పట్టాడు. పురాణేతిహాసాలు క్షుణ్ణంగా చదువు
కున్నాడు. చుట్టు ప్రక్కలే కాక, సుదూర ప్రాంతాలలో ఉండే జమీందారీలలో కూడా అతనికి
సాటి వచ్చే పండితుడు లేడని ప్రతీతి ! చాలా మంది అతని దగ్గర విద్యలు అభ్యసించి , మహా
పండితులయ్యేరు. అతనికి లెక్క లేనన్ని బిరుదులు వచ్చేయి. సువర్ణఘంటా కంకణ ధారణ,
గజారోహణాలూ లాంటి గొప్ప సత్కారాలు అనేకం జరిగాయి. దానితో అతనికి అహంకారం ఎక్కువయింది. తన మాటే వేద
వాక్కు అని తలచే వాడు. అతని పాండిత్యం ముందు నిలువ లేక, ఎవరూ అతని ఎదుట నోరు మెదప లేక
పోయే వారు.
మార్కండేయ శాస్త్రికి ఒక్కతే కూతురు. పేరు కమలిని. మగ సంతానం లేదు. కమలిని అపురూప సౌందర్యవతి. వినయ సంపన్నురాలు. మెకు యుక్త వయసు వచ్చేక, మార్కండేయ శాస్త్రి
ఆమెకు వివాహం చేయాలని తల పెట్టాడు. ఎంద రెందరో ఎన్నో మంచి సంబంధాలు తీసుకు
వచ్చారు. కాని, తన బిడ్డకు తగిన జోడును
తాను మాత్రమే ఎన్నిక చేయ గలనని అతని ఆలోచన.
అందు వలన ఎవరెంత గొప్ప సంబంధం తెచ్చినా ,ఏదో వంకతో తిరస్కరించే వాడు. తనతో
వియ్యమందడానికి వచ్చిన వారిని, పెండ్లి కుమారులనూ అతను చాలా జటిల మయిన ,శాస్త్ర
సంబంధమయిన ప్రశ్నలు అడిగే వాడు. వారితో శాస్త్ర చర్చలకు దిగే వాడు. వారి మేధస్సుకు పరీక్ష పెట్టే వాడు. తర్క
మీమీంసాది శాస్త్రాల లోనే కాక, పురాణాల నుండి, ప్రబంధాల నుండీ చాలా క్లిష్ట మయిన ప్రశ్నలు అడిగే వాడు.
వాటికి
సమాధానాలు చెప్ప లేక ,వచ్చిన వాళ్ళు బిక్క ముఖాల పెట్టే వారు. దాంతో, వచ్చిన మంచి సంబంధా లెన్నో తిరిగి
పోయేవి. అతను వేసే ప్రశ్నలకు అంతూ పొంతూ ఉండేది కాదు ! అతి కష్టం మీద ఎన్నింటికి
జవాబులు చెప్పినా, అతనికి తృప్తి ఉండేది కాదు ! మరిన్ని అడిగి, వారి నోళ్ళు
మూయించే వాడు.
అతని ధోరణి
చూసి ,అతని భార్య ఇందు మతికి చాలా దిగులుగా ఉండేది. ఇలా అయితే పిల్లకి జన్మలో
పెళ్ళి కాదని తెగ బాధ పడుతూ ఉండేది.
ఇలా ఉండగా, ఆ గ్రామానికి కాశీ నుండి ఒక మహా
పండితుడు వచ్చి దేవాలయంలో విడిది చేసాడని ఇందు మతి విన్నది. వినయ రాహులుడు అనే అతని
కొడుకు కూడా అతని వెంట ఉన్నానీ, అవివాహితుడనీ, మంచి రూపసి అనీ కూడా వింది. అంతే
కాదు బాదా చదువు కున్న వాడని , మంచి జమీందారీ నౌకరీ కూడా చేస్తున్నానీ కూడా
తెలిసింది. ఆ యువకుడు కమలినికి ఈడూ జోడూ
అని కూడా తెలుసుకుని మురిసి పోయింది. ధైర్యం చేసి. తన మనసు లోని మాట తన అన్న గారి
ద్వారా ఆ పండితునికి తెలియ జేసింది.
ఆ పండితుడు తన కుమారుడు వినయ రాహులుడిని వెంట పెట్టుకుని, పెళ్ళి చూపులకు వచ్చేడు.
ఎప్పటి లాగే, మార్కండేయ శాస్త్రి తన ప్రశ్నల వర్షం వారి మీద కురిపించాడు. ఆ కాశీ పండితుడూ, అతని కుమారుడూ వాటికి చక్కగా
సమాధానాలు చెప్పారు. గంటలు గడుస్లున్నాయి. కానీ, శాస్త్ర చర్చ మాత్రం ముగియడం లేదు
! ఆ సంబంధం ఎలాగయినా కుదిరితే బాగుణ్ణు ! అని ఆశ పడుతున్న వారందరికీ ఆదుర్దాగా
ఉంది.
ఆ సమయంలో కాశీ పండితుడు మార్కండేయ శాస్త్రి
గారితో ఇలా అన్నాడు : ‘‘ అయ్యా ! మీరు మహా పండితులు
! దానికి తిరుగు లేదు ! మా గురు దేవులు అనుగ్రహించిన విద్య వలన మేమూ తగిన జవాబులు చెప్ప గలిగాము.
కానీ, మేము అడిగే ఒకే ఒక ప్రశ్పకు మీరు సమాధాన మివ్వాలని వినయంగా కోరు కుంటున్నాము
’’ అన్నాడు. దానికి మార్కండేయ శాస్త్రి
సమ్మతించాడు.
‘‘ ఇంత వరకూ మీ అమ్మాయికి చాలా సంబంధాలు వచ్చాయనీ,
మీ శాస్త్ర చర్చలతో అవి తిరిగి
పోయేయనీ విన్నాను. మీరు వచ్చిన వారి
పాండిత్యాన్ని పరీక్షిస్తూ ఉండి పోయారే తప్ప , ఏనాడయినా, మీ అమ్మాయి మనసులో
ఏముందని ఒక్క నాడయినా అడిగారా ! ఇదే నేను
అడిగే ప్రశ్న!’’
అని అడిగాడు
కాశీ పండితుడు. దానితో మార్కండేయ
శాస్త్రికి కోపం ముంచు కొచ్చింది.
‘‘ ఇదేం ప్రశ్న ! ఇలాంటి లౌకిక మయిన ప్రశ్నలకి నేను
జవాబులు
చెప్పను ! ’’ అన్నాడు కోపంగా.
‘‘ అయ్యా !
క్షమించాలి ! నేను తమను వొకే ఒక్క
ప్రశ్న అడుగు తానన్నాను కానీ, అది లౌకిక మయినదా , కాదా అని చెప్ప లేదు ! అదీ కాక, వివాహం చేసు కోవడం, కాపురం చేయడం
అనేవి లౌకిక సంబంధ మయిన విషయాలని తమకు నేను చెప్ప నక్కర లేదు !’’ అన్నాడు కాశీ పండితు.
సూక్ష్మ బుద్ధి గల మార్కండేయ
శాస్త్రి కి కాశీ పండితుని మాటలలో ఆంతర్యం అర్ధ మయింది. మరో ఆలోచన లేకుండా అతనితో వియ్య మందడానికి
అంగీకరించాడు ! అంతా సంతోషించారు. మంచి ముహూర్తాన కాశీ పండితుని కుమారుడు
వినయ రాహులుడితో కమలిని వివాహం అంగరంగ
వైభోగంగా జరిగింది.
ఇప్పుడా దంపతులకి వొక చక్క దనాల కొడుకు కూడానూ
! రేపో మాపో నామ కరణం చెయ్య బోతున్నారు.
మీకూ పిలుపు వస్తుంది. వెళ్ళి ఆశీర్వదించి వస్తారు కదూ ? !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)