22, డిసెంబర్ 2014, సోమవారం

ఊడల మఱ్ఱి !

ఉజ్జయినికి సమీపంలో కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. అందులో ఒక పెద్ద ఊడల మఱ్ఱి చెట్టు ఉండేది. దానిని అందరూ దెయ్యాల చెట్టు అనే వారు. దాని మీద ఒక బ్రహ్మరాక్షసి ఆ దారంట వెళ్ళే వారిని పీక్కు తినేదిట. ఎంతో అవసరం పడితే తప్ప, ఆ దారంట వెళ్ళడానికి ఎవరూ సాహసించే వారు కాదు ! ఇలా ఉండగా, ఆనందుడు అనే వాడు ఒక సారి జరూరుగా ఆదారంట వెళ్ళ వలసి వచ్చింది. అప్పటికే చీకటి పడింది. భయంతో వణికి పోతూ గబగబా నడవసాగేడు. ఆ చెట్టు దగ్గరకి వచ్చే సరికి, వాడికి ఒక వికటాట్టహాసం వినిపించింది. ఆనందుడికి ముచ్చెమటలు పోసాయి. కొయ్యబారిపోయి నిబడి పోయాడు. బ్రహ్మరాక్షసి పెద్ద గొందుకతో ఇలా అంది : ‘‘ ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం ! నేనిప్పుడే రెండు పెద్ద బర్రెలను తిని ఉన్నాను. ఆకలిగా లేదు. అలాగని వాటంగా దొరికిన నరమాంసాన్ని వదులు కోలేను ! నిన్ను తరవాత తింటాను. నేను ఈ ఊడల మఱ్ఱిని పట్టుకుని చాలా ఏళ్ళుగా ఉంటున్నాను. విసుగేస్తోంది. మరో చోటికి ఎక్కడికేనా వెళ్ళాలని ఉంది. అయితే, ఈ ఊడల మఱ్ఱి తనకి ఎన్ని ఊడలు ఉన్నాయో సరిగ్గా లెక్క కట్టి చెబితే కానీ వదలనంటూ పట్టుకుని ఉంది. నాకా, లెక్కలు సరిగా రావు ! అందు చేత, దీనికి ఎన్ని ఊడలు ఉన్నాయో లెక్క కట్టి చెబితే ఎక్కడికయినా హాయిగా వెళ్ళాలని ఉంది. అంతే కాదు, ఊడల లెక్క సరిగ్గా చెబితే, నిన్ను తినకుండా వదిలి పెడతాను. ’’ అంది. ఆనందుడు దొరికిన అవకాశాన్ని ఉసయోగించు కోవాలనుకున్నాడు. దీనంగా ముఖంపెట్టి, ఇలా అన్నాడు : ‘‘ దీని ఊడలు అసంఖ్యాకంగా ఉన్నాయి. చాలా దూరం వరకూ వ్యాపించి ఉన్నాయి. వాటిని లెక్క పెట్టు కుంటూ అంతదూరం నడవాలంటే నాకు శక్తి చాలదు !’’ అని. మ్రహ్మ రాక్షసి మరేం ఆలోచించకుండా వాడికి గాలిలో ఎగురుతూ వెళ్ళే శక్తినిచ్చే ఒక మంత్ర దండం ఇచ్చింది. దానిని అందుకుంటూ ఆనందుడు బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు : ‘‘ సరే ! దీని ఊడలు ఎన్ని ఉన్నాయో సరిగ్గా లెక్క పెట్టుకుని వస్తాను. అయితే, ఒక దీనికి ఒక నియమం ఉంది. నేను తిరిగి వచ్చే వరకూ నువ్వు ఎంతో నియమ నిష్ఠలతో ఉండాలి ! ఎలాంటి జంతు హింసా చేయ కూడదు ! ఈ నియమం తప్పావో, అక్కడ నా లెక్క తప్పుతుంది ! మళ్ళీ మొదటికి వస్తుంది ! జాగ్రత్త ! ’’ అన్నాడు. తెలివి తక్కువ బ్రహ్మరాక్షసి సరేనంది ! ఆనందుడు మంత్ర దండం సాయంతో అక్కడ నుండి మాయమైపోయేడు ! బ్రహ్మ రాక్షసి మాత్రం, ఆనందుడికి ఇచ్చిన మాట ప్రకారం మాంసాహారం మానివేసి. సరైన తిండీ తిప్పలూ లేక, నానాటికీ కృశించి పోయి బాగా బలహీన పడి పోయింది. ఇప్పుడు దానికి కదలడానికే కాదు ... మాట్లాడడానికి కూడా శక్తి చాలడం లేదు ! ఇప్పుడా దారి వెంట వెళ్ళే వారికి బ్రహ్మ రాక్షసి వలన ఏ ప్రమాదమూ లేదు! కావాలంటే మీరూ నిర్భయంగా వెళ్ళొచ్చు. ఊడల మఱ్ఱి చెట్టు అందాలను చూడొచ్చును !

కామెంట్‌లు లేవు: