9, నవంబర్ 2014, ఆదివారం

అపాత్ర దానం !


అవంతీ పురాన్ని పాలించే రాజు గుణ శేఖరుడు గొప్ప దాన గుణం కలవాడు. అతని చేతికి ఎముక లేదని అందరూ చెప్పుకునే వారు. యాచకుల పాలిట కల్ప వృక్షంలా ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా కాదనే వాడు కాదు. దాంతో ఆ రాజ్యంలో యాచకుల సంఖ్య తామర తంపరగా పెరిగి పోయింది. రాజ్యంలో ప్రజలందరూ ఒట్టి సోమరులయ్యేరు. రాజు గారిచ్చే దానాలతో వారికి సుఖంగా గడిచి పోతూ ఉండేది. ఊర్లో ఎక్కడ చూసినా, రాజు గారు స్థాపించిన చిత అన్న దాన సత్రవులే !  అక్కడ ముప్పూటలా అన్న దానం జరుగుతూ ఉండేది. ఇలా రాజు గారు క్రిందా మీదా చూడకుండా దానాలు చేస్తూ ధనం ధారాళంగా వ్యయం  చేయడంతో కోశాగారం ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది. ప్రధాన మంత్రి వివేక వర్ధనుడు ఇదంతా గమనించి ఆందోళన చెందాడు. ఎలాగయినా పరిస్థితి చక్క దిద్దా లనుకున్నాడు. మహా రాజుని కలుసుకుని,  దాన గుణం  ప్రభువులకు ఉచితమే కానీ,  అనుచిత దానాలూ, అపాత్ర దానాలూ చేటు తెస్తాయని ఎంతగానో నచ్చ చెప్పి చూసాడు. భాండాగారంలో ధనం నిల్వలు తగ్గి పోతాయనీ, అదే అదనుగా శత్రువులు రాజ్యం మీదకి దండెత్తి వచ్చే ప్రమాదం ఉందనీ ఎంతగానో వివరించి చెప్పాడు. అయితే,  రాజు మంత్రి మాటలు విన లేదు.  సరికదా, అతని మీద ఆగ్రహించి,  మంత్రి పదవి నుండి తొలగించి, రాజ్య బహిష్కారం శిక్ష విధించాడు !
మహా మంత్రి బాధ పడుతూ రాజాఙ్ఞ తల దాల్చి రాజ్యం విడిచి వెళ్ళి పోయాడు.
    అయితే, వివేక వర్ధనుడు రాజ్యం విడిచి దూరంగా ఏమీ వెళ్ళి పో లేదు. కొంత మంది నమ్మకస్థులయిన పరివారంతో రాజధానికి సమీపంలోనే అడవిలో రహస్యంగా ఉంటూ వచ్చేడు.  తగిన సమయం చూసి రాజుకి కళ్ళు తెరిపించాలని పొంచి ఉన్నాడు.  కొంత కాలం గడిచాక, వివేక వర్ధనుడు గుణ నిధి రాజ్యమంతటా వ్యాపించేలా ఒక పుకారు లేవదీసాడు. శత్రురాజులంతా ఏకమై ఒక్క సారిగా గుణ నిధి రాజ్యం మీదకి దండెత్తి రాబోతున్నారని పుకారు పుట్టించాడు. రాజు తన వేగులను సమావేశ పరచి ఆ వార్త గురించి అడిగాడు.  రాజు చాలా కాలంగా దాన ధర్మాంటూ రాజ్య పాలనను నిర్లక్ష్యం చేడంతో వేగులు కూడా తమ విదుల పట్ల అంతే అలసత్వంతో ఉంటున్నారు. అంచేత వాళ్ళు అందు లోని నిజానిజాలు పరిశీలించ కుండానే అది నిజమేనని రాజుకి చెప్పారు ! దానితో రాజులో ఆందోళన ఎక్కువయింది.  కోశాగారం పూర్తిగా ఖాళీ అయింది. జీత భత్యాలు  అందక సైనికులు నిస్తేజంగా ఉన్నారు.  వాళ్ళు తన కోసం నిండు మనసుతో పోరాడుతారో, లేదో తెలియదు !  ప్రజలంతా కూడా ఒట్టి పోమరులుగా తయారయ్యేరు. రాజుకి ఏమీ తోచ లేదు.
      ఈ పరిస్థితిలో మంత్రి వివేక వర్ధనుడు మారు వేషంలో రాజు వద్దకు వచ్చేడు.  రాజుతో ఇలా అన్నాడు :  ‘‘ మహా రాజా ! నేను లోగడ తమ నుండి అపార ధనరాశులను కానుకగా పొంది ఉన్నాను. ఇప్పుడు రాజ్యం తీవ్రమయిన సంక్షోభంలో పడి ఉందని తెలుస్తోంది.  అందు చేత తమరు నాకు లోగడ ఇచ్చిన ధనం యావత్తూ తమకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే, ప్రభువులు మన్నించాలి. యుద్ధం ముగిసేక,  నేనిచ్చిన ధనానికి రెట్టింపు ధనం తమరు నాకు ఇప్పించ వలసినదిగా కోరు తున్నాను.  మన రాజ్యంలో తమ నుండి కానుకలు పొందిన వారంతా ఇలాగే చేస్తే తమ కోశాగారం నిండటమే కాక, శత్రువులతో యుద్ధం చేయడం తేలికవుతుంది.  యుద్ధం ముగిసాక ఎలాగూ వారిచ్చిన ధనానికి తమరు రెట్టింపు ధనం ఇవ్వనున్నారు కనుక ఎవరూ సంశయించ కుండా ఆ ఆశతోనయినా తాము లోగడ మీనుండి పొందిన ధనం తెచ్చి తమకు సమర్పిస్తారనే నా నమ్మకం ! ’’ అని చెప్పాడు.  రాజు కోశాగారం నిండడానికి మరో మార్గం లేదు కనుక, అందుకు సరేనని రాజ్యమంతాటా ఆ మేరకు చాటింపు వేయించాడు.
    చిత్రం ! రోజులు గడుస్తున్నాయి కానీ, ఏ ఒక్కరూ రాజ్యానికి నిధులు సమకూర్చడం లేదు ! కారణం ఏమై ఉంటుందా ! అని రాజు ఆరాతీసాడు. యుద్ధంలో రాజు గెలుస్తాడని  నమ్మకం ఏమిటి ?           గెలిచినా, మనకి తిరిగి రెట్టింపు ధనం ఇస్తాడని ఏమిటి నమ్మకం ! అని ప్రజలంతా భావిస్తున్నట్టుగా గ్రహించాడు !
    దానితో రాజుకి మనసంతా వికలమై పోయింది.  రాజ్యం విడిచి పెట్టి అడవులకు వెళ్ళి పోవాలని నిశ్చయించు కున్నాడు. సరిగ్గా ఆ దశలో  మంత్రి వివేక వర్ధనుడు రాజు ఎదుట పడి ఇలా అన్నాడు : ‘‘ రాజా ! తమ అనుమతి లేకుండా తమ ఎదుటికి వచ్చినందుకు మన్నించాలి ! ఇప్పుడు మన రాజ్యానికి వచ్చిన ఆపద ఏమీ లేదు ! ఇదంతా నేను కల్పించిన పుకారు !  మన శత్రు రాజ్యాలలో కూడా మన రాజ్యంలో మీవలన లబ్ధి పొందిన ప్రజలంతా తమకు అపారమయిన ధనరాశులు  సమకూరుస్తున్నారనీ,  మన రాజ్యం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రాణ త్యాగం చెయ్యడానికి కూడా తమ వెంట ఉన్నారని పుకారు లేవ దీసాను ! దానితో  ఇక ముందు కూడా మన దేశం మీదకి దండెత్తి రావడానికి ఎవరూ  సాహసించ లేరు ! ఇప్పటికయినా ప్రభువులు వాస్తవాన్ని గమనిస్తారని
 ఆశిస్తాను ! ’’ అని ముగించాడు.
   గుణ వర్ధనుడు మహా మంత్రి మాటలతో పరివర్తన చెందాడు. రాజ ధర్మంగా దానాలు చేయడం మాన లేదు కానీ,  అపాత్ర దానాలు చేయడం  మాత్రం మాను కున్నాడు. వివేక వర్ధనుని తిరిగి తన కొలువులో  మహా మంత్రిగా నియమించాడు.
       అవంతీ రాజ్యం త్వరలోనే సుభిక్ష మయింది !

2, నవంబర్ 2014, ఆదివారం

జగడాల పల్లె !



జగడాల పల్లె అసలు పేరు పద్మా పురం.  ఒకప్పుడు ఆగ్రామంలో పట్టుమని పది గడపలు కూడా ఉండేవి కావు. కానీ ఆఇళ్ళ వారికి ఎప్పుడూ ఒకరంటే ఒకరికి పడేది కాదు !  ఎప్పుడూ ఎందుకో ఒకందుకు గొడవలు పడుతూనే ఉండే వారు. ప్రతి చిన్న విషయానికీ ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దువ్వుతూ ఉండే వారు.  అందుచేత ,చుట్టు ప్రక్కల గ్రామాల వారికి ఆఊరంటే చులకన భావం ఏర్పడి పోయింది.  ధర్మా పురాన్ని అందరూ జగడాల పల్లె అని వేళాకోళం చేస్తూ ఉండే వారు.
        పద్మా పురానికి చెందిన వర్ధన రావు అనే యువకుడికి మాత్రం తమ గామ ప్రజల ప్రవర్తన తల కొట్టేసినట్టుగా ఉండేది. చాలా సంవత్సరాలు పెద్ద చదువుల కోసం పెద్ద పట్టణాలలో గడిపాడేమో, , వాడిలో  లోకానుభవం వల్ల చక్కని సంస్కారం ఏర్పడింది. గ్రామస్థుల కజ్జాకోరు తనం వల్ల ఊరికి చెడ్డ పేరు వస్తోందని వాడు దిగులు చెందుతూ ఉండే వాడు. మంచిగా చెప్తే వాళ్ళు వినరని అతడికి తెలుసు. ఏదో విధంగా ఊరి ప్రజలలో మార్పు తీసుకుని రావాలని అతడు నిర్ణయించు కున్నాడు.
     ఇలా ఆలోచించి, ఒక రోజు రాత్రి ఎవరూ చూడకుండా ఒక తోడేలు బొమ్మ ఉండే పతాకాన్ని ఒక యింటి కప్పు మీద ఉంచేడు.  దానితో ఆ ఇంటి యజమాని భయపడి పోయి మర్నాడు ఉదయాన్నే  వర్ధన రావు దగ్గరకి వచ్చి ఆ విషయం చెప్పాడు. గోవర్ధన రావు అతని భయం మరింత రెట్టింపు అయ్యేలా మాట్లాడేడు.  అదేదో అరిష్ట పతాకంలా ఉందని అన్నాడు. దాని విషయమై తాను పట్నం వెళ్ళి ప్రముఖ సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుని వస్తానని అభయమిచ్చాడు. హమ్మయ్య ! ఆ పని త్వరగా చేద్దూ, నీకు పుణ్యం ఉంటుంది ! ’’అని  బ్రతిమాలి అతడు వెళ్ళి పోయేడు.
     ఆ తరువాత అలాగే వరుసగా ప్రతి రాత్రీ అందరి ళ్ళ మీదా అలాంటి పతాకాలే ఉంచడం మొదలు పెట్టాడు వర్ధన రావు. భయంతో తన దగ్గరకి పరుగెతు కొచ్చిన అందరికీ  అవి అరిష్ట పతాకాలే ! అని నమ్మబలికే వాడు. దానితో ఊరంతా గగ్గోలెత్తి పోయింది ! వాటి విషయమై వెంటనే పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కు రమ్మని అతని మీద  ఒకరోకరే ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు.  ఇదిగో, అదిగో ! అంటూ వర్ధన రావు వారిని ప్రతి రోజూ త్రిప్పి పంపించేస్తున్నాడు. దానితో ఊరి వాళ్ళు విసిగి పోయేరు.  ఇక లాభం లేదని, వొక రోజు ఆ ఇళ్ళ జమానులందరూ కలసి కట్టుగా వర్ధన రావు దగ్గరకి వచ్చి దీనంగా ఇలా వేడు కున్నారు : ‘‘ అరిష్ట పతాకాల గురించి పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కు రమ్మని  అడిగితే ఇన్ని రోజులూ వెళ్తానంటూనే జాప్యం చేస్తున్నావు !  మన గ్రామంలో చదువు కున్న వాడివి నువ్వొక్కడివే. మేం ఎవరం ఎప్పుడూ పట్నం మొహం చూసి రుగని
వాళ్ళం ! పట్నం భోగట్టాలు తెలిసిన వాడివని నీ సాయం కోరితే, నువ్వేమో రోజుల తరబడి దాట వేస్తున్నావు. అరిష్ట పతాకాల వల్ల మా ఎవరికీ రాత్రిళ్ళు కంటికి నిద్ర పట్టడం లేదు ! భయతోం వణికి పోతున్నాం ! పట్నం బయలుదేరకుండా ఆలస్యం చేస్తున్నావు. నీకిది ధర్మంగా లేదు సేమా ! ’’ అని నిష్ఠూర మాడేరు.
     వారి మాటలు విని వర్ధన రావు కోపం నటిస్తూ  వారితో ఇలా అన్నాడు :
‘‘ మీలో మీకు ఎప్పుడూ సఖ్యత లేదు ! ఎప్పుడూ దేనికో ఒక దానికి కీచులాడుకుంటూ ఉంటారు. మన గ్రామం పరువు మంట కలుపు తున్నారు. మీకు కష్టం వచ్చింది కనుక, ఇప్పుడు మాత్రం అంతా ఒకటిగా  నా దగ్గరకి వచ్చేరు. ఈ కష్టం ఒడ్డెక్కాక మళ్ళీ మామూలుగా మీలో మీరు దెబ్బలాడుకుంటూ ఉంటారు.  అంచేత,  ఇప్పుడు మీకు నేను మాత్రం మీకు ఎందుకు సాయం చేయాలి. వెళ్ళి రండి ! ’’ అని కసిరి చెప్పాడు.
    దానితో కంగు తిన్న గ్రామస్థులు ముక్త కంఠంతో ఇక మీదట అలా ప్రవర్తించమనీ,  అంతా కలసి మెలసి ఉంటామనీ ప్రమాణం చేసారు. తమ తప్పులు మన్నించి, వెంటనే పట్నం వెళ్ళి అరిష్ట పతాకాల గురించి తెలుసుకుని రమ్మని వేడు కున్నారు.
    అప్పుడు వర్ధన రావు నవ్వి ఇలా చెప్పాడు : ‘‘అరిష్ఠ పతాకాలు అనేవి ఒక మూఢ విశ్వాసం ! అవి నేను పెట్టిన పతాకాలు ! మీలో భయం కలిగించి, మీ మధ్య సఖ్యత కలిగించడం కోసమే నేను వాటిని మీ ఇళ్ళ మీద ఉంచేను ! మూఢ నమ్మకం విషయంలోనే భయంతో ఒకటైన మీరు మన ఊరికి చెడ్డ పేరు రాకుండా కలసి మెలసి ఉండ లేరూ ! ’’ అన్నాడు.
      వర్ధన రావు మాటలతో ఊరి ప్రజలలో మంచి మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇదివరకటిలా తగవు లాడు కోవడం లేదు. చక్కగా కలసి మెలసి ఉంటున్నారు.
        జగడాల పల్లెను వోసారి  చూసొద్దామని అనుకుంటున్నారేమో  ! అదిప్పుడు కుదిరే పని కాదు ! . ఎందుకంటే పద్మా పురానికి జగడాల పల్లె అని వచ్చిన చెడ్డ పేరు ఇప్పుడు  పూర్తిగా తొలగి పోయింది !
 అంత సఖ్యంగా  జనాలుండే గ్రామం ఇప్పుడు ఆఫిర్కా లోనే లేదంటే నమ్మండి !

31, అక్టోబర్ 2014, శుక్రవారం

కుక్క కాటుకి చెప్పు దెబ్బ !


కంటకా పల్లిలో నారాయణడనే వాడు ఉండే వాడు. అతడు వట్టి జగడాలమారి.  అందరితోనూ నిష్కారణంగా ఎందుకో ఒకందుకు తగవులు పెట్టుకుంటూ ఉండే వాడు. అందు చేత అతనికి ఆ ఊర్లో స్నేహితులనే వారే లేకుండా పోయేరు,.
      ఇలా ఉండగా, ఒక రోజు నారాయణ ప్రక్క ఇంటి లోకి ఆనందుడు అనే వ్యక్తి అద్దెకి దిగాడు. అతనికి నారాయణ గురించి మీ తెలియక పోవడంతో,  అతనిని పలుకరిద్దామని  గోడ మీ నుండి నారాయణ ఇంటి వేపు చూసేడు.  ఆ రోజు నారాయణ ఇంట్లో ఏదో శుభ కార్యం జరుగుతోంది.  ఇంట్లో పిండి వంటలు వండు తున్నారు. ఆ ఘుమఘుమలు ఆనందుని ముక్కు పుటాలకు తగిలాయి.  ఇంతలో నారాయణ ఇంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఆనందుడు తనను తాను అతనికి పరిచయం చేసు కుంటూ ఇలా అన్నాడు : ‘‘ మేము ఈ దినమే
ఈ ఇంట్లో అద్దెకు దిగాము.  నా పేరు ఆనందుడు, మీతో పరిచయం కోరు కుంటున్నాను.  ఇవాళ మీ ఇంట్లో ఏదో విశేషం ఉన్నట్టుగా ఉందే !  వంటకాల వాసనలు కమ్మగా  ముక్కుకి తగులు తున్నాయి !మా ఆవిడా పిల్లలూ కూడా అదే అంటున్నారు ! ’’ అన్నాడు మెచ్చుకోలుగా.
      అంతే ! నారాయణ ఉగ్రరూపం ధరించాడు !శివాలెత్తి పోయేడు.  ‘‘ మేం ఎంతో ఖర్చు చేసి పదార్ధాలు తెచ్చుకుని వంటలు చేసుకుంటూ ఉంటే, వాటి వాసలు పీల్చి మీరంతా కడుపు నింపు కుంటున్నారా ? ! సిగ్గు లేదూ ! మా వంటల వాసనలు పీలిస్తే, మా వంటలు మెక్కి నట్టే ! అంచేత, మీ తిండికి అయిన  ఖర్చంతా ఇచ్చి తీర వలసినదే ! ’’ అంటూ గొడవ చేసాడు.  ఆ మాటలతో ఆనందుడికి తల తిరిగి పోయింది.  నోట మాట రాలేదు. చాలా సేపు ఇద్దరి మధ్యా గొడవ జరిగేక,  వాళ్ళూ వీళ్ళూ కలుగ జేసుకుని సర్ది చెప్పడంతో  అప్పటికి ఆ తగువు  సద్దు మణిగింది.  ఆనందుడు తన జీవితంలో ఇలాంటి జగడాలమారిని చూడ లేదనుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళి పోయేడు. ఎలాగయినా, నారాయణకి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించు కున్నాడు.
      ఆ తర్వాత ఓ  దినం ఆనందుడు బజారు వీధిలో ఎండ వేళ  ఒక చోట నిలబడి ఉండగా,  ఏదో పని మీద అక్కడికే వచ్చిన నారాయణ కూడా అతని ప్రక్కనే నిలబడ వలసి వచ్చింది.  అంతే  !  ఆనందుడు అతని చెంప ఛెల్లు మనిపించాడు ! అంతటితో ఆగకుండా ఇలా అరవడం మొదలు పెట్టాడు :
‘‘ బుద్ధి లేదూ ! నా మీద కాలు పెట్టి నిలుచుంటావా ! నా నీడ మీద కాలు పెట్టి నిలుచున్నావంటే, నా మీద కాలు పెట్టి నిలుచున్నట్టే.  నా నీడను త్రొక్కితే నన్ను త్రొక్కినట్టే.  నా నీడను అవమానిస్తే నన్ను అవమానించినట్టే ...’’ అంటూనే మరి రెండు దెబ్బలు వేసాడు. అనుకోని ఈ సంఘటని నారాయణ బిక్క చచ్చి పోయేడు. చుట్టూ జనం సోగయి, ఏం జరిగింటూ అడిగారు.  ఆనందుడు  లోగడ తన ఇంటి వంటకాల వాసనల గురించి నారాయణ తనతో గొడవ పెట్టుకోడం గురించి  చెప్పి. వారితో ఇలా అన్నాడు : ‘‘చూడండి ! ఇతగాడు నా నీడను త్రొక్కి  నిలబడ్డాడు. అంటే నన్ను అవమానించి నట్టే కదా ! అందుకే  కొట్టేను ! ’’ అన్నాడు.    అతని మాటల్లోని అంతరార్ధం అర్ధమై  ‘‘ కుక్క కాటుకి చెప్పు దెబ్బ !’’ అనుకుంటూ అందరూ గొల్లున నవ్వేరు. నారాయణని తిట్టి పోసారు.  దాంతో  నారాయణకి పొగరంతా అణగి పోయింది. అప్పటి నుండి , తన ధోరణి మార్చు కున్నాడు. 
    నోరు మంచి దయితే , ఊరు మంచి దవుతుందంటారు కదా !
    ఇప్పుడు నారాయణకి ఊరంతా స్నేహితులే తెలుసా !!


29, అక్టోబర్ 2014, బుధవారం

గుణ పాఠం !


మానాపురం అనే ఊళ్ళో భూమయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండే వాడు. అతనికి లెక్క లేనంత సిరి సంపదలు ఉండేవి. కాని, పరమ లోభి. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టే వాడు కాదు.అయితే, అతడు తన పిసినారి తనాన్ని పది మంది ముందూ వెల్లడి కాకుండా జాగ్రత్త పడే వాడు.
   ఒక సారి అతని దగ్గరకి రామయ్య అనే పేద  రైతు వచ్చి, తన కుమార్తె పెళ్ళికి వెయ్యి రాపాయలు  తక్కువ పడ్డాయనీ, అంచేత వో వెయ్యి రూపాయలు అప్పుగా ఇమ్మని అర్ధించాడు. ఆ సమయంలో భూమయ్య చుట్టూ ఊరి పెద్దలు చాలా మంది కూర్చుని ఉన్నారు.  అందరి మధ్య  రామయ్యని లేదు పొమ్మనడం కుదరక, భూమయ్య ఇరుకున పడ్డాడు. మింగా లేక, కక్కా లేక తన భావాలను ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు.
    రామయ్య అడిగిన వెయ్యి రూసాయలూ అతనికి ఇస్తూ ఇలా న్నాడు : ‘‘దానిదేముంది రామయ్యా ! ఈ డబ్బుతో నీ కూతురి పెళ్ళి జరిపించు. నాకు నువ్వు వడ్డీ ఇవ్వ నవసరం లేదు. అసలు కూడా, నీ దగ్గర ఎప్పుడు కలిగితే అప్పుడే తెచ్చియఇవ్వు. తొందరేమీ లేదులే ! నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నా బాకీ తీర్చ వచ్చును. పోయి రా !’’ అన్నాడు ఎంతో దయగా. భూమయ్య మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ అతని మంచి తనాన్ని ఎంతగానో పొగిడారు !
    భూమయ్య ఇంట్లో పని చేసే  గోపాలుడు అనే నౌకరు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తూనే న్నాడు. వాడికి తన యజమాని మాటలు నమ్మ బుద్ధి కాలేదు. బయటకి మంచి తనం చూపిస్తున్నా, యజమాని మనసులో ఏదో దురూహ ఉండే ఉంటుందని వాడు అనుమానించాడు.
     వాడు అనుమానించి నట్టే అయింది ! ఆ మర్నాడే భూమయ్య నౌకరు గోపాలుడిని పిలిచి ఇలా చెప్పాడు : ‘‘ నువ్వు వెంటనే రామయ్య ఇంటికి వెళ్ళు. అనుకోని అవసరం వచ్చి పడింది. అతనికి నేను నిన్న ఇచ్చిన వెయ్యి రూపాయలలో నాలుగు వందల రూపాయలు అడిగి తీసుకురా ! సాయంత్రానికి తిరిగి ఇస్తానని చెప్పు. రమయ్య కూతురి పెళ్ళికి ఇంకా  వారం రోజుల వ్యవధి ఉంది కదా ! ’’ అన్నాడు. గోపాలుడికి  యజమాని ఎత్తు తెలిసి పోయింది. చేసేది లేక, రామయ్య దగ్గరికి వెళ్ళి ,యజమాని చెప్పి నట్టే చెప్పాడు. రామయ్య ఇచ్చిన నాలుగు వందలూ తెచ్చి భూమయ్య చేతికి ఇచ్చేడు.  మరుచటి దినం కూడా మరో సాకుతో  మరో రెండు వందలు తెప్పించు కున్నాడు భూమయ్య. భూమయ్యకి ఏం అవసరం వచ్చిందో , పాపం ! అను కున్నాడే కానీ రామయ్యకి అతని మీద అనుమానం రాలేదు. పెళ్ళికి ఇంకా వ్యవధి ఉంది కనుక భూమయ్య  వెనక్కి తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాడనే నమ్మాడు రామయ్య. మూడో నాడు భూమయ్యే నేరుగా రామయ్య ఇంటికి వచ్చి, కన్నీళ్ళు పెట్టుకుని ఏదో కారణం చెప్పి ఆ సాయంత్రమే మొత్తం వెయ్యి రూపాయలూ మళ్ళీ ఇస్తానని చెప్పి  నాలుగు వందలు తీసుకుని పోయేడు ! దీనితో రాయ్యకి ఇచ్చిన వెయ్యి రూపాయలూ తిరిగి భూమయ్య తీసుకున్నట్టయింది ! ఆ సాయంత్రం కాదు కదా, మర్నాడు కూడా భూమయ్య అతనికి డబ్బు సర్దుబాటు చెయ్యనే లేదు. దానితో రామయ్య కళ్ళ నీళ్ళపర్యంత మయ్యేడు. ఇదంతా గమనిస్తున్న గోపాలుడు యజమాని నీచత్వాన్ని అసహ్యించుకున్నాడు.
    తన యజమానికి ఎలాగయినతా గుణపాఠం నేర్పాలని గట్టిగా అనుకున్నాడు ఆ రోజు రాత్రి భోజనాల వేళ భూమయ్య విస్తట్లో గోపాలుడు అన్ని పదార్ధాలూ వడ్డించేడు. తీరా యజమాని తిన బోతూ ఉంటే, ఆగమని చెప్పి,ఉప్పు తక్కువయిందనో, పులుపు చాల లేదనో, కారం వెయ్యడం మరచి పోయాననో చెబుతూ అతని వస్తట్లో నుండి ఒక్కో పదార్ధమూ తీసెయ్యడం మొదలు పెట్టాడు ! చివరకి విస్తరంతా ఖాళీ అయింది ! గోపాలుడు మళ్ళీ పదార్ధాలను వడ్డిస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడు భూమయ్య. కానీ ఎంత సేపు ఎదురు చూసినా, వడ్డంచడే !  దాంతో భూమయ్య కోపంతో ఊగి పోయాడు. ‘‘ విస్తట్లో వడ్డించి నట్టే వడ్డించి ,అన్నీ తీసేస్తా వేమిట్రా గాడిదా ! ’’ అంటూ గోపాలుడిని కొట్టడానికి చేయెత్తాడు. కానీ , అంత లోనే అతనికి గోపాలుడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనసుకి తట్టింది. రామయ్యకి తను చేసిన ద్రోహానికి ఇది ప్రతీకారమని  అతను గ్రహించాడు !  సిగ్గుతో తల దించు కున్నాడు.
ఆ మర్నాడే రామయ్యని పిలిపించి, అతని కుమార్తె పెళ్ళికి డబ్బు సర్దుబాటు చేసాడు ! అంతే కాక, వధువు చేతిలో విలువైన కానుకలు ఉంచి శీర్వదించేడు !
  ఆ నాటి నుండీ భూమయ్యలో పిసినారి తనం కలికానికి కూడా కనిపించ లేదు !

26, అక్టోబర్ 2014, ఆదివారం

రామయ్య, సోమయ్యల కథ !


అనగా అనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే అన్నదమ్ములు ఉండే వారు. వారిలో రామయ్య పేదరికంతో బాధ పడుతూ ఉండే వాడు. ఒక చిన్న గుడిసెలో సాదాసీదా జీవితం గడుపుతూ ఉండే వాడు. సోమయ్య మాత్రం వ్యవసాయం మీదా, వ్యాపారాల మీదా బాగా సంపాదించి,  విలాసవంతమయిన జీవితం గడుపుతూ ఉండే వాడు. పెద్ద భవంతి కట్టుకుని అందులో భార్యా పిల్లలతో దర్జాగా గడుపుతూ ఉండే వాడు. రామయ్య  భార్య ఒంటి మీద ఒక్క పసుపు తాడు తప్ప వెండి బంగారాలేమీ ఉండేవి కావు. పిల్లలకి కూడా మంచి బట్టలు ఉండేవి కావు.  అయినా సరే,  ఆ కుటుంబంలోని వారంతా  ఏ విచారమూ లేనట్టుగా ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండే వారు. నిత్యం ఆనందంగానే కాక, పూర్తి ఆరోగ్యంగా కూడా ఉండే వారు.
       సోమయ్య  కుటుంబం మాత్రం ఎంత సంపద న్నా సరే నిత్యం ఏదో అసంతృప్తితో రగిలి పోతూ ఉండేది.  అతని భార్యకు ఎన్ని నగలు, ఎన్ని చీరలు  ఉన్నా, ఇంకా చాలవని భర్తను వేధిస్తూ ఉండేది.అతని పిల్లలు కూడా దుబారా ఖర్చులకు అలవాటు పడడంతో ఎంత డబ్బూ చాలేది కాదు. రోజూ ఇంట్లో  అంతా దేనికో ఒకదానికి గొడవ పడుతూ ఉండే వారు.  అంతే కాదు, తరచుగా వారు ఏదో ఒక రోగాన పడుతూ ఉండే వారు. రామయ్య ఇంటికి వచ్చిన అతిథులకు కలిగినంతలో పెట్టి తృప్తి పరచి పంపుతూ ఉండే వాడు. సోమయ్య  సంగతి తెలిసి ఆ ఇంటికి ఎవరూ వచ్చే వారు కాదు. అంత పెద్ద భవనమూ బోసి పోయి ఉండేది.
      ఏమీ లేక పోయినా,  అన్నగారి కుటుంబం అంత ఆనందంగా ఎలా ఉండ గలుగుతోందో తెలుసు కోవాలని  సోమయ్యకు కుతూహలంగా ఉండేది. అయితే, డబ్బుందనే అహంకారంతో  బంధుత్వాన్ని ప్రక్కన పెట్టిన సోమయ్యకు  అన్న గారిని ఆ విషయం అడగడానికి ముఖం చెల్లేది కాదు !
    ఇలా ఉండగా, ఒక రోజు మునిమాపు వేళ రామయ్య దారంట పోతూ ఉంటే, అతని కాలిలో ముల్లు గుచ్చకుంది. బాధతో ‘‘ అమ్మా !’’ అని, అంత లోనే తేరుకుని, ముఖంలో ప్రశాంతత తెచ్చుకున్నాడు. ఇదంతా అతని వెనుకగా  నడచి వస్తున్న   సోమయ్య కంట పడింది. ఆశ్చర్య పోయాడు ! ఇక ఉండబ్టట లేక, అన్న గారిని ముల్లు గుచ్చుకున్న బాధను అంత లేనే ఎలా మరచి పోగలిగావని అడిగాడు.
    దానికి రామయ్య నవ్వుతూ  ఇలా అన్నాడు : ‘‘ముల్లు గుచ్చు కుంటే ఎవరికయినా బాధ కలగడం సహజమే తమ్ముడూ ! కానీ ఇప్పుడు నాకీ ముల్లు కాలిలో గుచ్చు కుంది కానీ , కంట్లో గుచ్చుకో లేదు కదా ! అనే ఆలోచన వచ్చింది. అందుకే క్షణంలో నా బాధంతా చేత్తో తీసి పారేసినట్టయింది! ’’ అనిచెప్పాడు.
     అన్న గారి కుటుంబం అంత ఆనందంగా ఎలా ఉండ గలుగుతోందో  ఆ మాటలతో అర్ధమయింది సోమయ్యకి ! కలిగినంతలో తృప్తి పడడం, బాధలోనూ సుఖం వెతుక్కోడం వల్లనే తమ్ముడి కుటుంబం అంత ఆనందంగా ఉంటోందని అతనికి అర్ధమయింది. అహంకారంతో అందరినీ దూరం చేసు కోకుండా, నలుగురితో కలిసి మెలసి ఉంటే , ఆ యింట సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని కూడా గ్రహించాడు.      ఆ రోజు నుండీ  సోమయ్యలో మంచి మార్పువచ్చింది., భార్యా పిల్లలకి నచ్చ చెప్పివారిలో  కూడా మంచి మార్పు తీసుకొచ్చేడు. అన్న గారి కుటుంబంతో చక్కగా రాకపోకలు సాగించేడు.    
  ఇప్పుడు ఆ అన్నదమ్ముల అన్యోన్యతని మెచ్చుకోని వారంటూ  లేరు ! 

24, అక్టోబర్ 2014, శుక్రవారం

తిరగబడిన చిలుక తల్లి జోస్యం !


చిలకలపల్లిఅడవిలో పచ్చని చెట్లు విస్తారంగా ఉన్నాయి. వాటి మీద లెక్క లేనన్ని చిలకలు నివసిస్తూ ఉండేవి. అవి చేసే సందడి అంతా యింతా  కాదు ! తియ్య తియ్యని పండ్లను తింటూ, చిలుక పలుకులు పలుకుతూ అవి హాయిగా బ్రతుకుతూ ఉండేవి.
     వాటిలో ఒక కొంటె చిలుక కూడా ఉండేది. దాని చిలిపితనం చెప్పతరం కాదు !
ఎప్పుడూ ఏదో చిలిపి చేష్ట చేస్తూ,  తక్కిన వాటిని కడుపుబ్బా నవ్విస్తూ ఉండేది.  అది వయసులో అన్నిటికన్నా పెద్దది కావడం చేత, మిగతా చిలుకలన్నీ  దానిని ‘‘ చిలుక తల్లీ !’’ అని పిలుస్తూ ఉండేవి.  చిలుక తల్లి చేసే కొంటె పనులతో అవి ఒక్కో సారి అయోమయంలో పడిపోతూ ఉండేవి కూడా ! చిలుక తల్లి ఏవో అబద్ధాలు చెప్పి , వాటిని నమ్మిస్తూ ఉండేది. దాని  మాయ మాటలు విని అవి మోస పోతూ ఉండేవి. తన మాటకారితనంతో  వాటిని బురిడీ కొట్టించి వినోదించడం చిలుక తల్లికి ఒక వ్యసనంగా మారిపోయింది.
     ఒక్కో సారి ఫలానా తిథి నాడు భూ ప్రళయం వస్తుందని భయ పెట్టేది. మరోతూరి గ్రామం పొలిమేరల్లో ఉండే అగ్ని పర్వతం బ్రద్దలై పెను ముప్పు కలుగుతుందని హడలు కొట్టేది. ఇంకో సారి పదుల సంఖ్యలో బోయలు వచ్చి చిలుకల నన్నింటినీ ఉచ్చులు వేసి బంధించి తీసుకు పోనున్నారని అదర గొట్టేది. మరొక సారి , అడవి చెట్లన్నీ అకారణంగా కూలి పోయి, చిలుకలు తినడానికి ఒక్క పండూ మిగలదని జోస్యం చెప్పేది.  తీరా గడువు దాటి పోయినా ఏ ఆపదా కలగక పోవడంతో  చిలుకలు ఊపిరి పీల్చు కునేవి ! ఇలా  చిలుక తల్లి జోస్యం పేరుతో ఎన్ని సార్లు బెదర గొట్టినా,  ఆఅమాయకపు చిలుకలు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉండేవి !
     ఇలా ఉండగా, ఒక రోజు నిజంగానే ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చి. అక్కడి చిలుకలని పట్టుకోడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ వాడి చేతికి చిలుక తల్లి  చిక్కింది !  వాడు దానిని తీసుకుని పోయి, చెట్టు క్రింద చిలుక జోస్యం చెప్పే వాడికి అమ్మేసాడు. వాడు దాన్ని పంజరం లాంటి పెట్టెలో బంధించాడు. ఎగిరి పోకుండా రెక్కలు సన్నగా కత్తిరించాడు. పెట్టె మీద చేతి వేళ్ళతో తాను కొడుతూ ఉంటే , క్రింద  పరచి ఉంచిన కాగితాల కట్టలోంచి ఒక కాగితాన్ని ముక్కుతో తీసి ఇవ్వడం ఎలాగో దానికి తర్ఫీదు ఇచ్చేడు. ఇప్పుడు దాని పని ఆ జోస్యం  అబద్ధమని తెలిసినా కాగితాల కట్టలోంచి ఒక కాగితం తీసి ఇచ్చి, తిరిగి బుద్ధిగా పెట్టె లోకి దూరి పోవడమే అయింది ! కొంటె తనంతో నేస్తాలకి అబద్ధపు జోస్యాలు చెప్పి, అదరగొడుతూ ఉండే  చిలుక తల్లికి ఇప్పుడు నిజంగానే అబద్ధపు జోస్యం చెప్పే  దుస్థితి దాపురించింది !  అందుకది చింతిస్తూ ఉండేది. ఏమీ చేయ లేని అసహాయతతో అది కుమిలి పోతూ ఉండేది.
     ఇలా ఉండగా, ఒక రోజు అక్కడికి ఒక వీధి రౌడీ వచ్చేడు. వాడు లోగడ  అక్కడ చిలుక జోస్యం చెప్పించు కున్నాడు. ఆ జోస్యం ఏ మాత్రం నిజం కాలేదని వాడు కోపంతో ఊగి పోతూ అక్కడికి వచ్చేడు ! ఆగ్రహంతో నానా మాటలూ అంటూ వాడు చిలుక తల్లి ఉండే పెట్టెను కాలితో బలంగా ఒక్క తాపు తన్నేడు ! పెట్టెతో పాటూ దూరంగా ఎగిరి పడిన చిలుక తల్లికి వొళ్ళంతా బాగా గాయా లయ్యాయి.
    జోస్యం నెపంతో లోగడ అడవి లోని తోటి చిలుకలని తాను ఆటపట్టిస్తూ ఉండడం చిలుక తల్లికి గుర్తుకొచ్చింది. ఆ పాపమే ఇప్పుడు తనపాలిట శాపమయిందని అది ఎంతగానో విచారించింది !
    ఆపసోపాలు పడుతూ ఎలాగో తిరిగి అడవికి చేరుకుంది. అడవిలో చిలుకలన్నీ  దాని చుట్టూ చేరి జరగినదంతా అడిగి తెలుసు కున్నాయి.  చిలుక తల్లి ఏడుస్తూ జరిగినదంతా వివరించింది. అంతే కాదు, లోగడ తాను వాటితో   అబద్ధాలు కల్పించి చెప్పి , వాటిని వేళా కోళం చేసినందుకు పశ్చాత్తాప పడుతూ మన్నించమని వేడుకుంది.
 ‘‘అయ్యో ! అంతమాట లెందుకమ్మా ! మేము అవేవీ మనసులో ఉంచు కోములే !’’ అంటూ చిలుకలన్నీ అప్పటి నుండి చిలుక తల్లితో స్నేహంగా ఉంటూ గడపసాగేయి !
   ఇప్పుడు చిలకల పల్లి అడవిలో చిలుకల ఆటపాటల సందడి ఇంతా అంతా కాదు !
చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు తెలుసా !

22, అక్టోబర్ 2014, బుధవారం

కొత్త మిత్రం కుందేలు !



అనగా అనగా ఒక అడవిలో ఒక ఏనుగు, ఎలుగు బంటి, కోతి, గాడిద, ఎనుము, అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. అవి అలా స్నేహంగా ఉండడం ఒక జిత్తుల మారి నక్కకి నచ్చ లేదు. వాటి మధ్య ఏ తగాదాలూ లేకుండా హాయిగా ఉండడం చూసి ఆ తగవులమారి నక్క ఓర్చుకో లేక పోయింది ! అకారణ శతృత్వంతో వాటి నడుమ ఎలాగయినా చిచ్చు పెట్టి, వాటిని ఒకదాని కొకటి బద్ధ శత్రువులగా మారేలా చేయాలని అనుకుంది.
    ఒక రోజు ఏనుగు ఒంటరిగా ఉండడం చూసి ,అక్కడికి చేరి ఏనుగుతో ఇలా అంది : ‘‘  నీ  మిత్రులు నీ గురించి హేళనగా మాట్లాడు కుంటూ ఉంటే విన్నాను ! నువ్వు బలశాలివే కానీ , వొట్టి మంద మతివట ! నీకు తెలివితేటలు అనేవే
లేవుట ! వాళ్ళ వెటకారపు మాటలు విన లేక పోయాననుకో ! ’’అంది. దానితో ఏనుగుకి తన చిరకాల మిత్రుల మీద చెప్ప లేనంత కోపం వచ్చింది.  నక్క తరువాత ఎలుగు బంటి దగ్గరకు చేరి, ‘‘ నీ అంత అంద వికారి లోకంలోనే ఎవరూ లేరని నీ మిత్రులు  నీ వెనుక హేళన చేస్తున్నారు తెలుసా !నీ వొంటి నిండా అసహ్యంగా బొచ్చేనుట ! హవ్వ !నీ ఎదుట నిన్ను పొగుడుతూ, నీ వెనుక నిన్ను ఎంతలేసి మాట లంటున్నారో ! తలచు కుంటే కడుపు రగిలి పోతోంది ’’ అని చాడీలు చెప్పింది. దానితో లుగు బంటికి తక్కిన వాటి మీద అంతు లేని ఆగ్రహం కలిగింది. నక్క తన పాచిక పారి నందుకు లోలోన సంతోషిస్తూ తక్కిన వాటి దగ్గరకి కూడా వెళ్ళి ఇలాగే చాడీలు చెప్పి, వాటి మనసు విరిచేసింది. చపల చిత్తం కలదని కోతినీ, కర్ణ కఠోర మయిన గాత్రం కలదని గాడిదనీ, కారు నలుపూ, వికారపు శరీరం కలదని ఎనుమునూ ఎకసెక్కాలు ఆడుతున్నాయని  లవి ఒంటరిగా ఉన్నప్పుడు చాడీలు చెప్పింది. దానితో వాటికి ఒకదాని మీద ఒకదానికి చెప్ప లేనంత కోపం వచ్చింది. ఇలా వాటి మధ్య నిప్పును రాజేసి, అవి ఎలా తగవులాడుకుంటాయో చూద్దామని జిత్తుల మారి నక్క ఎదురు చూడసాగింది !
     ఇలా ఉండగా ఆ మిత్రులంతా ఒక రోజు ఒక చోట కలవడం తటస్థించింది. ఇంకేముంది ! వాటి మధ్య జగడం మొదలయింది. ఒక దాని నొకటి తీవ్రంగా దూషించు కోవడం మొదలెట్టాయి. ఇదంతా ఓ చెట్టు చాటు నుండి చూస్తూ నక్క సంబర పడుతోంది. రాను రాను వాటి మధ్య కలహం హెచ్చి, గాయాల పాలయ్యే పరిస్థితి వచ్చింది.
    ఇంతలో , ఎన్నాళ్ళనుండో వాటితో తను కూడా చెలిమి  చేయాలని అనుకుంటున్న ఒక కుందేలు అక్కడికి వచ్చింది. వాటి కలహం చూసి నివ్వెర పోయింది. చాలా బాధ పడింది. అతి కష్టం మీద వాటిని వారించింది,  వాటి కలహానికి కారణం అడిగి తెలుసు కుంది. తరువాత వాటితో లా అంది :
‘‘ చిరకాలంగా మీ అందరి స్నేహం చూసి ఎంతో ముచ్చట పడి,  నేను కూడా మీతో స్నేహం చెయ్యాలని వచ్చేను. తీరా, మీరేమో ఇలా కొట్టుకు ఛస్తున్నారు ! ఇదేం బాగు లేదు. ఇంత వరకూ మీరంతా ఒకరి లోపాలను ఒకరు ఎంచారని కదా తగవులాడు కుంన్నారు ?! ఇప్పుడు  మీ అందర లోపాలు తెలిసిన మరొక జంతువు ఉందని మీరు మరచి పోతున్నారు ! అది మీ లోపాలను అడివంతా చాటి చెప్పి, మీ పరువు తీయాలనుకుంటోంది. ఒకరికి తెలియకుండా మీలో మరొకరికి మీమీద చాడీలు చెప్పి, వినోదం చూస్తోంది ! అదిగో ! ఆ చెట్టు చాటున నక్కి
 ఉంది ! అది చెప్పినదే నిజమయితే ధైర్యంగా మీ ఎదుటికి వచ్చి చెప్పమనండి చూద్దాం !’’  అంది.
   దానితో కళ్ళు తెరచిన మిత్రులంతా ఒక్క సారిగా ఆ జిత్తుమారి నక్క మీదకి దాడి చేసి, దానిని అడవి నుండి దూరంగా తరిమి కొట్టాయి !
      ఆ రోజు నుండి కుందేలు వారికి కొత్త మిత్రమయింది !!

21, అక్టోబర్ 2014, మంగళవారం

తిండి పోతు వరదయ్య !


వెంకటాపురం అగ్రహారంలో వరదయ్య అనే వ్యక్తి ఒకడు ఉండే వాడు. వాడికి తాత తండ్రులు మిగిల్చి పోయిన ఆస్తి చెప్ప లేనంత ఉండేది. దాంతో ఏ పనీ చేయ కుండా సోమరిగా తిని కూర్చుంటూ ఉండే వాడు. వాడు గొప్ప భోజన ప్రియుడు ! ఆ భోజన ప్రియత్వం వాడిని క్రమేపీ తిండి పోతుగా మార్చేసింది! నిద్ర పోయేటప్పుడు తప్ప , మెళకువగా ఉండే సమయంలో దో తింటూ దవడ ఆడిస్తూ ఉండ వలసినదే ! అదీ ఇదీ అని కాదు. ఏది దొరికితే అది ఆబగా తినే వాడు. రుచీ పచీ లెక్కలోకి వచ్చేది కాదు. తిండి పదార్ధం దొరికితే చాలు, ఏదో నిథి దొరికి నట్టుగా సంబర పడి పోయే వాడు. డబ్బుకి కొదువ లేదు కనుక, వాడికి ఏ ఆహార పదార్థం కావాలన్నా చిటికెలో వచ్చి పడుతుడేవి.
    ఇలా అడ్డూ ఆపూ లేకుండా తింటూ ఉండడం వల్ల వాడికి అజీర్తి రోగం పట్టుకుంది ! అది కాస్త ముదిరి పోయి, ఒక్క మెతుకు నోట పెట్టు కున్నా అరిగేది కాదు. ఆ రోగంతో వాడు నానా అవస్థలూ పడ్డాడు. మునపటిలా సరైన తిండి లేక పోవడంతో విలవిలలాడి పోయేవాడు. చిక్కి శల్యమై పోయేడు. వాడికి దు:ఖం ఆగేది కాదు. తిండి తిన లేక పోతున్నానన్న విచారంతో వాడు కుమిలి పోయే వాడు. ఇక ఆ అజీర్తి బాధనీ, విపరీత మయిన కడుపు నొప్పినీ  భరించ లేక  ఒక రోజు ఆత్మ హత్య  చేసు కోవాలని అనుకుని  అడవి లోకి బయలు దేరాడు.
       అలా అడవిలో చాలా దూరం నడిచేక వాడికి తపస్సు చేసుకుంటూ ఒక ముని కనిపించేడు. వరదయ్య చేతులు జోడించి, తన బాధ ముని చెప్పు కోడానికి సిద్ధ పడ్డాడు. ముని కళ్ళు తెరచి, ‘‘ ఏం కావాలి నాయనా ! ’’ అనడిగేడు దయతో.
ముని అలా అడిగే సరికి వరదయ్య తన అజీర్తి రోగాన్నీ, కడుపు నొప్పినీ మరచి పోయి, ‘‘ స్వామీ ! నాకు నిత్యం పంచ భక్ష్య పరమాన్నాలు దొరికేలా  వరం అనుగ్రహించండి !’’ అని వేడు కున్నాడు. ముని సరే అని వరదయ్యని దీవించేడు.  వరదయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆత్మ హత్యా ప్రయత్నం మానుకుని ఇంటికి వెళ్ళి పోయేడు.
     ఇంట్లో అడుగు పెడుతూనే వాడికి తన ఇంట్లో లెక్క లేనన్ని పాత్రలలో మంచి మంచి భోజన పదార్ధాలు కనబడ్డాయి ! వాడి ఆశ్చర్యానికీ, సంతోషానికీ లెక్క లేకుండా పోయింది! కాస్సేపటికి ఆశ్చర్యం నుండి తేరుకుని వాటిని ఆబగా తిన బోయాడు . అప్పుడు చప్పున వాడికి తన అజీర్తి రోగం, కడుపు నొప్పి గుర్తు కొచ్చింది! ఒక్క ముద్ద నోట పెట్ట లేక పోయాడు. కడుపు నొప్పితో మెలి తిరిగి పోతూ మంచాన పడ్డాడు. కళ్ళెదుట అంత రుచి కరమయిన తిండి చెప్ప లేనంత కనబడుతున్నా, తిన లేని తన అవస్థకి వాడికి ఏడుపు ఆగింది కాదు.
     తిండీ తిప్పలూ లేక ఆ రాత్రి చాలా సేపటికి కానీ వాడికి నిద్ర పట్ట లేదు. కునుకు పట్టేక, కలలో ఆ ముని కనబడి వరదయ్యతో ఇలా చెప్పాడు :
 ‘‘ నాయనా ! నీ పరిస్థితి చూస్తూ ఉంటే జాలి కలుగుతోంది. ఏ పనీ చేయకుండా తింటూ కూచోడం మంచిది కాదు. అలాగే ఎవరికీ పెట్ట కుండా ఒక్కడివే తినడం కూడా తగదు. మితాహారం తీసు కుంటూ, దాన ధర్మాలు చేస్తూ, చక్కగా పని పాటలు  చేసుకుంటూ ఉండే నీ  ఆరోగ్యం కుదుట పడుతుంది !’’ అని హితవు చెప్పాడు.
    అప్పటి నుండి వరదయ్య లో చాలా మార్పు వచ్చింది. మితంగా తినడం, సోమరి తనం విడిచి పెట్టి పని చేయడం, ఇతరులకు సాయ పడుతూ దానధర్మాలు చేయడం అలవాటు చేసు కున్నాడు. దానితో వాడి అజీర్తి రోగం, కడుపు నొప్పీ తగ్గి పోయాయి. వాడి ఆరోగ్యం కుదుట పడింది.

   అంతే కాదు, ఇప్పుడు వాడికున్న ‘‘ తిండి పోతు వరదయ్య’’ అనే చెడ్డ పేరు కూడా తొలగి పోయింది !

10, అక్టోబర్ 2014, శుక్రవారం

రాజు గారి వేట వ్యసనం !!


నందన రాజ్యాన్ని నందుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండే వాడు. అతనికి వేట ఒక వ్యసనంగా మారింది. వేట నందుడికి ఎంత వ్యసనంగా మారిందంటే, రాజకార్యాలేవీ పట్టించు కోనంత ! ఏడాది పొడుగునా వేట కోసం మందీ మార్బలంతో అడవిలో విడిది చేసే వాడు. పరిపాలనను గాలి కొదిలీసేడు.
    రాజు గారి వేటంటే మాటలా ! అందమైన గుడారాలు, చవులూరించే వంటలు యారు చేయడానికి వంట వాళ్ళూ, రాజు గారిని ఉల్లాస పరిచేందుకు నాట్యకత్తెలు, సంగీత వాద్య కళాకారులు, విదూషకులూ, వందిమాగధులూ ... వాహ్ !
ఒకరేమిటి ! రాజు గారి వెంట అడవికి రాచ నగరంతా తరలి వెళ్ళేది. నందుడికి రాజ వైభవాలన్నీ అడవిలోనే అమరి పోయేవి ! ఇంకేం ! రాజ పాలన కుంటు పడింది. అస్సలు పట్టించు కోవడమే మానేసాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు. సామాన్య  ప్రజలు నానా అవస్థలూ పడే వారు.
     ఇలా ఉండగా, ఒక రోజు అడవిలో  వేటాడుతూ ,నందుడు దారి తప్పి పోయేడు. అతని పరివారమంతా బాగా వెనుకబడి పోయింది. రాజు ఒంటరిగా కీకారణ్యంలో చిక్కుకు పోయేడు ! చాలా దూరం నడచి నడచీ బాగా అలసి పోయేడు. ఆకలితో కడుపు దహించుకు పోసాగింది. దాహంతో నాలుక పిడచ కట్టుకు పోయింది. చిత్రంగా అడవి చెట్లన్నీ మ్రోడు వారి పోయాయి ! అడవి నందుడి కంటికి ఎడారిలా కనిపించ సాగింది ! ఎక్కడా తిండీ, నీరూ దొరికే సూచనలు లేవు. అలసట వల్ల నిద్ర ముంచు కొస్తోంది. రాజుకి దు:ఖం వచ్చింది. ఏడు పొక్కటే తరవాయి !
     ‘‘ దేవా ! గుక్కెడు నీళ్ళూ , పిడికెడు అన్నమూ ఇప్పించవయ్యా ! సుఖంగా నిద్ర పోయేందుకు సురక్షితమైన చోటు చూపించవయ్యా !’’ అని, గుర్తొచ్చిన దేవుళ్ళనందరినీ వేడు కున్నాడు.
    అడివంతా కలియ తిరిగాడు. రాజుకి మతి పోయింది. పచ్చగా ఉండే అడవంతా ఇప్పుడు వెలవెలబారి పోయి ఉంది. విరగ కాసే పళ్ళ చెట్లకు ఒక్క పండూ  కనిపించడం లేదు. రాజుకి ఆందోళన ఎక్కు వయింది . పిచ్చెత్తినట్టు అడవంతా తిరిగాడు. ఒకే ఒక్క చోట, ఒక చెట్టుకి ఒకే ఒక్క పండు కనిపించింది!
 రాజుకి ప్రాణం లేచొచ్చినట్టయింది. దానిని కోసుకుని తినబోయాడు. అంతలో
ఆ చెట్టు కింద కూర్చుని ఒక కుర్రాడు ఆకలికి ఏడుస్తూ కనిపించాడు. రాజుకి వాడిని చూసి జాలి వేసింది. ఆకలి బాధ చల్లార్చు కోవడం కోసం నోట పెట్టుకో బోతున్నఆ ఒక్క  పండుని వాడికి ఇచ్చేసాడు. వాడు ఆ పండు తిన్నాడో, లేదో, వెంటనే మాయమై పోయాడు ! రాజు ఆశ్చర్యానికి అంతు లేదు ! అంత లోనే అడవిలో చెట్లన్నీ మునుపటి లాగే పళ్ళతో కళకళలాడుతూ కనిపించాయి. కావలసిన పళ్ళని  కోసుకుని తిందామని రాజు అనుకుంటూ ఉండేంతలో విపరీత మయిన మంచు తుఫాను కురిసింది.  రాజు మంచులో తడిసి ముద్దయి పోయాడు, చలికి వణికి పోసాగేడు. ఒంతలో, ఒక ముసిలామె ఒక చెట్టు కింద చలికి వణికి పోతూ అతని కంట పడింది. రాజు జాలితో ఆమెకు తన ఒంటి మీద బట్ట తీసి ఇచ్చేడు. అంతే ! ఆమె వాటిని అందుకుందో, లేదో, అంత మంచు తుఫానూ మాయమై పోయింది. మళ్ళీ అడివంతా ఎప్పటి లాగే ప్రశాంతంగా ఉంది ! రాజు ఈ సారి మరింతగా ఆశ్చర్య పోయాడు. ఈ వింత మార్పులకి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ముందుకి నడిచాడు ఇంతలో. అడవిలో ఒక్క సారిగా దావాలం చెలరేగింది.  ఆ మంటల్లో ఒక కుందేలు చిక్కుకు పోయి, వివిలాడుతూ ఉండడం రాజు కంట పడింది. ఏ మాత్రం ఆలోచించ కుండా, రాజు  దయతో దానిని కాపాడి, అడవిలో వదిలేసాడు.
    అప్పుడు రాజుతో ఆకాశ వాణి ఇలా అంది : ‘‘ ఓ రాజా ! నీ వేట వ్యసనం వల్ల అడవి లోని జంతు జాలం నానాటికీ తగ్గిపోతోంది . నీ వల్ల, నీ పరివారం వల్ల అడివంతా నాశనమై పోతోంది. నీకిది తగదు సుమా !  అయితే, ఒక విషయం ! నువ్వు ఆకలితో ఏడుస్తున్న బాలుడికి , చలికి వణికి పోతున్న వృద్ధురాలికి, సాయం చేస్తున్నప్పుడు నీకు నీ ఆకలి దప్పులు కానీ, చలి బాధ కానీ గుర్తుకు రాలేదు ! అంటే, నువ్వు నీ రాజ ధర్మాన్ని పూర్తిగా మరచి పో లేదన్న మాట ! అలాగే. చేతికి చిక్కిన కుందేలుని కాపాడి వదిలి పెట్టావంటే, నీ వేట వ్యసనం నిన్ను ఇంకా పూర్తిగా నిర్దయుడిగా చేయ లేదన్నమాట.  నీలో ఇంకా రాజధర్మం, మానవత్వం మిగిలే ఉన్నాయి. ఒక్క నీ వేట వ్యసనం వల్ల నీకూ, నీ ప్రజలకీ అనర్ధం జరుగుతోంది. దానికి ప్రతీకగానే అడవిలో  పచ్చని చెట్లన్నీ అకస్మాత్తుగా మ్రోడు వారి పోవడం, మంచు తుఫాను కురియడం, దావానలం వ్యాపించడం మొదలైనవి జరిగాయి. ఈ విపరీతాలన్నీ నీకు కను విప్పు కలిగించడం కోసం
వన దేవత సృష్టించినవే ! అందు చేత, నువ్వు ఇక నయినా ఈ వేట వ్యసనాన్ని తగ్గించుకుని, నీ ప్రజలను చక్కగాపరిపాలించు ! నీ రాజ్యం లోని ప్రజల ఇక్కట్లు తొలిగించు. అది నీ ధర్మం ! ’’ అంది.      రాజుకి కనువిప్పు కలిగింది. ఇంతలో పరివారమంతా వెతుక్కుంటూ వచ్చి, రాజుని చేరారు.    ఆ నాటి నుండి, క్షత్రియ ధర్మంగా ఎప్పుడో తప్ప రాజు వేటకు రావడం లేదు.    అప్పటి నుండి నందుడి రాజ్యం సుభిక్ష మయింది !! సామాన్య ప్రజల సంతోషం ఇంతా అంతా కాదు!!

8, అక్టోబర్ 2014, బుధవారం

ముసలి చెట్టూ, మధుర ఫలాలూ


అబ్బో, ఇప్పటిదా ఆ చెట్టు ! వందల సంవత్సరాల వయసున్న చెట్టు కాదూ,అది !! కొంత మందయితే కొంత ఎక్కువ చేసి. భూమి పుట్టిన దగ్గర నుండీ ఆ చెట్టు అక్కడ ఉందంటూ ఉంటారు కూడానూ !వాళ్ళ మాటల కేం గానీ, అంత పాత కాలం నాటి చెట్టన్నమాట అది. చాలా ఏళ్ళ పాటు అది గుబురుగా పెరిగిన కొమ్మలతో, రెమ్మలతో విరగ కాసేది. పచ్చని వెడల్పయిన పెద్ద ఆకులతో అది ఆకుల కొండలా ఉండేది. దాని మీద రకరకాల పక్షులు కిలకిలారావాలు చేస్తూ  సందడి చేసేవి. ఎక్కడి నుండో వచ్చిన బాటసారులు ని కింద చేరి హాయిగా సేదతీరే వారు. దాని పళ్ళు ఎంత తీయగా ఉండే వంటే, ఎన్ని తిన్నా తనవి తీరేది కాదు !
    అలాంటిది, ఇప్పుడా చెట్టు ముసలిదై పోయింది. కొమ్మలు ఎండి పోయేయి. పచ్చదనం పోయి, మ్రోడులా తయారయింది.  ఆకులు రాలి పోవడంతో నీడ కూడా కరువయింది. పక్షులు వేరే చోటికి వెళ్ళి పోయేయి. ఇప్పుడు నీడ కోసం దాని కిందకి ఎవరూ రావడం లేదు. కాని రోజులు దాపురించాయి. కుక్కమూతి పిందెలు కాస్తున్నాయి.ఇవాళో రేపో అవి కూడా ఉండవు.  తన పరిస్థితి తలచుకుని చెట్టుకి దుఃఖం ఆగడం లేదు. చెట్టు యజమాని కొడుకులు ఇక ఆ చెట్టుని కలప కోసం, వంట చెరకు కోసం కొట్టెయ్యాలనుకున్నారు. ఈ తరం కుర్రాళ్ళు కదా ! యజమాని మాత్రం చాలా మంచి వాడు. చెట్టు మీద గొడ్డలి పడితే, తన మెడ మీద పడ్డట్టే అని కొడుకులని హెచ్చరించాడు. దానితో వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు.
    ఒక రోజు ఒక సాధువు ఆ చెట్టు దగ్గరకి వచ్చేడు. చెట్టు ఆ సాధువుతో తన గోడు వెళ్ళబోసు కుంది. మునపటిలా తాను ఎవరికీ పనికి రాకుండా పోతున్నానని కన్నీళ్ళు పెట్టుకుంది. తన పళ్ళు కూడా ఇంతకు ముందులా తియ్యగా లేక పోవడంతో ఎవరూ కనీసం కొరికి కూడా చేడడం లేదని ఏడుస్తూ చెప్పింది. 
సాధువు దాని బాధ అర్ధం చేసు కున్నాడు. దాని ఆవేదన తీరేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించాడు.
      ఆ  సాధువు ఒక పథకం ప్రకారం చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఒక వార్తను వ్యాపించేలా చేసాడు. ఆ వార్త సుడి గాలిలా అంతటా వ్యాపించింది, అదేమిటంటే,
ఆ ముసలి చెట్టు కాసే ఫలాలో కేవలం రోజుకి ఒక్కటి మాత్రం చాలా మహిమ కలది ! ఆ చెట్టు రోజుకి ఒక్క తియ్యనైన పండును మాత్రం ఇస్తోంది ! ఆ ఒక్క పంటూ ఎవరయితే తింటారో, వారికి సకల సంపదలూ సమకూరుతాయి ! సమస్త ఆరోగ్యాలూ చేకూరుతాయి ! పిల్లా పాపలతో కలకాలం హాయిగా ఉంటారు ! ఇదీ ఆ వార్త సారాంశం !
   మునుపటిలా ఆ చెట్టు పళ్ళు తియ్యగా లేక పోయినా,వాటిలో ఏది మహిమ గల పండో తెలియక, జనం చేతికి దొరికిన దానిని ఆత్రంగా కోసుకుని తిన
సాగేరు ! మళ్ళీ అంతా తన చుట్టూ చేరుతూ ఉండడంతో ముసలి చెట్టుకి మనసు లోని బెంగ తీరి పోయింది. అదిప్పుడు మళ్ళీ ఎప్పటిలాగే  పచ్చగా కళకళలాడుతోంది. దాని ఫలాలు మునుపటి రోజుల వలె ఎంతో తియ్యగా ఉంటునాయి కూడా ! పక్షులు తిరిగి ఆ చెట్టు మీదకి చేరు కున్నాయి. పాదచారులు అక్కడే సేద తీరుతున్నారు.ముసలి చెట్టులో ఈ మార్పు అందరికీ ఆశ్చర్యం కలిగించింది! అందరితో పాటు యజమాని కూడా ఈ వింతకి చాలా ఆశ్చర్య పోయాడు.
   ఒక రోజు  యజమాని వేకువ సమయంలో ఒంటరిగా వచ్చి, ఇంత లోనే చెట్టు మళ్ళీ పచ్చగా కళకళలాడుతూ ఉండానికి కారణ మేమిటని అడిగాడు.
   దానికి చెట్టు ఇలా జవాబు చెప్పింది : ‘‘ అయ్యా !చెట్లు తమ ఫలాలను తాము తినవు. నదులు తమ జలాలను తాము త్రాగవు. నేల తల్లి తన పంటను తాను తినెయ్యదు. అవన్నీ ఇతరుల కోసమే ! పరోపకారం కోసమే. ఎప్పుడయితే నాపండ్లను జనం తినడం మానీసేరో అప్పటి నుండి నేను మ్రోడు వారి పోవడం మొదలయింది. ఎప్పుడయితే జనం తిరిగి నావద్దకు వస్తూ నా ఫలాలను తినడం తిరిగి మొదలెట్టారో, అప్పటి నుండి నాలో కొత్త జవజీవాలు  కలిగేయి.
 పరోపకారం చెయ్యడంలో ఉండే తియ్య దనమే , నా పండ్లకీ వచ్చింది !’’ అని.
సాధువు దయ వల్ల, ఆ ముసలి చెట్టు మళ్ళీ చాలా ఏళ్ళ పాటుచల్లని నీడనిస్తూ, మధురమైన పండ్లను అందిస్తూవేలాది పక్షులకు ఆలవాలమై అలరింది !

   ఆ ముసలి చెట్టు ఇచ్చే మధుర ఫలాలు అంటే ఇప్పుడు అందరికీ ఎంతఇష్టమో చెప్పలేం ! !