అవంతీ రాజ్యాన్ని పాలించే రాజు అసమర్ధుడు కావడంతో
రాచ వ్యవహారాలన్నీ అతని చిన్న రాణి కుముదినీ దేవి నిర్వహించేది. పట్టపు రాణి ఏదో
వింత వ్యాధి దాపురించి, అకాల మరణం చెందింది. దానితో ఆమె ఒక్కగా నొక్క కూతురు
వినోదిని తల్లి లేని పిల్లయి పోయింది. చిన్న రాణి ఆమెను నానా బాధలూ పెట్టేది.
చిన్న రాణి పెట్టే బాధలు భరించ క వినోదిని
నిత్యం ఏడుస్తూ కాలం గడిపేది. రాజు
చిన్న రాణిని వారించ లేక సతమత మయ్యే వాడు. చిన్న రాణి పెట్టే బాధలు భరించ లేక వినోదిని ఒక రోజు అడవి లోకి పారి పోయింది.
చాలా
సేపు అడవిలో ఎక్క డెక్కడో తిరిగి, నీరసంతో ఓపిక నశించి, చీకటి పడే వేళకి అక్కడ వో
పెద్ద పాడు పడిన భవనం కనిపిస్తే అందు లోకి వెళ్ళింది. అక్కడ వొక పాత కాలపు పెద్ద
పందిరి మంచం కనిపిస్తే, దాని మీద వాలి పోయి,ఒళ్ళెరక్కుండా నిద్ర పోయింది.
ఆ
పాడు పడిన భవనంలో చాలా ఏళ్ళుగా ఒక బ్రహ్మ రాక్షసి ఉంటోంది. అది ఆ రాత్రి వస్తూనే తన మంచం మీద ఎవరో అపురూప
లావణ్యవతి పడుకుని ఉండడం చూసింది. కోపంతో ఆ పిల్లని చంపి తినెయ్యాలని అనుకుంది.కాని,
దాని కప్పుడు ఆకలి అంతగా లేదు. అదీ కాక,
అమాయికంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని వెంటనే చంపెయ్యడం దానికి ఇష్టం లేక పోయింది.
నిద్ర లేపి ఆ పిల్ల వివరాలు తెలుసు కోవానుకుంది. వినోదిని నిద్ర లేస్తూనే మ్రహ్మ
రాక్షసిని చూసింది. తనని చూసికూడా ఆ పిల్ల ఏమాత్రం భయపడక పోవడం బ్రహ్మ రాక్షసికి
ఆశ్చర్యం కలిగించింది.
‘‘ అమ్మాయీ !నన్ను చూస్తూనే మీ నరమానవులందరూ
వజవజా వణికి పోతారు. కానీ నువ్వు కించిత్తు కూడా భయ పడడం లేదు. కారణం ఏమిటి !?’’
అని అడిగింది. దానికి వినోదిని బ్రహ్మ రాక్షసితో ఇలా అంది : ‘‘ నాకో సవతి తల్లి
ఉంది. ఆమె పెట్టే బాధలు అంతా ఇంతా కాదు.
ఆమె కనిపిస్తే చాలును ! నాకు పై ప్రాణాలు పైనే పోతాయి ! ఆవిడంటే కలిగే భయం ముందు నాకు
ఇంకేవీ అంతగా భయ పెట్టవు !’’ అంటూ తన సవతి తల్లి పెట్టే హింసల గురించి ఏకరువు
పెట్టింది. దానితో బ-హ్మ రాక్షసి మనసు కరిగి పోయింది. వెంటనే వినోదినికి తినడానికి
మంచి ఆహారం సమకూర్చి, ఆమె సేద తీరాక, ఆమెకు ఒక మాయా దర్పణం, ఒక మాయ జలతారు చీర,
మాయా పాద రక్షలు ఇచ్చి ధైర్యంగా కోటకు తిరిగి వెళ్ళమంది.
వినోదిని కోటకు తిరిగి వెళ్ళడానికి మొదట భయ పడినా,ధైర్యం కూడదీసుకుని రాచ
నగరుకి చేరు కుంది. తిరిగి వచ్చిన
వినోదినిని చూస్తూనే చిన్న రాణి కోపంతో ఊగి పోయింది. నానా దుర్భాషలూ ఆడింది. కాని వినోదిని తన వెంట తెచ్చిన వస్తువులను చూసి
కాస్త నిదానించింది. అవన్నీ వినోదిని నుండి లాక్కుంది. ముందుగా అందంగా మెరిసి
పెతున్న మాయ జలతారు చీరని ముచ్చట పడి కట్టుకుంది.
అంతే ! ఆమె శరీరమంతా పొడలు పొడలుగా మారి పోయింది. అది గమనించని చిన్న రాణి, ఆ మాయ జలతారు చీరలో
తన అందం మాయా దర్పణంలో చూసుకోవాలనుకుంది. అంతే ! అద్దంలో తన వికృతాకారం చూసి కెవ్వు
మంది. ఈ లోగా రాజు అక్కడికి వచ్చి, వికృతాకారంలో ఉన్న చిన్న రాణిని పోల్చు కోలేక,
తక్షణం కోట వదలి పొమ్మని ఆదేశించేడు. చిన్న రాణి రాజుతో తన గురించి చెప్పాలనుకున్నా, ఆమె గొంతు పెగల్లేదు! ఆమె భోరున ఏడుస్తూ మాయా
పాద రక్షలను ధరించింది. అంతే ! ఏదో ఒక
వింత శక్తి విసురుగా ఆమెను లాక్కు
పోయి సుదూర తీరంలో ఒక దట్ట మయిన అడవిలో
పడవేసింది !
అప్పటి నుండి రాకుమారి వినోదినికి సవతి తల్లి బాధలు తప్పాయి ! రాజు కూడా
ఆమెను నిర్భయంగా ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు. కొద్ది రోజులకే ఉజ్జయినీ రాజ
కుమారునితో వివాహంజరిపించాడు..
ఆ
పెళ్ళికి ఆకాశమంత పందిరి ! భూ దేవంత ముగ్గు వేసారు ! మణి దీపాల కాంతులు రాత్రీ
పగలు అనే తేడా లేకుండా చేసాయి ! మంగళ వాయిద్యాలూ. వేద మంత్రాలూ మారు మ్రోగి పోయాయి
! రాచ కుటుంబాల వారూ, పుర జనులూ , వారూ వీరని కాదు ఇసక వేస్తే రాలనంత మంది
అతిథులతో కళకళలాడి పోయింది పెళ్ళి పందిరి !
ఇక ఐదు
రోజుల ఆ పెళ్ళి వేడుకలో వడ్డించిన నవకాయ
పిండి వంటల రుచులంటారా ?
అబ్బో
! నేను చెప్ప లేను బాబూ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి