7, సెప్టెంబర్ 2014, ఆదివారం

మరుగుజ్జుల రాజ్యంలో మహా రాజు దిగులు



   మరుగుజ్జుల రాజ్యంలో మహా మంత్రి రాజు కన్నా బెత్తెడు పొడుగు.  
    రాజు అది సహించ లేక పోయే వాడు. మహా మంత్రి తన కన్నా పొడుగ్గా ఉండడం రాజుకి నచ్చేది కాదు ! అదతనికి అవమానకరంగా తోచేది. లోపల పలే అసూయతో కుమిలి పోతూ ఉండే వాడు.మహా మంత్రిని ఆ  ఆ పదవి నుండి తొలిగించాలని అనుకున్నాడు. అయితే, తాత ముత్తాతల కాలం నుండీ తమ రాజ్యానికి మహా మంత్రిగా  అతనే ఉంటూ ఉండడంతో , ఏ కారణమూ లేకుండా తీసెయ్యడం ఎలాగో రాజుకి తెలియ లేదు. 
   మరుగుజ్జుల రాజ్యంలో ప్రజలు మాత్రం అంగుష్ఠ మాత్రులు. అంటే, చేతి బొటన వ్రేలంత వారన్నమాట ! మహా మంత్రి  మాత్రం తనకన్నా పొడుగ్గా ఉండడం సహించ లేని రాజుకి రోజు రోజుకీ దిగులు ఎక్కువ కాసాగింది. ఆ దిగులుతో రాజు నానాటికీ చిక్కి పోసాగేడు. ఆరోగ్యం క్షీణించి పోసాగింది.రాజు రాను రాను ఎందుకంత దిగులుతో కుమిలి పోతున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు.
.రాజ వైద్యులు రకరకాలచికిత్సలు చేసి చూసారు. కానీ ఫలితం లేక పోయింది. విదూషకులు కూడా రాజుని రకరకాలుగా నవ్వించి ఉత్సాహ పరచాలని ఎంతగానో ప్రయత్నించే వారు. కానీ ప్రయోజనం లేకపోయింది.  దిగులుతో రాజు రాజ్య పాలన సరిగ్గా చేయ లేక పోతూ ఉండే వాడు. రాజ్యంలో పరి పాలన కుంటు పడింది. కరువు కాటకాలూ, అరాచకమూ ఎక్కువ కాసాగింది.
   అంతే కాకుండా , రాజు గారి తీరు మరీ ఆశ్చర్యకరంగా తయారయింది. ఎప్పుడూ తన ఎత్తయిన గద్దె నుండి ప్రజలు , పరివారం చూస్తూ ఉండగా దిగే వాడు కాడు. ఇతర మంత్రుల కన్నా కూడా నేలబారుగా ఉండే సింహాసనం వేయించి , దాని మీద కూర్చోమని మహా మంత్రిని ఆఙ్ఞాపించాడు.మహా మంత్రికి ఇది తీరని అవమానంగా తోచేది.అయినా, మౌనంగానే భరిస్తూ వచ్చేడు. రాజు గారి అంతరంగం అర్ధం కాక అంతా తలలు పట్టు కున్నారు.రాజు గారు రాచ నగరులో విహారం చేసేటప్పుడూ, వేటకి వెళ్ళినప్పుడూ కూడా మహా మంత్రిని తనకి చాలా వెనుకగా, దూరంగా నడవమని ఆదేశించాడు. క్రమేపీ మహా మంత్రికి రాజు పడుతున్నఅవస్థ అర్ధమయింది.
    ఇలా ఉండగా , ఒక రోజు రాజు పరివారంతో వేటకి బయలు దేరాడు. యథా ప్రకారంగా మహా మంత్రి రాజుకి చాలా వెనుకగా నడవసాగేడు. వేట జరుగుతోంది. అలా సాయంత్రమయింది. మహా మంత్రి తన కంటె బాగా వెనక పడి పోవడాన్ని తనివితీరా చూడాలని రాజు ఒక చోట ఆగి వెనుతిరిగి  చూసాడు. చాలా వెనుక, అక్కడ మహా మంత్రి ఒక కర్రతో తన నీడను తానే కొడుతూ ఉండడం కనిపించింది  రాజుకి ఆశ్చర్యం కలిగింది. మహా మంత్రికి మతి కానీ చలించిందా ! అనుకున్నాడు.అతని చర్యకు కారణ మేమిటని బిగ్గరగా అరచి అడిగాడు.
        దానికి మహా మంత్రి ఇలా జవాబు చెప్పాడు : ‘‘ ప్రభువులుమన్నించాలి ! ఈ సాయంకాలపు నీరెండ చూడండి ... నాతో ఎప్పటికీ సాటి రాలేని నా నీడఎంత పొడుగ్గా ఉందో ? ! అందుకే దాని పొగరు అణచడానికి దండిస్తున్నాను ! ’’ అన్నాడు.
     ‘‘ మీ నీడే కదా !దానినెందుకూ దండించడం !’’ అనడిగేడు రాజు ఆశ్చర్యపోతూ.
దానికి మహా మంత్రి ‘‘ అవును ప్రభూ ! ఈ సాయంకాలపు నీరెండ నా ముందు నాకంటె పొడుగ్గా ఉండడం నేను ఎలా సహించ గలను చెప్పిండి ...నాకది తీరని అవమానం కాదా ? ఏలిన వారు దయతో ఆలోచించాలి ..’’ అన్నాడు.
   రాజుకి మహా మంత్రి ఏమి చెప్పదలచు కున్నాడో గతమయింది.
సాయంకాలపు నీరెండ ఉడిగి పోతున్న వయసుకి ఆనవాలుగా రాజుకి తోచింది.నీడ ఎలా ఉన్నప్పటికీ, అది మనిషికి సాటి రాలేదు.
   మహా మంత్రి పట్ల తన వైఖరికి రాజుకి సిగ్గు కలిగింది. రాజు అప్పటి నుండి తన మనసు మార్చు కున్నాడు. మహా మంత్రిని తగు విధంగా గౌరవించడం మొదలు పెట్టాడు.
    రాజు మనసుకుదుట పడింది..
     అప్పటి నుండి రాజ్యమూ తిరిగి కళకళలాడింది !

కామెంట్‌లు లేవు: