9, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఒక్క నిముషం !


రాముడు బుద్ధిమంతుడే కానీ,కొంచెం పెంకెతనం ఎక్కువ ! చెప్పిన పని వెంటనే చెయ్యడు.అది మంచి పద్ధతి కాదని త్లీ తండ్రీ ఎంత చెప్పినా వాడి చెవికెక్క లేదు.
ఏ పని చేయమని పురమాయించినా, ‘‘ఇదిగో ఒక్క నిముషం .. కాస్సేపాగి చేస్తాను కదా ! అనే వాడు. తరవాత ఆ పని చేయడం మరిచి పోయే వాడు. దానితో ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండే వారు.వాడినెలా దారిలోకి తేవాలో తెలియక వాడి అమ్మా నాన్నలు తలలు పట్టుకునే వారు.
    ఇలా ఉండగా, ఒక రోజున వాడి తాత గారు గ్రామం నుండి మనవడిని చూసి పోదామని వచ్చేరు.  వచ్చిన రెండు మూడు రోజులకే మనవడి తీరు గమనించారు.ఎలాగయినా, వాడి బద్ధకాన్ని వదిలించాలనుకున్నారు.మాటలతో చెబితే వినేరకం కాదని, కథలు చెప్పే నెపం మీద వాడిలో మార్పు తేవాలనుకున్నారు.   ఎలాంటి పిల్లలయినా కథలంటే చెవి కోసుకుంటారు కదా !
    ‘‘ మనవడా !నాకు మంచి కథలు బోలెడు వచ్చు ... తెలుసా ! రోజూ నా భోజనం కాగానే నా మంచం దగ్గరకి రా ! నీకు ఆ కథలన్నీ చక్కగా చెబుతాను.
అయితే,  నేను నిద్ర పోక ముందే రావాలి సుమా ! పడుకుంటే నేను మరి లేవను గాక లేవను!  నువ్వు రావడం ఒక్క నిముషం లేటయినా, ఆ రోజు ఇక నీకు కథ లేనట్టే ! గుర్తుంచుకో ! ’’అని  ఆ రోజు దయమే మనవడికి చెప్పారు.
   ఆ రోజు బళ్ళో తోటి స్సేహితులందరికీ ఈ విషయమే గొప్పగా చెప్పాడు రాముడు. తాత చెప్పే కథలను రోజూ వారికి చెబుతానని  గొప్పలు పోయాడు.
    కథలంటే పడి చచ్చే రాముడు రాత్రి వేళ తాత గారి మంచం దగ్గరకి చేరే వాడు. కానీ , వాడికి ఏ పనైనా ఆలస్యం చేసే అలవాటు ఉంది కదా !  ఆ అలవాటు కొద్దీ  ఆ రాత్రి వేళ ఆలస్యంగా తాత గారి దగ్గరకు కథ చెప్పంచు కోడానికి చేరాడు.
‘‘ తాతా, కథ చెప్పవూ ?’’ అనడిగేడు. కానీ తాత గారు ‘‘ మనవడా ! భోజనం చేసి పడుకోబోతున్నాను ... నిద్ర ముంచుకు వస్తోంది. నీ కోసం ఎంత సేపటి నుండీ చూస్తున్నానో తెలుసా ! ఇప్పుడా, రావడం ! ఒక్క నిముషం ముందొచ్చినా బాగుండేది ... మరిప్పుడు కథా లేదు, కాకరకాయా లేదు !  పోయి పడుకో !’’ అని ముసుగు తన్నేశారు !  రాముడు నిరాశగా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
      మర్నాడు బడిలో తాత చెప్పిన కథేమిటని అడిగిన స్నేహితుల ముందు రాముడు తెల్ల ముఖం వేసాడు. అందరూ‘‘ రాముడు అబద్ధాల కోరు!’’ అని గేలి చేసారు. రాముడు చిన్న బుచ్చుకున్నాడు. మర్నాడు తప్పకుండా తాత గారి చేత కథ చెప్పించుకుని, దానిని అందరికీ చెబుతానని పౌరుషంగా ప్రతిఙ్ఞ చేసాడు రాముడు.
    కానయితే, వాడి సహజ సిద్ధమయిన బద్ధకం వల్ల ఆ రోజు రాత్రి కూడా తాత గారు నిద్ర పోకుండా తాత గారి మంచం దగ్గరకి చేర లేక పోయేడు. తాత గారిని తట్టి లేపి ,తప్పయి పోయిందని ఎంత బ్రతిమాలినా, తాత గారు ముసుగు తీయలేదు. ఆ మర్నాడు కూడా బడిలో రాముడికి స్నేహితుల ముదు  అవమానం తప్ప లేదు. ఇలా నాలుగయిదు రోజులు గడిచాయి. తాత గారు తనకి చెప్ప బోయే కథలు వారికి చెబుతానంటూ స్నేహితు దగ్గర గప్పాలు కొడుతున్న రాముడు, కథ చెప్పమంటే బిక్క ముఖం వేస్తూ ఉండడంతో మిత్రులంతా వాడిని ఆటపట్టించడం మొదలు పెట్టారు. దానితో వాడికి పట్టుదల పెరిగింది. తన తప్పు తెలుసుకున్నాడు.
     తాత గారి భోజనం అయీ అవడంతోనే అతని మంచం దగ్గరకి చేరడం మొదలు పెట్టాడు. వాడిలో వచ్చిన మార్పునకు సంతోషించి తాత గారు వాడికి మంచి మంచి కథలు రోజూ రాత్రిళ్ళు చెప్పే వారు.
     వాటిని రాముడు బడిలో తన స్నేహితులకి చెప్పి, వారి మెప్పు పొందే వాడు.
      ఈ విధంగా రాముడికి అప్పటి నుండీ చక్కని సమయపాలన

       ఇప్పుడు రాముడు నిజంగానే బుద్ధిమంతుడు !