8, అక్టోబర్ 2014, బుధవారం

ముసలి చెట్టూ, మధుర ఫలాలూ


అబ్బో, ఇప్పటిదా ఆ చెట్టు ! వందల సంవత్సరాల వయసున్న చెట్టు కాదూ,అది !! కొంత మందయితే కొంత ఎక్కువ చేసి. భూమి పుట్టిన దగ్గర నుండీ ఆ చెట్టు అక్కడ ఉందంటూ ఉంటారు కూడానూ !వాళ్ళ మాటల కేం గానీ, అంత పాత కాలం నాటి చెట్టన్నమాట అది. చాలా ఏళ్ళ పాటు అది గుబురుగా పెరిగిన కొమ్మలతో, రెమ్మలతో విరగ కాసేది. పచ్చని వెడల్పయిన పెద్ద ఆకులతో అది ఆకుల కొండలా ఉండేది. దాని మీద రకరకాల పక్షులు కిలకిలారావాలు చేస్తూ  సందడి చేసేవి. ఎక్కడి నుండో వచ్చిన బాటసారులు ని కింద చేరి హాయిగా సేదతీరే వారు. దాని పళ్ళు ఎంత తీయగా ఉండే వంటే, ఎన్ని తిన్నా తనవి తీరేది కాదు !
    అలాంటిది, ఇప్పుడా చెట్టు ముసలిదై పోయింది. కొమ్మలు ఎండి పోయేయి. పచ్చదనం పోయి, మ్రోడులా తయారయింది.  ఆకులు రాలి పోవడంతో నీడ కూడా కరువయింది. పక్షులు వేరే చోటికి వెళ్ళి పోయేయి. ఇప్పుడు నీడ కోసం దాని కిందకి ఎవరూ రావడం లేదు. కాని రోజులు దాపురించాయి. కుక్కమూతి పిందెలు కాస్తున్నాయి.ఇవాళో రేపో అవి కూడా ఉండవు.  తన పరిస్థితి తలచుకుని చెట్టుకి దుఃఖం ఆగడం లేదు. చెట్టు యజమాని కొడుకులు ఇక ఆ చెట్టుని కలప కోసం, వంట చెరకు కోసం కొట్టెయ్యాలనుకున్నారు. ఈ తరం కుర్రాళ్ళు కదా ! యజమాని మాత్రం చాలా మంచి వాడు. చెట్టు మీద గొడ్డలి పడితే, తన మెడ మీద పడ్డట్టే అని కొడుకులని హెచ్చరించాడు. దానితో వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు.
    ఒక రోజు ఒక సాధువు ఆ చెట్టు దగ్గరకి వచ్చేడు. చెట్టు ఆ సాధువుతో తన గోడు వెళ్ళబోసు కుంది. మునపటిలా తాను ఎవరికీ పనికి రాకుండా పోతున్నానని కన్నీళ్ళు పెట్టుకుంది. తన పళ్ళు కూడా ఇంతకు ముందులా తియ్యగా లేక పోవడంతో ఎవరూ కనీసం కొరికి కూడా చేడడం లేదని ఏడుస్తూ చెప్పింది. 
సాధువు దాని బాధ అర్ధం చేసు కున్నాడు. దాని ఆవేదన తీరేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించాడు.
      ఆ  సాధువు ఒక పథకం ప్రకారం చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఒక వార్తను వ్యాపించేలా చేసాడు. ఆ వార్త సుడి గాలిలా అంతటా వ్యాపించింది, అదేమిటంటే,
ఆ ముసలి చెట్టు కాసే ఫలాలో కేవలం రోజుకి ఒక్కటి మాత్రం చాలా మహిమ కలది ! ఆ చెట్టు రోజుకి ఒక్క తియ్యనైన పండును మాత్రం ఇస్తోంది ! ఆ ఒక్క పంటూ ఎవరయితే తింటారో, వారికి సకల సంపదలూ సమకూరుతాయి ! సమస్త ఆరోగ్యాలూ చేకూరుతాయి ! పిల్లా పాపలతో కలకాలం హాయిగా ఉంటారు ! ఇదీ ఆ వార్త సారాంశం !
   మునుపటిలా ఆ చెట్టు పళ్ళు తియ్యగా లేక పోయినా,వాటిలో ఏది మహిమ గల పండో తెలియక, జనం చేతికి దొరికిన దానిని ఆత్రంగా కోసుకుని తిన
సాగేరు ! మళ్ళీ అంతా తన చుట్టూ చేరుతూ ఉండడంతో ముసలి చెట్టుకి మనసు లోని బెంగ తీరి పోయింది. అదిప్పుడు మళ్ళీ ఎప్పటిలాగే  పచ్చగా కళకళలాడుతోంది. దాని ఫలాలు మునుపటి రోజుల వలె ఎంతో తియ్యగా ఉంటునాయి కూడా ! పక్షులు తిరిగి ఆ చెట్టు మీదకి చేరు కున్నాయి. పాదచారులు అక్కడే సేద తీరుతున్నారు.ముసలి చెట్టులో ఈ మార్పు అందరికీ ఆశ్చర్యం కలిగించింది! అందరితో పాటు యజమాని కూడా ఈ వింతకి చాలా ఆశ్చర్య పోయాడు.
   ఒక రోజు  యజమాని వేకువ సమయంలో ఒంటరిగా వచ్చి, ఇంత లోనే చెట్టు మళ్ళీ పచ్చగా కళకళలాడుతూ ఉండానికి కారణ మేమిటని అడిగాడు.
   దానికి చెట్టు ఇలా జవాబు చెప్పింది : ‘‘ అయ్యా !చెట్లు తమ ఫలాలను తాము తినవు. నదులు తమ జలాలను తాము త్రాగవు. నేల తల్లి తన పంటను తాను తినెయ్యదు. అవన్నీ ఇతరుల కోసమే ! పరోపకారం కోసమే. ఎప్పుడయితే నాపండ్లను జనం తినడం మానీసేరో అప్పటి నుండి నేను మ్రోడు వారి పోవడం మొదలయింది. ఎప్పుడయితే జనం తిరిగి నావద్దకు వస్తూ నా ఫలాలను తినడం తిరిగి మొదలెట్టారో, అప్పటి నుండి నాలో కొత్త జవజీవాలు  కలిగేయి.
 పరోపకారం చెయ్యడంలో ఉండే తియ్య దనమే , నా పండ్లకీ వచ్చింది !’’ అని.
సాధువు దయ వల్ల, ఆ ముసలి చెట్టు మళ్ళీ చాలా ఏళ్ళ పాటుచల్లని నీడనిస్తూ, మధురమైన పండ్లను అందిస్తూవేలాది పక్షులకు ఆలవాలమై అలరింది !

   ఆ ముసలి చెట్టు ఇచ్చే మధుర ఫలాలు అంటే ఇప్పుడు అందరికీ ఎంతఇష్టమో చెప్పలేం ! !

కామెంట్‌లు లేవు: