18, ఆగస్టు 2014, సోమవారం

ఊరి పేరు నిలపాలి ! కోతుల గూడెంలో అసంఖ్యాకంగా కోతులు ఉండేవి.  అవి ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తూ నానా హంగామా చేస్తూ ఉండేవి. కోతుల గూడెం ప్రజలకు కోతుల బెడద చెప్పనలవి కానంతగా ఉండేది. ఏ క్షణంలో ఏ కోతి వచ్చి గాయ పరుస్తందో అని బెంబేలు పడిపోతూ ఉండే వారు. అవి గుంపులు గుంపులుగా వచ్చి, చాలా బీభత్సం చేస్తూ ఉండేవి. ఇళ్ళలోకి చొరబడి, వస్తువులను చిందరవందర చేస్తూ వీరంగం  సృష్టిస్తూ ఉండేవి.  అదిలిస్తే మీద పడి రక్కేవి.వాటి అల్లరీ ఆగంతో కోతుల గూడెం ప్రజలకు రాత్రిళ్ళు నిద్ర కూడా కరువయ్యేది. దానితో నీరసం కమ్ముకొచ్చి డీలా పడి పోయే వారు. ఒంట్లో సత్తువ  సన్నగిల్లడంతో వారు తమ రోజువారీ పనులు కూడా సక్రమంగా చేసుకో లేక పోయే వారు.  కోతుల బెడద ఎలా వదిలించు కోవాలో తెలియక దిగులు చెందే వారు.
    ఇలా ఉండగా, ఒక రోజు ఆ ఊరికిఒక సాధువు వచ్చేడు. గ్రామ ప్రజలు అతనికి రామాలయంలో ఆశ్రయం కల్పించేరు.
      అలా సాధువుకి ఆశ్రయం కలిపించాక, కోతుల గూడేనికి కొత్త ఆపద వొకటి వచ్చి పడింది. మునుపెన్నడూ లేని విధంగా గ్రామంలోని ఇళ్ళలో  దొంగతనాలు విరివిగా జరుగు తున్నాయి. ఎవరి కంటా పడకుండా  ఎవరో లాఘవంగా ఇళ్ళలోకి జొరబడి అందినకాడికి దోచుకు పోతున్నారు. కోతుల బెడదతో పాటూ ఈ దొంగల బాధేమిటని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పగలంతా  కోతుల బెడదతోఅలసి పోయిన ప్రజలు రాత్రిళ్ళు  ఒళ్ళెరక్కుండా నిద్ర పోతున్నారు. దాంతో దొంగల పని తేలికవుతోంది !
చాలా రోజులు ఈ బాధలు అనుభవించేక వారి ఓర్పు నశించి పోయింది.
దొంగల బెడద తగ్గాలంటే, ఊరి శివార్లలో ఇరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం స్థాపించడమే సరైనదని వారికి సాధువు చెప్పాడు. సరే అంటే సరే అనుకుని, ఊరి ప్రజలు చందాలు వేసుకుని ఆంజనేయ  స్వామి విగ్రహం స్థాపించే బాధ్యత సాధువు మీద ఉంచేరు. చందాలు వేసుకుని , పోగయిన ధనమంతా సాధువు చేతిలో ఉంచారు,
      ఆ రాత్రే వాళ్ళిచ్చిన డబ్బుల మూటతోనూ, ఊరిలో దొంగతనం చేసిన ధనంతోనూ  సాధువు ఊరొదిలి ఎక్కడికో పలాయనం
 చిత్తగించాడు !
     ఆ వార్త తెలుసుకుని ఊరి ప్రజలంతా లబోదిబో మన్నారు. కాస్సేపటికి వారిలో వారు తర్జన భర్జనలు చేసుకుని, అసలు ఆ సాధువుని నమ్మడమే తమ తప్పిదమని తెలుసు కున్నారు.
    వంచన చేసే మనిషి బుద్ధి కోతి బుద్ధి కన్నా హేయమయినదని  వారికి అర్ధమయింది.  తాతల కాలంనుండీ తమ గ్రామలో తమతో పాటూ కోతులు కూడా సహజీవనం చేస్తున్నాయనీ, వాటి వల్లనే తమ ఊరికి కోతుల గూడెమనే పేరు వచ్చిందనీ వారికి స్ఫురించింది ! ఊళ్ళో కోతులనేవే లేకుండా చేస్తే తమ ఊరి పేరు సమసి పోతుందని వారికి తోచిం ది. కోతుల గూడెం అనే తమ ఊరి పేరు నిలపాలనుకున్నారు !
ఆ ఊరి ప్రజలు మునుపటిలా కోతులను     తరిమెయ్యకుండా, వాటి పట్ల ప్రేమతో మెలగడం మొదలెట్టారు.వాటికి రకరకాల తినుబండారాలు అందిస్తూ,ప్రతి యేటా కోతుల పండుగ పేరిట  ఉత్సవాలు కూడా నిర్వహించడం మొదలు పెట్టారు !
  మునుపు తోటల వెంటా, తోపుల వెంటా తిరిగే కోతు లన్నీ, ఇప్పుడు ఊరి ప్రజలు కొత్తగా నిర్మించిన హనుమంతుని ఆలయంతో కిచ కిచలాడుతూ,  తెగ సందడి చేస్తూ కనిపిస్తున్నాయి.
   వాటి వైభవం చూడాలంటే, మీరు వెంటనే కోతుల గూడెం వెళ్ళి తీరాలి !
కోతుల వలన మీకు ఏ ఆపదా రాదు. వస్తే గిస్తే కోతి బుద్ధి కలిగిన మనుషుల వల్లనే ... అలాంటి వారెవరయినా మీకు తారస పడితే మాత్రం ఏం జరుగుతుందో నేను చెప్ప లేను. మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది .