3, జనవరి 2015, శనివారం

హస్తవాసిగురివిందాడ అగ్రహారంలో ఇద్దరు వైద్యులు ఉండే వారు. వారిలో ఒకరు భిషగ్రత్న భైరవ మూర్తి. మరొకరు వైభవ మూర్తి.  వారిలో భైరవ మూర్తి వైద్య శాస్త్ర గ్రంథాలను  క్షుణ్ణంగా ఔపోసన పట్టిన వాడు. వైద్యంలో ఆరితేరిన వాడు. ఆ అహంకారం అతనిలో ఎక్కువగా ఉండేది. తన దగ్గరకు వచ్చిన రోగులను చిన్న చూపు చూస్తూ వారితో దురుసుగా ప్రవర్తించే వాడు. మాటలతో భయ పెట్టే వాడు. వైభవ మూర్తి మాత్రం అరకొరగా వైద్యం నేర్చుకుని, తనకు తెలిసినంతలో వైద్యం చేసే వాడు. అసాధారణ మయిన రోగం వస్తే మాత్రం రోగ నిదానం ఎలా చేయాలో తెలియక సతమత మవుతూ ఉండేవాడు. అలాంటి స్థితిలో కూడా అతనిచ్చిన ఔషధాలు , అతని ఓదార్పు మాటలు చక్కగా పని చేసి రోగాలు తగ్గి పోతూ ఉండేవి. త్వరలోనే అతని హస్తవాసి మంచిదని పేరు వచ్చింది. అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య పెరగడమే కాక, అంతు లేని ధనం కూడా వచ్చి నడుతూ ఉండేది. నానాటికీ భైరవ మూర్తి దగ్గరకు వచ్చే రోగులే కరువయ్యారు. అతని ఆర్ధిక సరిస్థితి కూడా క్షీణించి పోసాగింది.  దానితో అతనిలో అసహనం మరింత పెచ్చు పెరిగి పోయేది. అయిన దాదనికీ కాని దానికీ రోగుల మీద విరుచుకు పడి పోతూ ఉండే వాడు. దానితో వచ్చే వారి ఆ పాటి రోగులు సైతం రావడం తగ్గించి వేసారు ! వైభవ మూర్తికి వైద్యంలో ఏమంత పట్టు లేక పోయినా అతని దగ్గరకు అంత మంది రోగులు ఎందుకు వెళ్తున్నారో అర్ధం కాక భైరవ మూర్తి  జుట్టు పీక్కునే వాడు.
     ఇలా ఉండగా, వైభవ మూర్తికి అంతు పట్టని  వింత రోగమేదో  దాపురించింది. సొంత వైద్యం పనికి రాక పోగా వికటించింది. ఇక లాభం లేదనుకుని చేసేది లేక అతను భైరవ మూర్తి దగ్గరకు వచ్చి, తనను రోగం నుండి కాపాడ మని అతని కాళ్ళు పట్టు కున్నాడు. భైరవ మూర్తి అతనికి వైద్యం చేసి త్వరలోనే అతని రోగం కుదిర్చాడు.  అయితే , అందుకు ప్రతిఫలంగా ఊరు విడిచి ఎక్కడి కయినా పొమ్మని ఆదేశించాడు.
  అందుకు వైభవ మూర్తి నవ్వి, ‘‘ మిత్రమా ! నేను ఊరు విడిచి వెళ్ళి పోతే నాలాంటి వాడు మరొకడు ఈ ఊరికి రాకుండా పోడు.  నా వల్ల నీకు యిబ్బంది కలిగిన మాట వాస్తవం. నిజం చెప్పాలంటే, వైద్యంలో నీకున్న ప్రతిభా పాటవాల ముందు నేను గడ్డి పరకను. కానీ నా హస్తవాసిమంచిదనీ, నాకు వైద్యం బా తెలుసుననీ రోగులు అధిక సంఖ్యలో నా వద్దకు వస్తున్నారు. దానితో వైద్యం శాస్త్రం లో విశేష ప్రతిభ గల నీ వద్దకు వచ్చే రోగులే కరువయ్యారు. అసహనం, అహంకారం అనే అంతశ్శత్రువులే నీ అభివృద్ధికి ఆటంకాలు. ఊరి నుండి నన్ను కాదు, ముందు నీ మనసులోనుండి వాటిని తరిమెయ్ !వైద్యుడిచ్చే ఔషధాలతో పాటు రోగులకు వైద్యుని పట్ల విశ్వాసం ఉండాలి. వైద్యుని ప్రేమ పూర్వక వచనాలు వారి రోగాన్ని సగం పోగొడతాయి. నిజానికి నువ్వు ఏ రోగాలకు ఏ మందులు ఇస్తున్నావో నా చెవిని వేయడానికి నా సొంత మనుషులను నీ వద్దనీకు తెలియకుండా ఉంచేను. అవే మందులను నేను నా రోగులకు ఇచ్చే వాడిని దానికి తోడు వారితో చాలా మంచిగా ఉండే వాడిని ఇదే నా విజయ రహస్యం !నాకు వైద్యం చేసి తిరిగి కోలుకునేలా చేసావు కనుక ఆ కృతఙ్ఞతతో నీకీ విషయం చెబుతున్నాను. విద్యతో పాటు లోక తంత్రం తెలియని వాడెవ్వడూ లోకంలో రాణించ లేడు సుమా ! ఇక నుండి నీ పద్ధతి మార్చుకో ! నీకు ఎదురుండదు ... నీ నీడన చిన్న చిన్న రోగాలకు వైద్యం చేస్తూ నేనూ నా జీవనం గడుపుతాను.’’ అని అన్నాడు.
         వైభవ మూర్తి మాటలతో భైరవ మూర్తిలో అనూహ్య మైన మార్పు వచ్చింది. ఆ నాటి నుండి అతని దగ్గరకి వచ్చే రోగుల సంఖ్య ఇబ్బడి ముబ్బిడిగా పెరిగి పోయింది. ఆ ప్రాంతాలలో  హస్తవాసి ఉన్న వైద్యునిగా అతనికి గొప్ప పేరు వచ్చింది. అతని సహాయకునిగా చేరి వైభవ మూర్తి కూడా అతని నుండి వైద్య శాస్త్రంలోని మెళకువలు చాలా నేర్చు కున్నాడు.
   ఒకరి కొకరు తోడుగా వైద్య సేవలు అందిస్తూ ఉండడంతో ఆఊరి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది.
ఇప్పుడా ఊరికి సుదూర ప్రాంతాల నుండి కూడా మంచి వైద్యం కోసం వస్తున్నారు తెలుసా !