13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఫలించిన ప్రయోగం





వెంకటాపురంలో సోమయ్య, కామయ్య అనే అన్నదమ్ములు ఉండే వారు. చిన్నవాడయిన కామయ్య మాయ మాటలు చెప్పి అందరినీ  మోసగిస్తూ వారి వద్ద గల ధనాన్ని అయినకాడికి దోచుకుంటూ ఉండే వాడు.అప్పుడప్పుడు ఇళ్ళలోజొరబడి దొంగతనాలు చేస్తూ విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. అన్నగారయిన సోమయ్య మాత్రం తనకి ఉన్న దానితో సంతృస్తి చెంది లాగో బతుకును నెట్టుకొస్తూ ఉండే వాడు. బతకడం చేత కాని వాడని అన్నగారిని కామయ్య తరచుగా ఆక్షేపిస్తూ ఉండే వాడు.సోమయ్య భార్య కూడా మరిది మాటలతో ఏకీభవించి భర్తనిసూటి పోటి మాటలతో వేధిస్తూ ఉండేది. దాంతో సోమయ్యకి ఇంట్లో మనశ్శాంతి కరువయింది.మానసికంగా క్రుంగి పోయేడు. తిన్నది హితవు కాక నీరసించి పోయేడు. దానితో ఎవరూ అతనిని పని లోకి పిలిచే వారు కాదు. సోమయ్య తన వేదనని ఒక రోజు గుడి పూజారి  వారికి చెప్పుకుని భోరుమని విలపించాడు.
   పూజారి చాలా సేపు ఆలోచించి అతనికి ఒక సలహా ఇచ్చాడు.  పూజారి ఇచ్చిన సలహా ప్రకారం ఒక రోజు సోమయ్య తమ్ముడిని పిలచి ఇలా అన్నాడు : ‘‘ తమ్ముడూ ! మన గుడి పూజారి వారు అత్యవసరంగా పొరుగూరు వెళ్ళ వలసి ఉందిట. ఈ ఒక్క రాత్రికి దేవుడి నగలను ఎలా భద్ర పరచాలా అని ఆందోళన చెందు తున్నారు.  సమయానికి ఆలయ ధర్మ కర్త వారు కూడా ఊళ్ళో లేరు. అందు చేత నగల పెట్టెను ఈ రాత్రికి నా యింట ఉంచమని కోరుతున్నారు. మా ఇంటి గురించి నీకు తెలుసు కదా. దాదాపు శిధిలావస్థలో ఉంది. భద్రత లేదు. అందు వలన దేవుడి నగల పెట్టెను ఈ రాత్రికి మీ ఇంట్లో భద్ర పరచి మనం ఇద్దరం వంతుల వారీగా మేలుకుని కాపాలా కాద్దాం. ఏమంటావు .’’ అనడిగాడు. ఆ మాటలతో కామయ్య ఎగిరి గంతేసినంత పని చేసాడు. వాడికి దేవుడి నగలు కాజేసే అవకాశం దొరికిందని మహదానంద పడి పోయాడు.  వెంటనే సరేనన్నాడు.
       ఆ రాత్రి కామయ్య ఇంట్లో అన్నదమ్ములిద్దరూ గుడి పూజారి ఇచ్చిన దేవుడి నగల పెట్టెకు వంతుల వారీగా మేలుకుని కాపాలా కాయసాగేరు. అర్ధ రాత్రి అయ్యేక, కాపాలా బాధ్యత తమ్ముడికి అప్పగించి అన్న గారయిన సోమయ్య నిద్రకు ఉపక్రమించి నిద్ర నటించాడు. అదే అదునుగా కామయ్య నగల పెట్టెను చంకన పెట్టుకుని ఇంటి నుండి ఉడాయించేడు. తెల్ల వారే వరకూ చాలా దూరం పరుగెత్తుకుంటూ పోయి, ఒక చోట ఆగి పెట్టె తెరచి చూసాడు.
ఇంముంది ! ఆ పెట్టెలో నగలు లేవు ! గులక రాళ్ళూ, రప్పలూ ఉన్నాయి.కోపంతో చిందు వేస్తూ ఇంటికి వచ్చేడు. వచ్చే ముందు ఎందుకయినా మంచిదని అన్నగారిని నమ్మించడం కోసం ఒంటి మీద బట్టలు చించుకుని, కొద్దిపాటి గాయాలు చేసుకున్నాడు. వస్తూనే ఏడుస్తూ అన్నగారితో ఇలా అన్నాడు: ‘‘ అన్నయ్యా ! నువ్వు నిద్ర పోయాక  నా ఇంట దొంగలు జొరబడ్డారు. నగల పెట్టె బలవంతంగా లాక్కుని నగలన్నీ కాజేసి ఖాళీ పెట్టె నా ముఖాన విసిరి కొట్టారు. అరవకుండా నా నోరు నొక్కేసారు. నన్ను ఊరవతల అడవి లోకి బరబరా లాక్కుని వెళ్ళి వదిలేసారు ’’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలు కల్పించి చెప్పాడు.
      అంతకు ముందు నిద్ర నటిస్తున్న అన్న గారు తమ్ముడు నగల పెట్టె తీసుకుని పరారు కాగానే అతని ఇంట్లో ఊరి వాళ్ళ నుండి దోచుకున్న ధనాన్ని తమ్ముడి ఇంట్లో ఎక్కడెక్కడ దాచినదీ బయటకి తీసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గుడి పూజారి వారి ఇంటికి చేర్చాడు. తెల్లారేక ఎవరి సొమ్ము వారికి అందేలా పూజారి వారు ఏర్పాటు చేసి ఉంచేరు.
   తమ్ముడు దేవుడి నగలను దొంగలు ఎత్తు కెళ్ళారని క్ల బొల్లి మాటలు చెప్పగానే సోమయ్య ఇలా అన్నాడు: ‘‘ అవును తమ్ముడూ ! దొంగల్లో కొందరు నిన్ను లాక్కు పోయారా ? మరి కొందరు నీ ఇంట డబ్బూ దస్కం మొత్తం కాజేసారు చూడు !’’ అని. అన్న గారి మాటలు వింటూనే  కామయ్య తను డబ్బు దాచిన చోట్లన్నీ వెతికి ఖాళీగా ఉండడంతో లబోదిబో మన్నాడు.
సోమయ్య తమ్ముడిని ఓదారుస్తూ ‘‘ ఊరుకో తమ్ముడూ!  దేవుడి నగలతో పాటు. ఎంతో కష్ట పడి నువ్వు సంపాదించిన డబ్బు కూడా పోయింది.అంతా మన తలరాత !’’ అన్నాడు.
     అన్న గారి మాటలతో కామయ్య తేలు కుట్టిన దొంగలా నోరు మెదప లేక ఉండి పోయేడు !
దేవుడి నగలను దోచుకుందామనే తన దుర్బుద్ధి కారణంగానే పెట్టె లోని నగలు మాయమై పోయి గులక రాళ్ళు ఉన్నాయనీ, అంతే కాక ఊరి ప్రజలను దోచుకుని తను కూడ బెట్టినదంతా కూడా పోయిందనీ , యిదంతా దైవ మహిమ అనీ వాడికి అనిపించింది. భయంతో లెంపలు వాయించుకున్నాడు. ఆ నాటి నుండి వాడిలో పరివర్తన కలిగింది. మంచి వాడిగా మారి, ఊరిలో మంచి వాడిగా పేరు తెచ్చు కున్నాడు.
  తమ ప్రయోగం ఫలించినందుకు గుడి పూజారి, సోమయ్యలు ఆనందించేరు !

3, జనవరి 2015, శనివారం

హస్తవాసి



గురివిందాడ అగ్రహారంలో ఇద్దరు వైద్యులు ఉండే వారు. వారిలో ఒకరు భిషగ్రత్న భైరవ మూర్తి. మరొకరు వైభవ మూర్తి.  వారిలో భైరవ మూర్తి వైద్య శాస్త్ర గ్రంథాలను  క్షుణ్ణంగా ఔపోసన పట్టిన వాడు. వైద్యంలో ఆరితేరిన వాడు. ఆ అహంకారం అతనిలో ఎక్కువగా ఉండేది. తన దగ్గరకు వచ్చిన రోగులను చిన్న చూపు చూస్తూ వారితో దురుసుగా ప్రవర్తించే వాడు. మాటలతో భయ పెట్టే వాడు. వైభవ మూర్తి మాత్రం అరకొరగా వైద్యం నేర్చుకుని, తనకు తెలిసినంతలో వైద్యం చేసే వాడు. అసాధారణ మయిన రోగం వస్తే మాత్రం రోగ నిదానం ఎలా చేయాలో తెలియక సతమత మవుతూ ఉండేవాడు. అలాంటి స్థితిలో కూడా అతనిచ్చిన ఔషధాలు , అతని ఓదార్పు మాటలు చక్కగా పని చేసి రోగాలు తగ్గి పోతూ ఉండేవి. త్వరలోనే అతని హస్తవాసి మంచిదని పేరు వచ్చింది. అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య పెరగడమే కాక, అంతు లేని ధనం కూడా వచ్చి నడుతూ ఉండేది. నానాటికీ భైరవ మూర్తి దగ్గరకు వచ్చే రోగులే కరువయ్యారు. అతని ఆర్ధిక సరిస్థితి కూడా క్షీణించి పోసాగింది.  దానితో అతనిలో అసహనం మరింత పెచ్చు పెరిగి పోయేది. అయిన దాదనికీ కాని దానికీ రోగుల మీద విరుచుకు పడి పోతూ ఉండే వాడు. దానితో వచ్చే వారి ఆ పాటి రోగులు సైతం రావడం తగ్గించి వేసారు ! వైభవ మూర్తికి వైద్యంలో ఏమంత పట్టు లేక పోయినా అతని దగ్గరకు అంత మంది రోగులు ఎందుకు వెళ్తున్నారో అర్ధం కాక భైరవ మూర్తి  జుట్టు పీక్కునే వాడు.
     ఇలా ఉండగా, వైభవ మూర్తికి అంతు పట్టని  వింత రోగమేదో  దాపురించింది. సొంత వైద్యం పనికి రాక పోగా వికటించింది. ఇక లాభం లేదనుకుని చేసేది లేక అతను భైరవ మూర్తి దగ్గరకు వచ్చి, తనను రోగం నుండి కాపాడ మని అతని కాళ్ళు పట్టు కున్నాడు. భైరవ మూర్తి అతనికి వైద్యం చేసి త్వరలోనే అతని రోగం కుదిర్చాడు.  అయితే , అందుకు ప్రతిఫలంగా ఊరు విడిచి ఎక్కడి కయినా పొమ్మని ఆదేశించాడు.
  అందుకు వైభవ మూర్తి నవ్వి, ‘‘ మిత్రమా ! నేను ఊరు విడిచి వెళ్ళి పోతే నాలాంటి వాడు మరొకడు ఈ ఊరికి రాకుండా పోడు.  నా వల్ల నీకు యిబ్బంది కలిగిన మాట వాస్తవం. నిజం చెప్పాలంటే, వైద్యంలో నీకున్న ప్రతిభా పాటవాల ముందు నేను గడ్డి పరకను. కానీ నా హస్తవాసిమంచిదనీ, నాకు వైద్యం బా తెలుసుననీ రోగులు అధిక సంఖ్యలో నా వద్దకు వస్తున్నారు. దానితో వైద్యం శాస్త్రం లో విశేష ప్రతిభ గల నీ వద్దకు వచ్చే రోగులే కరువయ్యారు. అసహనం, అహంకారం అనే అంతశ్శత్రువులే నీ అభివృద్ధికి ఆటంకాలు. ఊరి నుండి నన్ను కాదు, ముందు నీ మనసులోనుండి వాటిని తరిమెయ్ !వైద్యుడిచ్చే ఔషధాలతో పాటు రోగులకు వైద్యుని పట్ల విశ్వాసం ఉండాలి. వైద్యుని ప్రేమ పూర్వక వచనాలు వారి రోగాన్ని సగం పోగొడతాయి. నిజానికి నువ్వు ఏ రోగాలకు ఏ మందులు ఇస్తున్నావో నా చెవిని వేయడానికి నా సొంత మనుషులను నీ వద్దనీకు తెలియకుండా ఉంచేను. అవే మందులను నేను నా రోగులకు ఇచ్చే వాడిని దానికి తోడు వారితో చాలా మంచిగా ఉండే వాడిని ఇదే నా విజయ రహస్యం !నాకు వైద్యం చేసి తిరిగి కోలుకునేలా చేసావు కనుక ఆ కృతఙ్ఞతతో నీకీ విషయం చెబుతున్నాను. విద్యతో పాటు లోక తంత్రం తెలియని వాడెవ్వడూ లోకంలో రాణించ లేడు సుమా ! ఇక నుండి నీ పద్ధతి మార్చుకో ! నీకు ఎదురుండదు ... నీ నీడన చిన్న చిన్న రోగాలకు వైద్యం చేస్తూ నేనూ నా జీవనం గడుపుతాను.’’ అని అన్నాడు.
         వైభవ మూర్తి మాటలతో భైరవ మూర్తిలో అనూహ్య మైన మార్పు వచ్చింది. ఆ నాటి నుండి అతని దగ్గరకి వచ్చే రోగుల సంఖ్య ఇబ్బడి ముబ్బిడిగా పెరిగి పోయింది. ఆ ప్రాంతాలలో  హస్తవాసి ఉన్న వైద్యునిగా అతనికి గొప్ప పేరు వచ్చింది. అతని సహాయకునిగా చేరి వైభవ మూర్తి కూడా అతని నుండి వైద్య శాస్త్రంలోని మెళకువలు చాలా నేర్చు కున్నాడు.
   ఒకరి కొకరు తోడుగా వైద్య సేవలు అందిస్తూ ఉండడంతో ఆఊరి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది.
ఇప్పుడా ఊరికి సుదూర ప్రాంతాల నుండి కూడా మంచి వైద్యం కోసం వస్తున్నారు తెలుసా !

25, డిసెంబర్ 2014, గురువారం

రాజ కుమారి పెళ్ళి !



అవంతీ రాజ్యాన్ని పాలించే రాజు అసమర్ధుడు కావడంతో రాచ వ్యవహారాలన్నీ అతని చిన్న రాణి కుముదినీ దేవి నిర్వహించేది. పట్టపు రాణి ఏదో వింత వ్యాధి దాపురించి, అకాల మరణం చెందింది. దానితో ఆమె ఒక్కగా నొక్క కూతురు వినోదిని తల్లి లేని పిల్లయి పోయింది. చిన్న రాణి ఆమెను నానా బాధలూ పెట్టేది. చిన్న రాణి పెట్టే బాధలు భరించ క వినోదిని  నిత్యం ఏడుస్తూ  కాలం గడిపేది. రాజు చిన్న రాణిని వారించ లేక సతమత మయ్యే వాడు. చిన్న రాణి పెట్టే  బాధలు  భరించ లేక వినోదిని  ఒక రోజు అడవి లోకి పారి పోయింది.
   చాలా సేపు అడవిలో ఎక్క డెక్కడో తిరిగి, నీరసంతో ఓపిక నశించి, చీకటి పడే వేళకి అక్కడ వో పెద్ద పాడు పడిన భవనం కనిపిస్తే అందు లోకి వెళ్ళింది. అక్కడ వొక పాత కాలపు పెద్ద పందిరి మంచం కనిపిస్తే, దాని మీద వాలి పోయి,ఒళ్ళెరక్కుండా నిద్ర పోయింది.
    ఆ పాడు పడిన భవనంలో చాలా ఏళ్ళుగా ఒక బ్రహ్మ రాక్షసి ఉంటోంది.  అది ఆ రాత్రి వస్తూనే తన మంచం మీద ఎవరో అపురూప లావణ్యవతి పడుకుని ఉండడం చూసింది. కోపంతో ఆ పిల్లని చంపి తినెయ్యాలని అనుకుంది.కాని,  దాని కప్పుడు ఆకలి అంతగా లేదు. అదీ కాక, అమాయికంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని వెంటనే చంపెయ్యడం దానికి ఇష్టం లేక పోయింది. నిద్ర లేపి ఆ పిల్ల వివరాలు తెలుసు కోవానుకుంది. వినోదిని నిద్ర లేస్తూనే మ్రహ్మ రాక్షసిని చూసింది. తనని చూసికూడా ఆ పిల్ల ఏమాత్రం భయపడక పోవడం బ్రహ్మ రాక్షసికి ఆశ్చర్యం కలిగించింది.
‘‘ అమ్మాయీ !నన్ను చూస్తూనే మీ నరమానవులందరూ వజవజా వణికి పోతారు. కానీ నువ్వు కించిత్తు కూడా భయ పడడం లేదు. కారణం ఏమిటి !?’’ అని అడిగింది. దానికి వినోదిని బ్రహ్మ రాక్షసితో ఇలా అంది : ‘‘ నాకో సవతి తల్లి ఉంది. ఆమె పెట్టే  బాధలు అంతా ఇంతా కాదు. ఆమె కనిపిస్తే చాలును ! నాకు పై ప్రాణాలు పైనే పోతాయి ! ఆవిడంటే కలిగే భయం ముందు నాకు ఇంకేవీ అంతగా భయ పెట్టవు !’’ అంటూ తన సవతి తల్లి పెట్టే హింసల గురించి ఏకరువు పెట్టింది. దానితో బ-హ్మ రాక్షసి మనసు కరిగి పోయింది. వెంటనే వినోదినికి తినడానికి మంచి ఆహారం సమకూర్చి, ఆమె సేద తీరాక, ఆమెకు ఒక మాయా దర్పణం, ఒక మాయ జలతారు చీర, మాయా పాద రక్షలు ఇచ్చి ధైర్యంగా కోటకు తిరిగి వెళ్ళమంది.
    వినోదిని కోటకు తిరిగి వెళ్ళడానికి మొదట భయ పడినా,ధైర్యం కూడదీసుకుని రాచ నగరుకి చేరు కుంది.  తిరిగి వచ్చిన వినోదినిని చూస్తూనే చిన్న రాణి కోపంతో ఊగి పోయింది. నానా దుర్భాషలూ ఆడింది.  కాని వినోదిని తన వెంట తెచ్చిన వస్తువులను చూసి కాస్త నిదానించింది. అవన్నీ వినోదిని నుండి లాక్కుంది. ముందుగా అందంగా మెరిసి పెతున్న మాయ జలతారు చీరని ముచ్చట పడి కట్టుకుంది.  అంతే ! ఆమె శరీరమంతా పొడలు పొడలుగా మారి పోయింది.  అది గమనించని చిన్న రాణి, ఆ మాయ జలతారు చీరలో తన అందం మాయా దర్పణంలో చూసుకోవాలనుకుంది. అంతే ! అద్దంలో తన వికృతాకారం చూసి కెవ్వు మంది. ఈ లోగా రాజు అక్కడికి వచ్చి, వికృతాకారంలో ఉన్న చిన్న రాణిని పోల్చు కోలేక, తక్షణం కోట వదలి పొమ్మని ఆదేశించేడు.  చిన్న రాణి రాజుతో  తన గురించి చెప్పాలనుకున్నా,  ఆమె గొంతు పెగల్లేదు! ఆమె భోరున ఏడుస్తూ మాయా పాద రక్షలను ధరించింది.  అంతే ! ఏదో ఒక వింత శక్తి  విసురుగా ఆమెను లాక్కు పోయి  సుదూర తీరంలో ఒక దట్ట మయిన అడవిలో పడవేసింది !
     అప్పటి నుండి రాకుమారి వినోదినికి సవతి తల్లి బాధలు తప్పాయి ! రాజు కూడా ఆమెను నిర్భయంగా ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు. కొద్ది రోజులకే ఉజ్జయినీ రాజ కుమారునితో వివాహంజరిపించాడు..
      ఆ పెళ్ళికి ఆకాశమంత పందిరి ! భూ దేవంత ముగ్గు వేసారు ! మణి దీపాల కాంతులు రాత్రీ పగలు అనే తేడా లేకుండా చేసాయి ! మంగళ వాయిద్యాలూ. వేద మంత్రాలూ మారు మ్రోగి పోయాయి ! రాచ కుటుంబాల వారూ, పుర జనులూ , వారూ వీరని కాదు ఇసక వేస్తే రాలనంత మంది అతిథులతో కళకళలాడి పోయింది పెళ్ళి పందిరి !
   ఇక ఐదు రోజుల  ఆ పెళ్ళి వేడుకలో వడ్డించిన నవకాయ పిండి వంటల రుచులంటారా ?
   అబ్బో !  నేను చెప్ప లేను బాబూ !

       

22, డిసెంబర్ 2014, సోమవారం

ఊడల మఱ్ఱి !

ఉజ్జయినికి సమీపంలో కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. అందులో ఒక పెద్ద ఊడల మఱ్ఱి చెట్టు ఉండేది. దానిని అందరూ దెయ్యాల చెట్టు అనే వారు. దాని మీద ఒక బ్రహ్మరాక్షసి ఆ దారంట వెళ్ళే వారిని పీక్కు తినేదిట. ఎంతో అవసరం పడితే తప్ప, ఆ దారంట వెళ్ళడానికి ఎవరూ సాహసించే వారు కాదు ! ఇలా ఉండగా, ఆనందుడు అనే వాడు ఒక సారి జరూరుగా ఆదారంట వెళ్ళ వలసి వచ్చింది. అప్పటికే చీకటి పడింది. భయంతో వణికి పోతూ గబగబా నడవసాగేడు. ఆ చెట్టు దగ్గరకి వచ్చే సరికి, వాడికి ఒక వికటాట్టహాసం వినిపించింది. ఆనందుడికి ముచ్చెమటలు పోసాయి. కొయ్యబారిపోయి నిబడి పోయాడు. బ్రహ్మరాక్షసి పెద్ద గొందుకతో ఇలా అంది : ‘‘ ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం ! నేనిప్పుడే రెండు పెద్ద బర్రెలను తిని ఉన్నాను. ఆకలిగా లేదు. అలాగని వాటంగా దొరికిన నరమాంసాన్ని వదులు కోలేను ! నిన్ను తరవాత తింటాను. నేను ఈ ఊడల మఱ్ఱిని పట్టుకుని చాలా ఏళ్ళుగా ఉంటున్నాను. విసుగేస్తోంది. మరో చోటికి ఎక్కడికేనా వెళ్ళాలని ఉంది. అయితే, ఈ ఊడల మఱ్ఱి తనకి ఎన్ని ఊడలు ఉన్నాయో సరిగ్గా లెక్క కట్టి చెబితే కానీ వదలనంటూ పట్టుకుని ఉంది. నాకా, లెక్కలు సరిగా రావు ! అందు చేత, దీనికి ఎన్ని ఊడలు ఉన్నాయో లెక్క కట్టి చెబితే ఎక్కడికయినా హాయిగా వెళ్ళాలని ఉంది. అంతే కాదు, ఊడల లెక్క సరిగ్గా చెబితే, నిన్ను తినకుండా వదిలి పెడతాను. ’’ అంది. ఆనందుడు దొరికిన అవకాశాన్ని ఉసయోగించు కోవాలనుకున్నాడు. దీనంగా ముఖంపెట్టి, ఇలా అన్నాడు : ‘‘ దీని ఊడలు అసంఖ్యాకంగా ఉన్నాయి. చాలా దూరం వరకూ వ్యాపించి ఉన్నాయి. వాటిని లెక్క పెట్టు కుంటూ అంతదూరం నడవాలంటే నాకు శక్తి చాలదు !’’ అని. మ్రహ్మ రాక్షసి మరేం ఆలోచించకుండా వాడికి గాలిలో ఎగురుతూ వెళ్ళే శక్తినిచ్చే ఒక మంత్ర దండం ఇచ్చింది. దానిని అందుకుంటూ ఆనందుడు బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు : ‘‘ సరే ! దీని ఊడలు ఎన్ని ఉన్నాయో సరిగ్గా లెక్క పెట్టుకుని వస్తాను. అయితే, ఒక దీనికి ఒక నియమం ఉంది. నేను తిరిగి వచ్చే వరకూ నువ్వు ఎంతో నియమ నిష్ఠలతో ఉండాలి ! ఎలాంటి జంతు హింసా చేయ కూడదు ! ఈ నియమం తప్పావో, అక్కడ నా లెక్క తప్పుతుంది ! మళ్ళీ మొదటికి వస్తుంది ! జాగ్రత్త ! ’’ అన్నాడు. తెలివి తక్కువ బ్రహ్మరాక్షసి సరేనంది ! ఆనందుడు మంత్ర దండం సాయంతో అక్కడ నుండి మాయమైపోయేడు ! బ్రహ్మ రాక్షసి మాత్రం, ఆనందుడికి ఇచ్చిన మాట ప్రకారం మాంసాహారం మానివేసి. సరైన తిండీ తిప్పలూ లేక, నానాటికీ కృశించి పోయి బాగా బలహీన పడి పోయింది. ఇప్పుడు దానికి కదలడానికే కాదు ... మాట్లాడడానికి కూడా శక్తి చాలడం లేదు ! ఇప్పుడా దారి వెంట వెళ్ళే వారికి బ్రహ్మ రాక్షసి వలన ఏ ప్రమాదమూ లేదు! కావాలంటే మీరూ నిర్భయంగా వెళ్ళొచ్చు. ఊడల మఱ్ఱి చెట్టు అందాలను చూడొచ్చును !

11, డిసెంబర్ 2014, గురువారం

నమ్మకం గెలిపిస్తుంది ! అప నమ్మకంఓడిస్తుంది !




అశ్వ సేనుడు అవంతీ రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో, ఒక ఏడాది తీవ్రమయిన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. నెలల తరబడి వొక్క వర్షపు చుక్క కూడా పడడం లేదు. భూములన్నీ బీడు వారి పోయేయి. ప్రభువుల ధనాగారం కూడా నానాటికీ తరిగి పోసాగింది. తిండికి కరువు రావడంతో రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది. దారి దోపిడీలూ, దొంగతనాలూ పెచ్చు పెరిగి పోయేయి. ప్రజలు రాజ శాసనాలను ధిక్కరించే పరిస్థితి ఏర్పడింది. అశ్వ సేనుడి పాలన పట్ల ప్రజలకు నమ్మకం సడలి పోసాగింది.  రాజులో కూడా నానాటికీ అసహనం ఎక్కువ కాసాగింది. ఆకలికి తట్టుకో లేక పెట్టే ఆర్తుల మొర ఆలకించడం మానేసాడు. మీదు మిక్కిలి కఠిన దండనలు విధించ సాగేడు. అధిక పన్నులు వేయ సాగేడు.  దాంతో రాజ్యంలో అరాచకంమరింత పెరిగి పోయింది ! పరిస్థితి చెయ్యి దాటి పోతున్నదని మహా మంత్రి గమనించాడు. రాజ్యంలో అరాచక పరిస్థితుల నివారణకు తగిన పరిష్కారం కనుగొనడానికి వో సారి తపోవనవాసులయిన మునిజనం వద్దకు వెళ్ళి రమ్మని మహా మంత్రి, రాజ గురువు రాజుకి సలహా యిచ్చారు. అందుకు సమ్మతించి అశ్వ సేనుడు కొద్ది పాటి సైన్యంతో అటవీ ప్రాంతానికి బయలుదేరాడు.
      అరణ్య ప్రాంతంలో ప్రవేశించగానే , అక్కడి వాతావరణం చూసి రాజు చకితుడయ్యేడు ! అక్కడ అంతా పచ్చగా ఉంది. మునులూ, వారి శిష్యులూ పుష్ఠిగా వింత తేజస్సుతో వెలిగి పోతున్నారు !  రాచ నగరుకి అతి సమీపంలో ఉండే అటవీ భూములలో రాచ నగరులో వలె కరువు కాటకాలు లేక, అంతా పచ్చగా ఉండడానికి కారణం మునులను  ఇలా అడిగాడు.  ‘‘ మునులారా! ఈ ఆశ్రమ ప్రాంతం మా రాజ నగరుకి ఏమంత దూరంలో లేదు. కానీ అక్కడి కంటె భిన్న మయిన పిరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ అటవీ ప్రాతం కూడా నా ఏలుబడిలో ఉన్నదే కదా ! అతిసమీప ప్రాంతాలయినఈ రెడంటికీ నడుమ ఇంత తేడా ఎలా వచ్చింది ?’’ అనడగాడు.
    మునులు నవ్వి , ‘‘ రాజా ! ఇప్పుడు చూడు ! లా కనిపిస్తోందో !’’ అన్నారు.
రాజు చుట్టూ తేరిపార చూసాడు. ఆశ్చర్యం !  అక్కడి వాతావరణం రాచ నగరు కంటె భిన్నంగా ఏమీ లేదు ! కరువు అక్కడా తాండవిస్తోంది.  రాజుకి అంతా అయోమయంగా తోచింది.
    అప్పుడు మునులు రాజుతో ఇలా అన్నారు : ‘‘ మహా రాజా ! ఆపదలో ఉన్న మిమ్ములను మునుల మయిన మేము ఒడ్డెంక్కించ గలమనే నమ్మకంతోనే నువ్వు ఇక్కడకి వచ్చేవు. అందు వల్లనే నీకలా గోచరించింది. అంతే. దేనికయినా నమ్మకమే ప్రధానం ! ఈ కరువు పరిస్థితులు ఇక ఎన్నాళ్ళో ఉండవు. వెళ్ళి, నీప్రజలలో నీ పాలన పట్ల నమ్మకం కలిగించు. నమ్మకం గెలిపిస్తుంది. అప నమ్మకం ఓటమికి దారి చూపిస్తుంది !  వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించు. అప్పుడు అరాచకం తగ్గుతుంది ’’
   రాజు మునుల వద్ద శలవు తీసుకుని, రాజధానికి తిరిగి వచ్చి, మునులు చెప్పినట్టే తన ఏలుబడి పట్ల ప్రజలలో నమ్మకం కుదురు కునేలా చేశాడు.
  త్వరలోనే రాజ్యమంతటా విస్తారంగా వానలు కురిసాయి !
    రాజ్యం సుభిక్షమయింది !