13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఫలించిన ప్రయోగం





వెంకటాపురంలో సోమయ్య, కామయ్య అనే అన్నదమ్ములు ఉండే వారు. చిన్నవాడయిన కామయ్య మాయ మాటలు చెప్పి అందరినీ  మోసగిస్తూ వారి వద్ద గల ధనాన్ని అయినకాడికి దోచుకుంటూ ఉండే వాడు.అప్పుడప్పుడు ఇళ్ళలోజొరబడి దొంగతనాలు చేస్తూ విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. అన్నగారయిన సోమయ్య మాత్రం తనకి ఉన్న దానితో సంతృస్తి చెంది లాగో బతుకును నెట్టుకొస్తూ ఉండే వాడు. బతకడం చేత కాని వాడని అన్నగారిని కామయ్య తరచుగా ఆక్షేపిస్తూ ఉండే వాడు.సోమయ్య భార్య కూడా మరిది మాటలతో ఏకీభవించి భర్తనిసూటి పోటి మాటలతో వేధిస్తూ ఉండేది. దాంతో సోమయ్యకి ఇంట్లో మనశ్శాంతి కరువయింది.మానసికంగా క్రుంగి పోయేడు. తిన్నది హితవు కాక నీరసించి పోయేడు. దానితో ఎవరూ అతనిని పని లోకి పిలిచే వారు కాదు. సోమయ్య తన వేదనని ఒక రోజు గుడి పూజారి  వారికి చెప్పుకుని భోరుమని విలపించాడు.
   పూజారి చాలా సేపు ఆలోచించి అతనికి ఒక సలహా ఇచ్చాడు.  పూజారి ఇచ్చిన సలహా ప్రకారం ఒక రోజు సోమయ్య తమ్ముడిని పిలచి ఇలా అన్నాడు : ‘‘ తమ్ముడూ ! మన గుడి పూజారి వారు అత్యవసరంగా పొరుగూరు వెళ్ళ వలసి ఉందిట. ఈ ఒక్క రాత్రికి దేవుడి నగలను ఎలా భద్ర పరచాలా అని ఆందోళన చెందు తున్నారు.  సమయానికి ఆలయ ధర్మ కర్త వారు కూడా ఊళ్ళో లేరు. అందు చేత నగల పెట్టెను ఈ రాత్రికి నా యింట ఉంచమని కోరుతున్నారు. మా ఇంటి గురించి నీకు తెలుసు కదా. దాదాపు శిధిలావస్థలో ఉంది. భద్రత లేదు. అందు వలన దేవుడి నగల పెట్టెను ఈ రాత్రికి మీ ఇంట్లో భద్ర పరచి మనం ఇద్దరం వంతుల వారీగా మేలుకుని కాపాలా కాద్దాం. ఏమంటావు .’’ అనడిగాడు. ఆ మాటలతో కామయ్య ఎగిరి గంతేసినంత పని చేసాడు. వాడికి దేవుడి నగలు కాజేసే అవకాశం దొరికిందని మహదానంద పడి పోయాడు.  వెంటనే సరేనన్నాడు.
       ఆ రాత్రి కామయ్య ఇంట్లో అన్నదమ్ములిద్దరూ గుడి పూజారి ఇచ్చిన దేవుడి నగల పెట్టెకు వంతుల వారీగా మేలుకుని కాపాలా కాయసాగేరు. అర్ధ రాత్రి అయ్యేక, కాపాలా బాధ్యత తమ్ముడికి అప్పగించి అన్న గారయిన సోమయ్య నిద్రకు ఉపక్రమించి నిద్ర నటించాడు. అదే అదునుగా కామయ్య నగల పెట్టెను చంకన పెట్టుకుని ఇంటి నుండి ఉడాయించేడు. తెల్ల వారే వరకూ చాలా దూరం పరుగెత్తుకుంటూ పోయి, ఒక చోట ఆగి పెట్టె తెరచి చూసాడు.
ఇంముంది ! ఆ పెట్టెలో నగలు లేవు ! గులక రాళ్ళూ, రప్పలూ ఉన్నాయి.కోపంతో చిందు వేస్తూ ఇంటికి వచ్చేడు. వచ్చే ముందు ఎందుకయినా మంచిదని అన్నగారిని నమ్మించడం కోసం ఒంటి మీద బట్టలు చించుకుని, కొద్దిపాటి గాయాలు చేసుకున్నాడు. వస్తూనే ఏడుస్తూ అన్నగారితో ఇలా అన్నాడు: ‘‘ అన్నయ్యా ! నువ్వు నిద్ర పోయాక  నా ఇంట దొంగలు జొరబడ్డారు. నగల పెట్టె బలవంతంగా లాక్కుని నగలన్నీ కాజేసి ఖాళీ పెట్టె నా ముఖాన విసిరి కొట్టారు. అరవకుండా నా నోరు నొక్కేసారు. నన్ను ఊరవతల అడవి లోకి బరబరా లాక్కుని వెళ్ళి వదిలేసారు ’’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలు కల్పించి చెప్పాడు.
      అంతకు ముందు నిద్ర నటిస్తున్న అన్న గారు తమ్ముడు నగల పెట్టె తీసుకుని పరారు కాగానే అతని ఇంట్లో ఊరి వాళ్ళ నుండి దోచుకున్న ధనాన్ని తమ్ముడి ఇంట్లో ఎక్కడెక్కడ దాచినదీ బయటకి తీసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గుడి పూజారి వారి ఇంటికి చేర్చాడు. తెల్లారేక ఎవరి సొమ్ము వారికి అందేలా పూజారి వారు ఏర్పాటు చేసి ఉంచేరు.
   తమ్ముడు దేవుడి నగలను దొంగలు ఎత్తు కెళ్ళారని క్ల బొల్లి మాటలు చెప్పగానే సోమయ్య ఇలా అన్నాడు: ‘‘ అవును తమ్ముడూ ! దొంగల్లో కొందరు నిన్ను లాక్కు పోయారా ? మరి కొందరు నీ ఇంట డబ్బూ దస్కం మొత్తం కాజేసారు చూడు !’’ అని. అన్న గారి మాటలు వింటూనే  కామయ్య తను డబ్బు దాచిన చోట్లన్నీ వెతికి ఖాళీగా ఉండడంతో లబోదిబో మన్నాడు.
సోమయ్య తమ్ముడిని ఓదారుస్తూ ‘‘ ఊరుకో తమ్ముడూ!  దేవుడి నగలతో పాటు. ఎంతో కష్ట పడి నువ్వు సంపాదించిన డబ్బు కూడా పోయింది.అంతా మన తలరాత !’’ అన్నాడు.
     అన్న గారి మాటలతో కామయ్య తేలు కుట్టిన దొంగలా నోరు మెదప లేక ఉండి పోయేడు !
దేవుడి నగలను దోచుకుందామనే తన దుర్బుద్ధి కారణంగానే పెట్టె లోని నగలు మాయమై పోయి గులక రాళ్ళు ఉన్నాయనీ, అంతే కాక ఊరి ప్రజలను దోచుకుని తను కూడ బెట్టినదంతా కూడా పోయిందనీ , యిదంతా దైవ మహిమ అనీ వాడికి అనిపించింది. భయంతో లెంపలు వాయించుకున్నాడు. ఆ నాటి నుండి వాడిలో పరివర్తన కలిగింది. మంచి వాడిగా మారి, ఊరిలో మంచి వాడిగా పేరు తెచ్చు కున్నాడు.
  తమ ప్రయోగం ఫలించినందుకు గుడి పూజారి, సోమయ్యలు ఆనందించేరు !

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
THAMMA SRINIVASA RAO చెప్పారు...

Chala bagundi

Unknown చెప్పారు...

మహాబోర్ కథ